త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు : హ‌రీశ్‌రావు

Harish Rao | హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు.. చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 22, 2026, 3.52 pm IST

Harish Rao | హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు.. చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు, గడచిన రెండేళ్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చింది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. ఇప్పటికే రెండున్నరేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం..

కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. అందులో పదుల సంఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడింది. ఈ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం. హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కేవలం కుట్రతోనే ఆపారు..

నిజానికి ఒక 100, 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ గత రెండున్నరేళ్లుగా ల్యాండ్ అక్విజిషన్‌కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కేవలం కుట్రతోనే ఆపారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలి. మాకంటే మంచి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల‌ని మాజీ మంత్రి అన్నారు.

న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయి..

ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమే. దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయి. అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాములను బయటపెడుతున్నాం. సమాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, నేను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే నా మీద రెండు ఎంక్వైరీలు వేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రాటుదేలిన ఉద్యమకారులం.. మా పోరాటం ఆగదు..

మేము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వరి ధాన్యంలో 5 కిలోల తరుగు తీస్తున్నారు, మొక్కజొన్న, సెనగలు, పొద్దుతిరుగుడు కొనే దిక్కు లేదు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు. కరెంట్ లేక రైతులు రోడ్లెక్కినా ఏ ఒక్క మంత్రీ పట్టించుకోవడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. రేవంత్ రెడ్డి ముందు వీటి మీద దృష్టి పెట్టాలి అని హ‌రీశ్‌రావు సూచించారు.

పీఠం కదిలిపోవడం ఖాయం..

రాజకీయ కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో పీఠం కదిలిపోవడం ఖాయం. భయకంపితులై మాట్లాడుతున్న రేవంత్ మాటలే దీనికి నిదర్శనం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు ఎలాంటి విలువ లేదు. ముందుగా గోదావరి బ‌న‌క‌చ‌ర్ల లింక్ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు ఏమొస్తుందో సంజయ్ సమాధానం చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement