త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 7 వేల‌కే పోలీసు నోటిఫికేష‌న్‌.. నిరుద్యోగుల‌ను వంచించ‌డ‌మే

Harish Rao | రాష్ట్రంలో 25 వేల పోలీసు ఉద్యోగాలు( Police Jobs ) ఖాళీగా ఉంటే, కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 17, 2026, 6.46 pm IST

Harish Rao | 7 వేల‌కే పోలీసు నోటిఫికేష‌న్‌.. నిరుద్యోగుల‌ను వంచించ‌డ‌మే
Advertisement

25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీ
జాబ్ క్యాలెండ‌ర్.. జాబ్‌లెస్ క్యాలెండ‌ర్ అయింది
పోలీసు అభ్య‌ర్థన‌ను అర్థం చేసుకోండి
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సూచ‌న‌

Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో 25 వేల పోలీసు ఉద్యోగాలు( Police Jobs ) ఖాళీగా ఉంటే, కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు.

లక్షలాది మంది ఉద్యోగ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు?

ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపి, ఓట్లు వేయించుకుని, ఇప్పుడు నామమాత్రంగా పోస్టులు ప్రకటించడం అంటే యువతకు ద్రోహం చేయడమే. కేవలం 7 వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చేశారు. అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అదనపు పోలీసు బలగాలు అత్యవసరం

తాజా కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఒక్కటి కూడా కేటాయించలేదు. చార్మినార్ జోన్ పరిధిలో సబ్‌-ఇన్‌స్పెక్టర్ పోస్టులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలు అత్యవసరం. అయినా ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసింది

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు విడుదల చేసిన అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేదు అన్నది సుస్పష్టం అని పేర్కొన్నారు.

పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల అవేదన అర్థం చేసుకోండి

హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల అవేదన అర్థం చేసుకోండి. పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది యువత తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తున్నారు. వారి ఆశలను, ఆకాంక్షలను గౌరవించండి. పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచాలని, హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఫ్యూచర్ సిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు పోస్టులు కేటాయించి నియామకాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ప‌క్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement