త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs | డ్రగ్స్‌ రహిత భారత్‌ లక్ష్యంగా బైక్‌ ర్యాలీ

Drugs | డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

S

Telangana | Published On Oct 17, 2026, 6.33 pm IST

Drugs | డ్రగ్స్‌ రహిత భారత్‌ లక్ష్యంగా బైక్‌ ర్యాలీ
Advertisement

రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా
మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించిన డీజీపీ

Drugs | త్రినేత్ర న్యూస్ : డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా సీఆర్పీఎఫ్ నోడల్ ఏజెన్సీగా సమన్వయంతో దేశ వ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులకు చెందిన బైక్‌ రైడర్లు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ బారినపడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయ‌న్నారు. తెలంగాణలో ఈగల్‌ ఫోర్స్‌, పోలీసు శాఖ సమన్వయంతో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ జాతీయ సమైక్యతే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ఐక్యత, సామాజిక బాధ్యతను చాటి చెప్పడంతో పాటు డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా మాదకద్రవ్యాలపై పోరాటం అనే ఇతివృత్తంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ మాదక ద్రవ్యాల రహిత భారత్, నశా ముక్త్ భారత్ సహకారానికి అందరం కలిసి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా డీజీపీ వివరించారు.

తెలంగాణ పోలీస్ సిబ్బంది కూడా రైడ్‌లో పాల్గొన్నారు. రైడర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని డీజీపీ సూచించారు. ఈ ర్యాలీలో పాల్గొంటున్న బైక్‌ రైడర్లు వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి అక్టోబరు 30 నాటికి గుజరాత్‌లోని కెవడియాకు చేరుకోనున్నారు. అక్టోబరు 31న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా అక్కడ నిర్వహించే జాతీయ ఐక్యతా/ రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో డీజీపీతో పాటుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సీపీ సజ్జనార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్‌తో పాటుగా పోలీసు అధికారులు సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement