త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మీనాక్షి నామినేష‌న్‌ తిర‌స్క‌ర‌ణ వెనుక‌.. రేవంత్ రెడ్డి వెన్నుపోటు కుట్ర : హ‌రీశ్‌రావు

Harish Rao | కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర ఉంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఆరోపించారు.

S

Telangana | Published On Jun 11, 2026, 3.31 pm IST

Harish Rao | మీనాక్షి నామినేష‌న్‌ తిర‌స్క‌ర‌ణ వెనుక‌.. రేవంత్ రెడ్డి వెన్నుపోటు కుట్ర : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర ఉంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఆరోపించారు. గురువారం మీడియాతో చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్రే దాగిఉంది. ఈ నామినేషన్ తప్పుల గురించి లీకులు ఇచ్చింది ఎవరో రేవంత్ రెడ్డి వెంటనే తేల్చాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు మాకు పక్కా సమాచారం ఉంది. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి సైతం.. మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసుల సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చిందని కుండబద్దలు కొట్టారు. గతంలో ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న వ్యక్తినే ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ కుట్ర చేశాడు. సొంత పార్టీ ఇంచార్జికే వెన్నుపోటు పొడిచే నాయకులు, ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. ఈ నామినేషన్ తిరస్కరణ కుట్రపై రేవంత్ రెడ్డి సిట్ విచారణ వేస్తాడా. లేక ఇంకేదైనా విచారణ వేస్తాడా. ఏదో ఒకటి చేసి అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

రూ. 100 కోట్లతో VVIP గెస్ట్ హౌస్

కేసీఆర్ అత్యద్భుతమైన సెక్రటేరియట్ నిర్మిస్తే, అక్కడికి వెళ్లని రేవంత్ రెడ్డి.. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నాడు. చదువు చారెడు.. బలపాలు దోసెడు అన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి తీరు. జూబ్లీహిల్స్ లో తన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ. 100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడు. అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట VVIP గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ. 7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ. 100 కోట్లకు పెంచారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ రూ. 17 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్ బాల్ ఆడుకోవడానికి రూ. 10 కోట్లతో స్టేడియం నిర్మిస్తూ ముఖ్యమంత్రి సోకులు పడుతున్నాడు. ముఖ్యమంత్రి విలాసాలకు క్యాంపు కార్యాలయాలు కడుతుంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నాడు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి.. వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో డబ్బులు లేవనడం పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి సోకులకు, విలాసాలకు మాత్రం ప్రజాధనానికి కొదవే లేదు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడటానికి వంద కోట్లు, అందాల పోటీల కోసం మరో వంద కోట్లు దర్జాగా ఖర్చు పెడుతున్నారు. కానీ జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు. మొన్నటివరకు నెలకు రూ. 2 కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు నెలకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించి మరీ కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసింది. అయితే గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాంగ్రెస్ అనుయాయులు భారీగా భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు వారికి మేలు చేసేందుకు ఆ ఔటర్ లోపల ఉన్న 111 జీవోను కూడా ఎత్తివేసేలా సెక్రటేరియట్‌లో పెద్ద ఎత్తున ఫైళ్లు నడుపుతున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Advertisement
Advertisement