త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మ‌రి ప్ర‌భుత్వ భూమి అయితే.. ఎందుకు స్వాధీనం చేసుకోవ‌డం లేదు..? పొంగులేటిని నిల‌దీసిన హ‌రీశ్‌రావు

Harish Rao | నాద‌ర్‌గుల్ భూములు ప్ర‌భుత్వ భూములు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెబుతున్నాడు.. మరి ఎందుకు ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదు..? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

S

Telangana | Published On Apr 9, 2026, 3.54 pm IST

Harish Rao | మ‌రి ప్ర‌భుత్వ భూమి అయితే.. ఎందుకు స్వాధీనం చేసుకోవ‌డం లేదు..? పొంగులేటిని నిల‌దీసిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నాద‌ర్‌గుల్ భూములు ప్ర‌భుత్వ భూములు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెబుతున్నాడు.. మరి ఎందుకు ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదు..? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిల‌దీశారు. పేదల ఇండ్ల మీదకి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లే హైడ్రా, ఈ ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడంలేదు? అని ప్ర‌శ్నించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

నాద‌ర్‌గుల్ భూముల విష‌యంలో బీఆర్ఎస్ హ‌యాంలో రిజిస్ట్రేష‌న్ అయింద‌ని ఓ చిల్ల‌ర క‌థ చెబుతున్న‌వ్. నిజాలు దాచి అబ‌ద్ధాలు మాట్లాడారు. నిజం ఏంటిది అంటే.. 2016లో నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వం. భూముల‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఆనాటి ఆర్డీవో 2016లో 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం భూముల‌ను కాపాడింది. ఆ త‌ర్వాత కంపెనీలు హైకోర్టుకు పోతే.. 2022లో ప్ర‌భుత్వం బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించి ఆర్డీవో నిర్ణ‌యం స‌రైంది అని ఈ భూములు సిలీంగ్ భూములు అని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్త‌ర్వులు తెప్పించాం. డివిజ‌న్ బెంచ్‌లో ఆనాటి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు వాద‌న‌లు వినిపించి సీలింగ్ భూములు అని అమ్మిన వారిపై కొన్న వారిపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కూడా తీర్పు చెప్పింద‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతుందా..?

ఇవి గ‌వ‌ర్న‌మెంట్ భూములే అని సుప్రీంకోర్టులో ఆర్డీవో ఫైల్ చేశార‌ని పొంగులేటి చెప్పారు. మ‌రి గ‌వ‌ర్న‌మెంట్ భూములే అయితే రోజుకో పేరు ఎందుకు మార‌తుంది బోర్డుల‌పైన‌. బౌన్స‌ర్లు రాత్రింబ‌వ‌ళ్లు కాప‌లా కాస్తుంటే ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతుందా..? రెండున్న‌రేండ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. రోజుకో పేరు.. కోహినూరు, ఎంఈఐఎల్, శిల్ప‌, ఏక్యూ స్క్వైర్ వ‌స్త‌ది.. ఆ త‌ర్వాత కోహినూరు సింప్లెక్స్ వ‌స్త‌ది.. ఎందుకు బోర్డుల పేర్లు మారుతున్నాయి..? ఏక్యూ స్క్వైర్ వెనుక నీ కొడుకున్న‌ది నిజం కాదా..? శిల్ప‌తో మీకు వ్యాపార సంబంధాలు ఉన్న‌ది నిజం కాదా..? డాక్యుమెంట్లు బ‌య‌ట పెడుదామా..? అని హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

హైడ్రా గ‌డ్డి పీకుతుందా..?

ఇది ప్ర‌భుత్వ భూమి అంటున్న‌వ్.. సుప్రీంకోర్టులో వేశాం అంటున్నారు క‌దా.. మ‌రి ప్ర‌భుత్వ భూమి అయితే నీ హైడ్రా గ‌డ్డి పీకుతుందా..? ప్ర‌భుత్వ భూములు, చెరువులు కాపాడ‌డానికి హైడ్రా ఉంది క‌దా. చిత్త‌శుద్ధి ఉంటే కంపౌండ్ వాల్స్ తొల‌గించి, బౌన్స‌ర్లు, ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టి భూమిని స్వాధీనం చేసుకొండి. ఆ భూమిలో సాగు చేసుకున్న రైతుల‌కు ఎంట్రీ ఇవ్వండి అని హ‌రీశ్‌రావు సూచించారు.

నీ బాంబుల‌న్నీ తుస్ బాంబులే..

హైకోర్టు ఆర్డ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ పేదోళ్ల ఇండ్ల మీద‌ శ‌ని, ఆదివారం హైడ్రా విరుచుకుప‌డుతోంది. హైకోర్టు ఆర్డ‌ర్ ఉన్న త‌ర్వాత హైడ్రా ఎందుకు క‌ళ్లు మూసుకుంది. నాద‌ర్‌గుల్ భూముల విష‌యంలో ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. నీ బాంబుల‌న్నీ తుస్ బాంబులే. నీ మాట‌లు విన్న త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు పొగ‌రులేటి మంత్రి అని అర్థ‌మైంది. ఇంకా చాలా ఉన్న‌య్ బ‌య‌ట‌కు వ‌చ్చేవి. ఇది ప్ర‌భుత్వ భూమి అని చెబుతున్నారు.. కానీ ఇది ప్ర‌యివేటు ఆధీనంలో ఉంది. హైడ్రాను పంపించు.. కంపౌండ్ వాల్స్‌ను తొల‌గించి.. ఆక్ర‌మ‌ణ‌దారుల‌ను అరెస్టు చేసి గ‌వ‌ర్న‌మెంట్ భూమి అని బోర్డు పెట్టి చిత్త‌శుద్ధిని నిరూపించుకో అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

Advertisement
Advertisement