త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ‌.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Navaratri Brahmotsavam | తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో ఇటీవ‌ల సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగాయి. వేలాది మంది భ‌క్తులు క్షేత్రానికి త‌ర‌లివ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అయితే, ఈ ఉత్స‌వాల‌కు వెళ్ల‌లేని భ‌క్తుల‌కు మ‌రో అవ‌కాశం ఉన్న‌ది.

P

Devotional | Published On Oct 3, 2026, 4.50 pm IST

Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ‌.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
Advertisement

Navaratri Brahmotsavam | తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో ఇటీవ‌ల సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగాయి. వేలాది మంది భ‌క్తులు క్షేత్రానికి త‌ర‌లివ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అయితే, ఈ ఉత్స‌వాల‌కు వెళ్ల‌లేని భ‌క్తుల‌కు మ‌రో అవ‌కాశం ఉన్న‌ది. వాహ‌న‌సేవ‌ల‌పై క‌టాక్షించి స్వామివారిని క‌నులారా ద‌ర్శించుకునే భాగ్యం క‌లుగ‌నున్న‌ది. అక్టోబ‌ర్ 12 నుంచి తిరుమ‌ల‌లో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభమై.. 20 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉత్స‌వాల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది.

ఈ ఏడాది రెండుసార్లు..

చాంద్రమానంలో ప్రతి మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో శ్రీవారికి ఒకే ఏడాదిలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధికమాసం కారణంగా కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అనంతరం దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సాధారణ బ్రహ్మోత్సవాల మాదిరిగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. అయితే, స్వామివారి వివిధ వాహన సేవలు మాత్రం భక్తులను కనువిందు చేయనున్నాయి. సాధారణంగా ఉదయం వాహన సేవలు 8 నుంచి 10 గంటల మధ్య, రాత్రి సేవలు 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడసేవ మాత్రం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి వాహనానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండటంతో.. తొమ్మిది రోజుల పాటు తిరుమలలో భక్తి, వైభవం వెల్లివిరియనుంది. ఒకే ఏడాదిలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ఈ ఏడాది ఉత్సవాలకు మరింత విశిష్టతను తీసుకొచ్చింది.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా..

అక్టోబ‌ర్ 11 : అంకురార్పణం కార్య‌క్ర‌మం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఉంటుంది.
అక్టోబర్‌ 12 : బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం 9 గంటలకు, రాత్రి పెద్ద‌శేష వాహ‌న‌సేవ.
అక్టోబర్‌ 13 : ఉద‌యం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంట‌ల‌కు హంస‌వాహ‌న‌సేవ‌.
అక్టోబర్‌ 14 : ఉద‌యం 8 గంట‌ల‌కు సింహ వాహనసేవ‌, రాత్రి ముత్య‌పుపందిరి సేవ‌.
అక్టోబర్‌ 15 : ఉద‌యం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహన‌సేవ‌, రాత్రి 7 గంట‌ల‌కు సర్వభూపాల వాహనం.
అక్టోబర్‌ 16 : ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంట‌ల‌కు గ‌రుడ సేవ‌.
అక్టోబర్ 17 : ఉద‌యం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గ‌జ‌వాహ‌న‌సేవ‌.
అక్టోబర్ 18 : ఉద‌యం 8 గంట‌ల‌కు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంట‌ల‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌.
అక్టోబర్‌ 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ‌.
అక్టోబర్‌ 20 : ఉద‌యం 6 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానంతో ఉత్స‌వాలు ప‌రిస‌మాప్తి.

Advertisement
Advertisement