త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | గోదావ‌రి నీటిపై ఏపీ క‌న్ను.. రేవంత్ మొద్దు నిద్ర వీడాలి : హ‌రీశ్‌రావు

Harish Rao | గోదావ‌రి నీటిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌న్ను ప‌డింద‌ని, ఇందుకు సీడ‌బ్ల్యూసీ రాష్ట్రానికి పంపించిన మినిట్స్‌తో స్ప‌ష్ట‌మైంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Mar 16, 2026, 5.01 pm IST

Harish Rao | గోదావ‌రి నీటిపై ఏపీ క‌న్ను.. రేవంత్ మొద్దు నిద్ర వీడాలి : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : గోదావ‌రి నీటిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌న్ను ప‌డింద‌ని, ఇందుకు సీడ‌బ్ల్యూసీ రాష్ట్రానికి పంపించిన మినిట్స్‌తో స్ప‌ష్ట‌మైంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ఎల్పీలో హ‌రీశ్‌రావు సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నీటి హ‌క్కుల‌ను కాపాడేందుకు నిరంత‌రం పోరాటం చేశారు. తెలంగాణ నీటి హ‌క్కుల‌ను కాపాడేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. కృష్ణా న‌దీ జ‌లాల్లో తెలంగాణ‌కు న‌ష్టం జ‌రిగింద‌ని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను సాధించి, కృష్ణా న‌దీ జ‌లాల పునఃపంపిణీకి బాట‌లు వేశారు. గోదావ‌రిలో కూడా మ‌న‌ నీటి హ‌క్కుల‌ను శాశ్వ‌తంగా నిలిపేందుకు ఎంత‌గానో కృషి చేశారు. ఉమ్మ‌డి ఏపీకి గోదావ‌రి 1486 టీఎంసీలు కేటాయిస్తే.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం స‌బ్ బేసిన్ వైజ్ క్యాలికులేష‌న్‌లో తెలంగాణ‌కు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా లెక్క‌లు తేలాయి. 968 టీఎంసీల నీటి హ‌క్కుల‌ను స్థిర‌ప‌ర‌చ‌డానికి కేసీఆర్ కొత్త ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్ర‌తిపాదిక‌న ప్రారంభించారు. దాదాపు 400 టీఎంసీల‌కు హైడ్రాల‌జీ అనుమ‌తులు సాధించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కృష్ణా, గోదావ‌రిలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న‌ టీడీపీ ప్ర‌భుత్వాలు క‌లిసి తెలంగాణ‌కు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇంత జ‌రుగుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మౌనం వ‌హిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నీటి హ‌క్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం

ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన ఆవేద‌న‌తో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని క‌ళ్లు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ద్రోహాన్ని ప్ర‌తిసారి త‌ట్టిలేపుతున్నాం. బ‌న‌క‌చ‌ర్ల‌, న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ కావొచ్చు. కృష్ణా జ‌లాల‌లో అతి త‌క్కువ నీటి వినియోగం కావొచ్చు. ఈ విష‌యాల‌పై మేం మాట్లాడిన త‌ర్వాత బ్యాక్ డేట్‌తో ఉత్త‌రం రాయడం జ‌రుగుతుంది. ఇప్ప‌టికీ మూడుసార్లు ఇలా జ‌రిగింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ రాష్ట్ర హ‌క్కులు మాకు ముఖ్యం. కాబ‌ట్టి నీటి హ‌క్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటామ‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తాక‌ట్టు పెట్టారా..?

కృష్ణా న‌దీ జ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అక్ర‌మంగా త‌న్నుకుపోయింది. తాజాగా గోదావ‌రి జ‌లాల‌ను త‌న్నుకుపోయే ప్ర‌మాదం ఉంది. సీఎం రేవంత్ చ‌ర్య‌ల వ‌ల్ల గోదావ‌రిలో అన్యాయం ఏర్ప‌డే ప‌రిస్థితి ఉంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 30న తెలంగాణ‌, ఏపీ జ‌ల వివాదాల‌పై ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ ఆధ్వ‌ర్యంలో ఇరిగేష‌న్ ఉన్న‌తాధికారుల క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ నీటి హ‌క్కుల‌ను ఏపీ త‌న్నుకుపోతుంటే.. తెలంగాణ ఇరిగేష‌న్ అధికారులు డూడూ బ‌స‌వ‌న్న‌ల‌గా త‌లూపారు. సీడ‌బ్ల్యూసీ ఇదే అదునుగా భావించి, బీజేపీ ఏపీ చెప్పు చేతుల్లో ఉంది కాబ‌ట్టి గోదావ‌రిలో తెలంగాణ‌కు శాశ్వ‌తంగా న‌ష్టం చేసే విధంగా సీడ‌బ్ల్యూసీ చ‌ర్య‌లు ఉన్నాయి. గోదావ‌రిలో ఏ రాష్ట్రానికి కూడా నీటి కేటాయింపులు చేయ‌లేద‌ట‌. ఏపీ చాలా అడ్డ‌గోలుగా మాట్లాడింది. ఈ ఏడాది 12 ఫిబ్ర‌వ‌రి నాడు మినిట్స్ మ‌న రాష్ట్రానికి వ‌చ్చాయి. ఇవాళ మార్చి 16.. నెల రోజులైంది. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగే విధంగా మినిట్స్ ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. కుంభ‌క‌ర్ణుడి లాగా రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిద్ర పోతున్నారా..? చంద్ర‌బాబుకు దాసోహం అయిపోయారా..? ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తాక‌ట్టు పెట్టారా..? ఈ మినిట్స్‌పై ఎందుకు స్పందించ‌డం లేదు అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

ఆదిత్య నాథ్ దాస్ చంద్ర‌బాబు ఏజెంట్..

గోదావ‌రి - బ‌న‌క‌చ‌ర్ల ఎజెండాలో లేకుంటేనే పోతామ‌ని చెప్పి సీడ‌బ్ల్యూసీ స‌మావేశానికి ఎందుకు వెళ్లారు. మినిట్స్‌లో మొద‌టి పాయింటే గోదావ‌రి న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ఉంది. తెలంగాణ హ‌క్కుల మీద, నీళ్ల మీద సోయి లేదా..? అడ్వైజ‌ర్ ఆదిత్య నాథ్ దాస్ చంద్ర‌బాబు ఏజెంట్. తెలంగాణ ద్రోహి. తెలంగాణ త‌ర‌పున చైర్మ‌న్‌గా మీటింగ్‌కు పంపితే ఇది జ‌ర‌గ‌క‌పోతే ఏం జ‌రుగుతుంది. ఆదిత్య‌నాథ్ దాస్‌ను చైర్మ‌న్‌గా పెట్ట‌డ‌మంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చిన‌ట్టే క‌దా..? గోదావ‌రి న‌దీ జ‌లాల విష‌యంలో రాష్ట్రాల మ‌ధ్య కేటాయింపే జ‌ర‌గ‌లేదని ఏపీ చెప్పిన‌ట్లు మినిట్స్‌లో పేర్కొన్నారు. మినిట్స్‌ త‌ప్పు వ‌స్తే.. త‌క్ష‌ణ‌మే తెలంగాణ స్పందించాలి. స్పందించ‌లేదంటే ఇది మీరు ఒప్పుకున్న‌ట్టే లెక్క అని హ‌రీశ్‌రావు అన్నారు.

రేవంత్ రెడ్డి అండ‌ చూసుకొని చంద్ర‌బాబు రెచ్చిపోతున్న‌డు..

రాష్ట్రానికి కేటాయించిన జ‌లాల‌ను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్య‌త జీఆర్ఎంబీ బోర్డుది. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌నడం త‌ప్పు. 76 ప్రాజెక్టుల‌కు సీడ‌బ్ల్యూసీ క్లియ‌రెన్స్ ఇచ్చింది.. మ‌రి నీటి కేటాయింపులు లేక‌పోతే ఇది ఎలా సాధ్యం. వాస్త‌వానికి బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ గోదావ‌రి మీద నీటి కేటాయింపులు చేసింది. రేవంత్ రెడ్డి అండ‌ చూసుకొని చంద్ర‌బాబు రెచ్చిపోతున్న‌డు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అంత ధైర్యం ఎక్క‌డిది. ఏపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడ‌ని ఏం మాట్లాడిన చెల్లుత‌ద‌ని ఏపీ రెచ్చిపోతోంది. ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రించ‌డం అంటే రాజ్యాంగాన్ని ధిక్క‌రించ‌డ‌మే. తెలంగాణ నీటి హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే. 531 కాదు 775 టీఎంసీలు తీసుకువాల‌ని ఏపీ కుట్ర చేస్తోంది. మ‌న అధికారుల మౌనం వ‌ల్ల ఇవాళ గోదావ‌రిలో నీటి కేటాయింపు జ‌ర‌గ‌లేద‌ని చెప్పి మ‌నం సాధించుకున్న హ‌క్కును ఏపీ ప్ర‌భుత్వం కాల‌రాస్తుంది. చేత‌గాని సీఎం చ‌ర్య‌ల వ‌ల్ల ఈ రాష్ట్రానికి న‌ష్టం జ‌రుగుతుంది అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ఎక్క‌డ‌..?

ప‌దిహేను రోజుల క్రితం ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో.. గోదావ‌రిపై న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ నిర్మిస్తున్నామ‌ని, ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. కానీ న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ఎక్క‌డా లేదు. మా నీటి హ‌క్కుల‌ను కాపాడుకుంటాం.. ఒక్క నీటి చుక్క కూడా పోనివ్వం అని తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఖండించ‌లేదు. క‌నీసం నిర‌స‌న కూడా తెలుప‌లేదు. స‌మ‌స్య‌నే లేదు.. న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌ను అడ్డుకుని తీరుతామ‌ని ధీటైన స‌మాధానం ఉండాలి క‌దా..? సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారు. మినిట్స్ మీద ఎందుకు స్పందించ‌డం లేదు. గోదావ‌రి నీటి హ‌క్కుల విష‌యంలో రేవంత్ ప్ర‌భుత్వం బాధ్యాత‌రాహిత్యంగా ఉంద‌న‌డానికి ఈ మినిట్స్ నిద‌ర్శ‌నం, సాక్ష్యం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఒక్క టీఎంసీకి కూడా అనుమ‌తి తేలేదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్డ‌గోలుగా కృష్ణా జ‌లాల‌ను త‌ర‌లించుక‌పోయింది. 80 శాతం జ‌లాల‌ను ఏపీ త‌ర‌లించింది. దాని మీద ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట్లాడ‌దు. గోదావ‌రిలో కూడా కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని త‌ర‌లిస్తుంటే.. స్పందించ‌రు. బీఆర్ఎస్ క‌ష్ట‌ప‌డి 400 టీఎంసీలను ద‌క్కించుకుని, 7 ప్రాజెక్టుల‌కు అనుమ‌తి సాధిస్తే.. రేవంత్ రెడ్డి ఒక్క టీఎంసీకి కూడా అనుమ‌తి సాధించ‌లేదు. ఉన్న‌ది ఊడ‌గొడుతున్నారు. అందుకే ఇంత ఆవేద‌న‌తో మాట్లాడుతున్నాం. ప్ర‌భుత్వాన్ని నిద్ర లేపేందుకు మాట్లాడుతున్నాం. ఏక‌ప‌క్షంగా వ‌చ్చిన మినిట్స్‌ను ఖండించాలి. ఇప్ప‌టికైనా సీఎం రేవంత్, మంత్రి ఉత్త‌మ్ మొద్దు నిద్ర వీడి.. తెలంగాణ నీటి హ‌క్కుల‌ను కాపాడాల‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

Advertisement
Advertisement