త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాళేశ్వ‌రం, సీతారామ స‌హా ఏడు ప్రాజెక్టుల‌ను ర‌ద్దు చేయాలా..?

Harish Rao | నీళ్ల కోసం జరిగిన తెలంగాణ‌ ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమ‌తులు తీసుకువ‌స్తే.. తెచ్చిన అనుమతులు రద్దు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌డం ఎంత వ‌ర‌కు సమంజసం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 5, 2026, 2.54 pm IST

Harish Rao | కాళేశ్వ‌రం, సీతారామ స‌హా ఏడు ప్రాజెక్టుల‌ను ర‌ద్దు చేయాలా..?
Advertisement

తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు
కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల
గోదావరి జలాలకు అనుమ‌తులు తెచ్చారు
ఆ ఏడు ప్రాజెక్టుల అనుమ‌తులు రివ్యూ చేయాలా.?
ఏపీ ప్ర‌తిపాదిస్తే.. జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టింది
ఇలా జ‌ర‌గ‌డం దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి
మ‌రి తెలంగాణ ఇంజినీర్లకు మ‌తి లేదా..?
సీఎం రేవంత్‌కు చంద్ర‌బాబు అంటే భ‌య‌మా..?
మ‌రి బ‌న‌క‌చర్ల‌ను ఎజెండాలో ఎందుకు పెట్టించ‌లేదు
కుక్క తోకను ఆడిస్తుందా లేక తోక కుక్కను ఆడిస్తుందా?
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేస్తుండేనా..
కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నీళ్ల కోసం జరిగిన తెలంగాణ‌ ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమ‌తులు తీసుకువ‌స్తే.. తెచ్చిన అనుమతులు రద్దు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌డం ఎంత వ‌ర‌కు సమంజసం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కాళేశ్వ‌రం, సీతారామ స‌హా 7 తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టింది. ఇలా జరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయ‌న తెలిపారు. జీఆర్ఎంబీలో ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా ఉన్నరు? రేవంత్ రెడ్డి ఏపీకి పరోక్షంగా సహకరిస్తున్నడా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యం చేస్తుండెనా? అని హ‌రీశ్‌రావు అడిగారు. వాళ్ళ బంటు ఇక్కడ ఉన్నడు కాబట్టే జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ గురించి జీఆర్ఎంబీ ఎజెండాలో రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టించలేదు? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. జీఆర్ఎంబీ ఎజెండాపై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

హ‌రీశ్‌రావు ప్రెస్‌మీట్.. ఆయ‌న మాట‌ల్లోనే..

ఈనెల 18న హైదరాబాద్ వేదికగా జీఆర్ఎంబీ (GRMB) సమావేశం జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే... జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణం. ఏపీ ప్రతిపాదించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మానదు. రక్తం మరిగిపోక తప్పదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? లేక తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా? చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే... రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరిగడం లేదు? తెలంగాణ సోయి లేదా? తెలంగాణ ఆత్మగౌరవం లేదా? గురుదక్షిణ కోసమేనా ఈ మౌనం? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

చంద్రబాబు అంటే అంత భయమా?

ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి... పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు? "గుడ్లు పీకుతా... పేగులు మెడలో వేసుకుంటా" అంటూ రాక్షస భాష మాట్లాడే రేవంత్ రెడ్డి... చంద్రబాబు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు అంటే అంత భయమా? తెలంగాణ జల ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి చేసే విధంగా పక్క రాష్ట్రం కుట్రలు చేస్తోంది. ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండా చూస్తే ఏపీ ఎంత వితండవాదం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కేసీఆర్ వ‌ల్లే సీతారామ ప్రాజెక్టుకు నీళ్లు

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మొత్తం విషం చిమ్మింది. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదేపదే చెబుతారు. కానీ జీఆర్ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుంది. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోంది. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. కొత్తగా అనుమతులు ఇవ్వాలని కాదు... కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ కోరుతోంది. ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయంటే... కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనుమతుల వల్లే. ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా?

తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు. సమ్మక్క, పాలమూరు, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు రిటర్న్ వచ్చాయి. ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతి సాధించలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా? నిద్రపోతున్నారా? ఎజెండాలో ఈ అంశాలు రావడమే దుర్మార్గమైన విషయం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నోటికాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు

చంద్రబాబు "నేను తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ అడ్డుకోలేదు" అని చెబుతారు. కానీ ఏప్రిల్ 24, 2026న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులను ఆపేలా జీఆర్ఎంబీ ఎజెండాలో అంశాలను పెట్టించారు. టీవీల్లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదంటారు... బయట మాత్రం ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని లేఖలు రాస్తారు. ఎజెండాలో పొందుపరుస్తారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. కేంద్రాన్ని చేతుల్లో పెట్టుకుని తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. నోటికాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు అని మాజీ మంత్రి హెచ్చ‌రించారు.

కాళేశ్వరం అంటే సగం తెలంగాణ...

సీతారామ అంటే ఖమ్మం జిల్లా... కాళేశ్వరం అంటే సగం తెలంగాణ... గూడెం అంటే మంచిర్యాల... మోదికుంట వాగు అంటే ఖమ్మం... చిన్న కాళేశ్వరం అంటే మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం. తెలంగాణ వ్యాప్తంగా తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం, ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? ఆయా ప్రాంతాల మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి అంగీకరిస్తున్నారా? సమాధానం చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్ఎంబీకి ఎక్కడిది?

జీఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక బోర్డు మాత్రమే. జీఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి ఎలా నిర్దేశాలు ఇస్తుంది? కేంద్రంలోని అన్ని కీలక విభాగాలు పరిశీలించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు ఇచ్చింది. టీఏసీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఉంటాయి. కేంద్రం పరిశీలించి అనుమతించిన తర్వాత వాటిని మళ్లీ రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్ఎంబీకి ఎక్కడిది? దేశ చరిత్రలో అనుమతులు వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేయడం, రద్దు చేయడం జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? తొలిసారి దేశంలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. ఏపీ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ దాన్ని వ్యతిరేకించాలి కదా? మరి ఎజెండాలోకి ఎలా వచ్చింది? తెలంగాణ ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి చెప్పడంతోనే ఈ ఎజెండా తయారైందా? ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైన అంశాలు జీఆర్ఎంబీ ఎజెండాలోకి వస్తాయి? తెలంగాణకు రాజ్యాంగపరమైన హక్కులు లేవా? ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేస్తాం, నిలిపివేస్తాం అంటే ఏం జరుగుతోంది? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప్ర‌శ్నించారు.

బీజేపీ ఇప్పటికైనా స్పందించాలి

బీజేపీ ఇప్పటికైనా స్పందించాలి. లేదంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మేమే పోరాటం చేయాల్సి వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారా? పెదవులు మూసుకుని కూర్చుంటారా? బీజేపీ స్పష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నీళ్లను కూడా ఎత్తడం లేదు. మేము నిలదీసిన తర్వాతే దేవాదులలో తొమ్మిది మోటార్లు ఆన్ చేశారు. ఎల్లంపల్లిలో ఐదు పంపులు మాత్రమే నడుస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలోనూ అదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత తక్కువ నీటి వినియోగం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

సమ్మక్కకు అనుమతి ఇస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయట

గోదావరి జలాలు ఎత్తడం లేదు... కృష్ణా జలాలు వినియోగించడం లేదు. మరోవైపు సమ్మక్క బ్యారేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఏపీ కోరుతోంది. సమ్మక్కకు అనుమతి ఇస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయని ఏపీ ఎజెండాలో పేర్కొంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే చెబుతోంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీలలో భాగంగా సమ్మక్క ప్రాజెక్టు నిర్మిస్తామంటే ఏపీ అడ్డుకుంటోంది. సమ్మక్క సాగర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు సాధించింది. 2022 ఆగ‌స్టు 25న సమ్మక్క సాగర్‌కు 47 టీఎంసీల నీటి కేటాయింపుతో కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు సాధించింది. సమ్మక్క సాగర్ అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 ద్వారా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు, రామప్ప, పాకాల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు, ములుగు జిల్లాకు తాగునీరు, వరంగల్‌కు డ్రింకింగ్ వాటర్ అందించేలా ప్రతిపాదనలు చేసి అనుమతులు సాధించాం. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేయాలని ఏపీ జీఆర్ఎంబీ ఎజెండాలో ప్రతిపాదించింది. సమ్మక్క సాగర్‌కు ఉరి వేసే కుట్ర జరుగుతోంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?

ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్‌కు కేటాయించిన 47 టీఎంసీల నీటి వాటాను వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. సమ్మక్క సాగర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తాయి. అలాంటి ప్రాజెక్టును రద్దు చేయాలని ఎజెండాలో ప్రతిపాదిస్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఈ ఎజెండాను వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై పోరాటం చేయాలి. మేము అడిగిన తర్వాత నిన్నటి తేదీ వేసి ఉత్తరం రాయడం కాదు... నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. డ్రామాలు కాదు... తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి ఎజెండా జీఆర్ఎంబీ ముందుకు వచ్చేదా? తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడేంత ధైర్యం ఎవరికైనా ఉండేదా? మీ బంటు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టే ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయనే అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన కాంతారావు, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి సలహాదారు, ఈఎన్‌సీ, జాయింట్ సెక్రటరీ వంటి కీలక స్థానాల్లో ఉన్నవారు అంతా ఆంధ్రా మూలాల వారే. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? ఆ ప్రాజెక్టు అంశాన్ని జీఆర్ఎంబీ ఎజెండాలో ఎందుకు పెట్టించలేదు? అని నిల‌దీశారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా?

ఏపీ మన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నప్పుడు... తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు? బనకచర్ల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా? "సుజల సుఫలాం" పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసే ఒప్పందాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అసలు తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు లేదని ఏపీ జీఆర్ఎంబీ ఎజెండాలో పేర్కొనడం అత్యంత ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు ఉంది. 9వ జీఆర్ఎంబీ సమావేశంలో కూడా తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉందనే అంశం ఉంది. ఆ సమావేశం మినిట్స్‌లో కూడా ఈ అంశం నమోదై ఉంది. ఆ సమావేశానికి ఏపీ తరఫున ఆదిత్యనాథ్ హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే చంద్రబాబు తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీల కేటాయింపు లేదని మాట్లాడుతున్నారు అని మండిప‌డ్డారు.

తెలంగాణ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు

తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మేము రాజకీయాల కోసం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేదంటే... ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎనిమిదేళ్లు అధికారంలో ఉండి ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కేంద్రంలో మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎందుకు అనుమతులు సాధించలేకపోయారు? ఇప్పుడు తెలంగాణ సాధించిన అనుమతులను రద్దు చేయాలని మాత్రం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? తెలంగాణ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజల నోటికాడి నీళ్లను లాక్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. అవసరమైతే తెలంగాణ నీటి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని హరీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఈ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement