త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పొగ‌రు త‌గ్గించుకో పొగ‌రులేటి.. మంత్రి పొంగులేటిపై నిప్పులు చెరిగిన హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. పొగ‌రు త‌గ్గించుకో పొగ‌రులేటి అని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Apr 9, 2026, 3.32 pm IST

Harish Rao | పొగ‌రు త‌గ్గించుకో పొగ‌రులేటి.. మంత్రి పొంగులేటిపై నిప్పులు చెరిగిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. పొగ‌రు త‌గ్గించుకో పొగ‌రులేటి అని ధ్వ‌జ‌మెత్తారు. ఇంకా బ‌య‌ట‌కు రావాల్సిన విషయాలు నీవి చాలా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ అవినీతిని బ‌య‌ట పెట్టలేదు.. మేమే పెట్టామని రేవంత్ రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పినప్పుడు నువ్వు పక్కనే కూర్చున్నావు కదా? మరి ఇది నాది కాదని అప్పుడు అసెంబ్లీలో నిలబడి ఎందుకు చెప్పలేదు అని హరీష్ రావు నిల‌దీశారు. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

ఓ వైపు అంబేద్క‌ర్ విగ్ర‌హం, మ‌రో వైపు బిర్లా మందిర్, అమ్మ‌వారి గుడి, ఇంకోవైపు మ‌సీదు, చ‌ర్చి ఉన్న ప‌విత్ర‌మైన స‌చివాల‌యంలో నిజాలు దాచి అబ‌ద్దాలు మాత్ర‌మే మాట్లాడిండు ఆ పొగ‌రులేటి మంత్రి. నిన్న ఆయ‌న‌ ఫ్ర‌స్టేష‌న్, బూతులు చూస్తుంటే ఎంత డిఫెన్స్‌లో ప‌డ్డాడో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. స‌రుకు, స‌మాధానం లేన‌ప్పుడు తిట్ల‌కు ఎత్తుకుంటారు. ఆయ‌న క‌థ‌లు, భాష‌, బాడీ లాంగ్వేజ్ చూస్తే డిఫెన్స్‌లో ప‌డ్డ‌ట్టు అర్థ‌మైంది. స‌మాధానం లేదు కాబ‌ట్టే తిట్ల రాగాన్ని ఎత్తుకున్నాడు. ఈ పొగ‌రులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ అధినేత‌గా మాట్లాడిన‌ట్టు ఉంది. సంస్థ‌ను, కొడుకును కాపాడుకోవాల‌న్నా తాప‌త్ర‌యం క‌నిపించింది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఆయ‌న పొంగులేటి కాదు.. పొంగులూటీ

నేను ఒక్క‌డినే అవినీతిప‌రుడిని కాదు.. నా స‌హ‌చ‌ర మంత్రులంద‌రూ కూడా అవినీతిప‌రులే అని త‌న‌కంటిన బుర‌ద‌ను వాళ్ల‌కు అంటించే ప్ర‌య‌త్నం చేశాడు. జూప‌ల్లి కుంభ‌కోణాన్ని, సీఎం కుటుంబం టెండ‌ర్ల స్కాం, భ‌ట్టి ఆర్థిక శాఖ‌లో బిల్లుల ప‌ర్సంటేజి కుంభ‌కోణాన్ని ఆయ‌న చ‌దివాడు. ఆయ‌న తాప‌త్ర‌యం అంతా నేను కుంభ‌కోణాలు చేయ‌లేదు.. కేబినెట్‌లో చాలా మంది కుంభ‌కోణాలు చేశార‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసిండు. ఆయ‌న పొంగులేటి కాదు.. పొంగులూటీ అనే విష‌యం అర్థ‌మైంది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

సీఎం నిండు అసెంబ్లీలో చెప్పింది త‌ప్పా.. బాంబులేటి చెప్పింది త‌ప్పా..

రాఘ‌వ క్ర‌ష‌ర్‌కు సంబంధించి శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెప్పిండు. మా మంత్రి రాఘ‌వ కంపెనీలో జ‌రిగిన అవినీతిని మా అధికారులే గుర్తుప‌ట్టారు.. ప్ర‌తిప‌క్షాలు బ‌య‌ట‌కు తీసుక‌రాలేదు అని చెప్పారు. మైనింగ్ మంత్రి మాట్లాడుతూ.. క‌రెంట్ మీట‌ర్ల షార్టెజ్ ఉండ‌బ‌ట్టే డిజిల్ మీద న‌డిపార‌ని చెప్పిండు. రెవెన్యూ, ఎల‌క్ట్రిసిటీ, పీసీబీ, మైనింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు మైన్‌ను త‌నిఖీ చేసి ఇది అనుమ‌త‌ల్లేకుండా న‌డుపుతున్నార‌ని రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ను నోటీసు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చింది త‌ప్పా.. పొంగులేటి చెప్పింది త‌ప్పా.. సీఎం నిండు అసెంబ్లీలో చెప్పింది త‌ప్పా.. బాంబులేటి చెప్పింది త‌ప్పా.. మైనింగ్ మంత్రి చెప్పింది త‌ప్పా.. పొగ‌రులేటి చెప్పింది త‌ప్పా .. మంత్రి స‌మాధానం చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

12 రోజుల త‌ర్వాత గుర్తుకు వ‌చ్చిందా..

పొగ‌రు తగ్గించుకో పొగ‌రులేటి ఇంకా చాలా ఉన్నాయి బ‌య‌ట‌కు రావాల్సిన విష‌యాలు. ప్ర‌తిప‌క్షం దొర‌క‌బ‌ట్ట‌లేదు అని సీఎం చెప్పిన‌ప్పుడు నువ్వు ప‌క్క‌నే కూర్చున్నావ్ కదా.. ఇది నాది కాదు అని స‌భ‌లో ఎందుకు చెప్ప‌లేదు. 12 రోజుల త‌ర్వాత గుర్తుకు వ‌చ్చిందా మైనింగ్ లేద‌ని. మ‌సిబూసి మారెడు కాయ చేస్తున్నారు. మైనింగ్ నీది కాక‌పోతే కంటైన‌ర్ మీద రాఘ‌వ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ బ‌య‌ట‌కు తీయ‌గానే రాఘ‌వ‌ పేరును చెరిపేశారు, కాంగ్రెస్ జెండాను పీకేశారు. పీసీబీ నోటీసు ఇస్తే.. నీ ఉద్యోగి రీసివ్‌డ్ అని రాసిచ్చిన డాక్యుమెంట్‌నే నేను అసెంబ్లీలో చూపించాను. సీఎం, మైనింగ్ మంత్రి అబ‌ద్ధం చెప్పిండు అని చెప్పు. అసెంబ్లీలో మైన్ లేద‌ని ఎందుకు నోరు మెద‌ప‌లేదు. బాంబులేటి అబద్ధాలు చెబుతూ బుకాయిస్తున్నాడు. మైన్ లేద‌ని అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్ప‌లేదు. మైనింగ్‌లో పొంగులూటీ చేసిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పు..

నీ శాఖ అధికారే చెప్పిండు ఇది రాఘ‌వ అక్ర‌మ మైనింగ్ అని.. ఆ త‌ర్వాత‌ నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ల‌ది త‌ప్పా నీది త‌ప్పా.. నీ సీఎం, మంత్రి, దొంగ‌ను దొర‌క‌బ‌ట్టినం అని చెప్పారు. సీఎం అసెంబ్లీలో అబ‌ద్ధం ఆడిండు అని చెప్పు. ఇదంతా డ్రామా. పొంగులేటి కాదు పొంగులూటి.. నిజాయితీ ఉంటే త‌ప్పు ఒప్పుకో.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పు అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement