త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 140 మంది ఐఏఎస్‌లు.. 20 మంది క‌లెక్ట‌ర్ల బ‌దిలీలు.. ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్ల‌పై హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Harish Rao | తెలంగాణ‌లో కొన‌సాగుతున్న ఐఏఎస్ అధికారుల బ‌దిలీల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్పందించారు. ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తే ప‌రిపాల‌న ఎలా న‌డుస్తుంది అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. ఇప్ప‌టికే 140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. 20 మంది కలెక్టర్లను మార్చారని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Mar 4, 2026, 5.27 pm IST

Harish Rao | 140 మంది ఐఏఎస్‌లు.. 20 మంది క‌లెక్ట‌ర్ల బ‌దిలీలు.. ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్ల‌పై హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

ఆరు నెల‌ల్లోపే ఎంతో మంది క‌లెక్ట‌ర్లు బ‌దిలీలు..
న‌చ్చితే మంచి పోస్టింగ్‌లు.. లేక‌పోతే బ‌దిలీలు
ఎలా పాలించాలో రేవంత్ రెడ్డికి తెలియడం లేదు
అధికారుల బ‌దిలీలతో రాష్ట్రానికి అన్యాయం..
యంగ్ ఇండియా స్కూళ్ల‌ల్లో అవినీతి బ‌య‌ట‌పెడుతా
క‌లెక్ట‌ర్ల‌ను బెదిరించ‌డం స‌రికాదు..
80 శాతం జీవోలు ఆఫ్‌లైన్‌లో
పాల‌నంతా జోక్ అయిపోయింది..
ఐఏఎస్‌ల బ‌దిలీల‌పై హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో కొన‌సాగుతున్న ఐఏఎస్ అధికారుల బ‌దిలీల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్పందించారు. ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తే ప‌రిపాల‌న ఎలా న‌డుస్తుంది అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. ఇప్ప‌టికే 140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. 20 మంది కలెక్టర్లను మార్చారని ఆయ‌న తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో న‌లుగురు క‌లెక్ట‌ర్లు మారారు. కలెక్టర్‌కు జిల్లాపై అవగాహనా రావడానికే ఆరునెలలు పడుతుంది. ఆరునెలల లోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. క‌లెక్టర్లను ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బ తింటోంది. వాళ్లకు నచ్చితే మంచి పోస్టింగ్‌లు..లేకపోతే బదిలీలు చేస్తున్నారంటూ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రాష్ట్రాన్ని ఎలా పాలించాలో రేవంత్ రెడ్డికి తెలియ‌డం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌ను పూట‌పూట‌కు మార్చ‌డం వ‌ల్ల పాల‌న‌లో ఫ‌లితాలు రావు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జ‌రిగాయి. విభాగ అధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదు. విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారు. విద్యుత్ శాఖలో అధికారుల మార్పు తీవ్ర ప్రభావం చూపింది. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలాకుతలం అయింది. అవినీతి మయం అయింది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

అధికారుల బ‌దిలీలు పెద్ద జోక్

  • సింగరేణిలో కూడా నలుగురు మారారు. జీహెచ్ఎంసీలో కూడా నలుగురు, ఐ అండ్ పీఆర్‌లో నలుగురు, పాఠశాల విద్యాశాఖలో నలుగురు, ఆరోగ్య శ్రీలో ఎనిమిది మంది, పంచాయతీ రాజ్ శాఖలో నలుగురు, మున్సిపల్ శాఖలో ఐదుగురు, ఐటీ శాఖలో ముగ్గురు, మైనింగ్ శాఖలో ఆరుగురు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ముగ్గురిని మార్చారు. ఇట్లా మారిస్తే పాల‌న ఎలా న‌డుస్తుంది. అధికారుల బ‌దిలీలు పెద్ద జోక్ అయిపోయాయి. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదు..

  • సీఎం, మంత్రులకు నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడగింపు సాధారణం అయిపోయింది. డజన్ మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్స్‌టెన్ష‌న్ ఇచ్చారు. వందల మంది ఇంజినీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో అధికారుల ప‌ద‌వీకాలం పొడిగింపుపై ఇదే కాంగ్రెస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి వాళ్లు చేస్తున్న‌దేమిటీ..? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో అవినీతి

  • యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారు. వీటన్నిటి వివరాలు త్వరలో బయటపెడుతాను. ఇంజినీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోంది. అధికారుల‌ను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. కలెక్టర్లకు కనీసం రేండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయి. కేసీఆర్ హయాంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛనిచ్చి పని చేయించారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదు..

  • ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదు. తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. సీఎం తప్పులకు తామెందుకు భాద్యులం కావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బదిలీలు, ఎక్స్‌టెన్షన్ పద్ధతి మంచిది కాదని పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిగా ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాం. ఈ సలహాలను విమర్శలుగా కాకుండా నిర్మాణాత్మక సూచనలుగా స్వీకరించాలని కోరుతున్నాం. అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలి అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఐటీ కార్యదర్శిగా సీఎస్ ఎలా పని చేయగలుతారు ?

  • వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడ్నుంచి బదిలీ చేశారు. ఐటీ కార్యదర్శిగా సీఎస్ ఎలా పని చేయగలుతారు ? సీఎస్‌కు బోలెడన్నీ భాద్యతలు ఉంటాయి. అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా భాద్యతలు నిర్వర్తిస్తారు..? 20 శాతం జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు.. 80 శాతం జీవోలు ఆఫ్‌లైన్‌లో ఉంచుతున్నారు. మా ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్తే.. నాలుగు వారాల్లో జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టాల‌ని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించినా జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ జీవోలపై ఏం మాట్లాడింది? ఇపుడేం చేస్తున్నారు. మా సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిది. లేదంటే వారి ఖర్మ అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైంది...

  • వరంగల్ ఎంజిఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైంది. మేము వాడుకోవడానికి అనువుగా కట్టిన మార్చురీలను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదు. ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్లకు ఓ నీతి? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓ నీతా? అంతా జోక్ అయిపోయింద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేదు..

  • అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేదు. హౌజ్ కమిటీలు వేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదు. చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉంది.. ఇట్లా ఎపుడు జరగలేదు. అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదు అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.
Advertisement
Advertisement