త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ్యామ్ మోడ‌ల్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి.. 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు : హ‌రీశ్‌రావు

Harish Rao | హ్యామ్ మోడ‌ల్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుంద‌ని, 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు వేశార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా మేము బయట పెట్టామని తెలిపారు.

S

Telangana | Published On May 1, 2026, 6.45 pm IST

Harish Rao | హ్యామ్ మోడ‌ల్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి.. 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : హ్యామ్ మోడ‌ల్ రోడ్ల‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుంద‌ని, 25 శాతం ఎక్సెస్‌తో టెండ‌ర్లు వేశార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా మేము బయట పెట్టామని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్ చాట్ నిర్వ‌హించారు.

హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌లో రూ. 11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్‌తో కలిసి దాదాపుగా రూ. 15 వేల కోట్ల వరకు పోయింది. పంచాయతీ రాజ్‌లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపుగా రూ. 7 నుంచి రూ. 8 వేల కోట్ల వరకు అవుతుంది. ఎక్సెస్ టెండర్ వల్ల రూ. 5 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. హ్యామ్ మోడ‌ల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి, 30 ఇన్‌స్టాల్‌మెంట్ల‌లో 15 ఏళ్ల పాటు వ‌డ్డీతో స‌హా బ్యాంక్‌కు చెల్లించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాలపై కూడా తీవ్రమైన భారం పడుతుంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఎక్సెస్ టెండర్‌లను వెంటనే రద్దు చేయాలి..

రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా, పరోక్షంగా అప్పులు చేస్తున్నాడు. ఈ టెండర్‌లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాణహిత చేవెళ్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడాడు. అప్పుడు అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చాడు. 2014 బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశాం. మా హయంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీకాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్న పట్టించుకోవడం లేదు. ఎక్సెస్ టెండర్‌లను వెంటనే రద్దు చేయాలి.. టెండ‌ర్ల‌న్నీ రీకాల్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్ ఉండదని చెప్పి..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతుంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆధారాలతో సహా మేం వివరించాం. రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఎక్సెస్ టెండర్ల‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. ఈ టెండర్ల‌లో ఒక కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయి. త్వ‌ర‌లోనే ఆధారాలతో సహా బ‌య‌ట‌పెడుతాను. ఆర్ అండ్ బీలో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన చీఫ్ ఇంజినీర్ వెంక‌టేశ్వ‌ర‌రావు, పంచాయ‌తీ రాజ్ చీఫ్ ఇంజినీర్ జోగారెడ్డి ప‌ద‌వీకాలం పొడిగించి ఈ టెండ‌ర్ల ప్ర‌క్రియ కొన‌సాగిస్తున్నారు. ప్రధానమైన ఇంజినీరింగ్‌లో ముఖ్యమైన అధికారులను ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్ ఉండదని మాట్లాడిన రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారు. వెంటనే ఎక్సెస్ టెండర్ల‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement