త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | జైస‌ల్మేర్‌లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఎందుకు..? ప్ర‌శ్నార్థ‌కంగా సింగ‌రేణి మ‌నుగ‌డ : హ‌రీశ్‌రావు

Harish Rao | బంగారు బాతుగా ఉండే సింగ‌రేణిని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆగం చేసే ప‌రిస్థితి జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ‌కు ఏ రాష్ట్రానికి లేని విధంగా గొప్ప ఆస్తి సింగ‌రేణి ఉంది. దాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. సింగ‌రేణి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంగా చేశార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 26, 2026, 4.47 pm IST

Harish Rao | జైస‌ల్మేర్‌లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఎందుకు..? ప్ర‌శ్నార్థ‌కంగా సింగ‌రేణి మ‌నుగ‌డ : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బంగారు బాతుగా ఉండే సింగ‌రేణిని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆగం చేసే ప‌రిస్థితి జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ‌కు ఏ రాష్ట్రానికి లేని విధంగా గొప్ప ఆస్తి సింగ‌రేణి ఉంది. దాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. సింగ‌రేణి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంగా చేశార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ భ‌వ‌న్‌లో టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో క‌రెంట్ స‌మ‌స్య ఉండే.. స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని( 2X600) 1200 మెగావాట్ల సామ‌ర్థ్యంతో జైపూర్‌లో విద్యుత్ ప్లాంట్ పెట్టినం. ఉత్ప‌త్తి అయింది క‌రెంట్ తీసుకున్నాం.. పీపీఏ చేసినం. దానికి డ‌బ్బులు క‌డుతా ఉన్నాం. మ‌రి వీళ్లు వ‌చ్చిన త‌ర్వాత ఏం చేశారు.. 800 మెగావాట్ల(1X800)తో ఇంకోటి క‌డుతామ‌ని అన్నారు జైపూర్‌లో. అంతేకాదు రాజ‌స్థాన్ రాష్ట్రంతో జేవీ చేసుకున్నారు. తెలంగాణ 76, రాజ‌స్థాన్ 24తో జాయింట్ వెంచ‌ర్ చేసుకున్నారు. 24 శాతంలో వాడు పైస‌లు పెట్ట‌డట‌. పాక్ స‌రిహ‌ద్దులో జైసల్మేర్ జిల్లా అని ఉంట‌ది.. ఎడారిలో మూడు నాలుగు వేల ఎక‌రాలు జాగ చూపిస్తాడ‌ట‌. ఆ జాగ‌లో సింగ‌రేణోడు పోయి సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ పెడ్త‌డ‌ట‌. ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్‌లో సింగ‌రేణి ఆఫీసు న‌డుస్తుంది. కొంత‌మంది ఉద్యోగులు ఉన్నారు. జైస‌ల్మేర్‌లో రాజ‌స్థాన్ కానీ, భార‌త ప్ర‌భుత్వం కానీ ప‌వ‌ర్ ప్లాంట్లు పెట్ట‌లేదు. బ‌క్రా గాడు తెలంగాణోడు దొరికిండు అని జైపల్మేర్‌లో పోయి సింగ‌రేణి ఆఫీసు ఓపెన్ చేసిండు. రాజ‌స్థాన్ కేబినెట్ దీన్ని ఆమోదించింది. కానీ తెలంగాణ కేబినెట్ ఆమోదించ‌లేదు. డీపీఆర్ ఆమోదం కాలేదు.. ఇంత వ‌ర‌కు పీపీఏ కాలేదు. ఎన్టీపీసీ వ‌ద్ద ఆల్రెడీ మ‌న‌కు ఇచ్చే 4 వేల‌ల్లో ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్ ఉంద‌ని చెబితే వ‌ద్దు అంటున్న‌డు. రూపాయి ఖ‌ర్చు లేకుండా చౌక‌గా క‌రెంట్ ఇస్తా అంటే వ‌ద్దంటున్న‌డు. ఇప్పుడు జైస‌ల్మేర్‌లో అయితే రూ. 4 వేల కోట్లు ఖ‌ర్చు అయిత‌ది. పైస‌లు ఉన్నాయా.. అంటే లేవు. మ‌రి ఎందుకు క‌డుతున్న‌వ్ ఇది. క‌ట్టేది ఉంటే పీపీఏ ఎందుకు ఇస్త‌లేరు. డీపీఆర్ ఎందుకు ఆమోదించ‌డం లేదు. ఇవేమీ లేకుండా రాజ‌స్తాన్‌తో ఎందుకు జేవీ చేసుకున్నారు..? జైస‌ల్మేర్‌లో ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్న‌రు..? రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా జైపూర్‌లో ఎందుకు సింగ‌రేణి ఆఫీసు ఓపెన్ చేశారు. అస‌లేం జ‌రుగుతుంది దీని వెనుక‌.. ఇదంతా బ‌య‌ట‌కు రావాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

రూ. 800 కోట్లు సింగ‌రేణి న‌ష్ట‌పోయిన‌ట్టే..!

ఇందులో ఇంకో కోణం ఉంది.. పీపీఏ లేదు.. డీపీఆర్ ఆమోదం కాలేదు.. ఆల్రెడీ బీహెచ్ఈఎల్‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. సివిల్ వ‌ర్కుల‌కు టెండ‌ర్లు పిలిచారు.. ప‌నులు స్టార్ట్ అయ్యాయి. డీపీఆర్ లేకుండా స్టార్ట్ చేయొచ్చా..? లోన్లు కావాలంటే పీపీఏ, డీపీఆర్ కావాలి. బ్యాంకులు అప్పు ఇస్త‌లేవు.. కాబట్టి ప‌నులు స‌గంలో ఆగిపోయాయి. ఈ థ‌ర్మ‌ల్ ప్లాంట్లు ఎట్ల ఉంటాయంటే.. రోజుకు కోటి రూపాయాలు న‌ష్టం అవుతుంది. ఏడాదికి రూ. 365 కోట్లు న‌ష్టం అవుతుంది. ఇప్ప‌టికీ ఏడాదిన్న‌ర నుంచి స‌గంలో ఆగిపోయింది. అంటే రూ. 800 కోట్లు సింగ‌రేణి న‌ష్ట‌పోయిన‌ట్టే ఈ నిమిషానికి. క‌మీష‌న్ల కోసం హ‌డావుడిగా ఆర్డ‌ర్లు, టెండ‌ర్లు ఇచ్చారు.. ఉన్న డ‌బ్బుల్లో నుంచి పేమెంట్లు చేశారు.. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్లు క‌రిగిపోతున్నాయ‌ని మాజీ మంత్రి తెలిపారు.

పీపీఏ లేదు.. డీపీఆర్ లేదు.. అదో పెద్ద కుంభ‌కోణం..

ఎన్ని సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు పెట్టారంటే.. 106 మెగావాట్ల‌కు ఒక టెండ‌ర్ పిలిచారు. 98 మెగావాట్ల‌కు ఒక టెండ‌ర్ పిలిచారు. సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు క‌ట్టారు.. కానీ ఇప్పుడు అది ఎవ‌రూ తీసుకుంట‌లేరు. ఉత్ప‌త్తి చేసిన క‌రెంట్ కు పీపీఏ తీసుకోవ‌డం లేదు రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇందులో కూడా పెద్ద క‌థ ఉంది. ఆ సోలార్ టెండ‌ర్ల వెనుక జ‌రిగిన అవినీతి ఏంది..? ఆ టెండ‌ర్ కండీష‌న్ ఎట్ల పెట్టిండ్రు. వాస్త‌వానికి 3 రూపాయాల‌కు ఒక మెగావాట్ సోలార్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి అవుతుంది. సింగ‌రేణి ఇచ్చిన టెండ‌ర్లు నాలుగు రూపాయాల 2 పైస‌లు, 3 రూపాయాల 90 పైస‌లు, 5 రూపాయాల‌కు కూడా ఇచ్చిండ్రు ఈ కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో. అంటే సింగ‌రేణి మీద ఎంత భారం ప‌డ‌బోతుందో చూడండి. ఎవ‌రి డ‌బ్బులు ఎట్ల ఖ‌ర్చు పెడుతున్న‌రు. కొత్త బొగ్గు బావులు ఓపెన్ చేయాలి.. కేంద్రం నుంచి కొత్త బ్లాక్‌లు తెచ్చుకోవాలి. నైనీ ఓపెన్ చేయాలి.. దీని మీద దృష్టి లేదు కానీ కొత్తగా సోలార్, థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్లు పెడుతామంటారు. పీపీఏ, డీపీఆర్ చేయ‌డం లేదు. కానీ అదో పెద్ద స్కాం జ‌రుగుతుంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

10 శాతం ఇచ్చుడు.. క‌మీష‌న్లు కొట్టుడు..

సోలార్ ప‌వ‌ర్ పేరు మీద దాదాపు 300 మెగావాట్లు టెండ‌ర్లు పిలిచి మొబిలైజేష‌న్ అడ్వాన్సులు ఇచ్చారు. టెండ‌ర్ కాగానే వాడికి 10 శాతం.. ఇక వీళ్ల లెక్క సెటిల్ అయిత‌ది. మ‌న గ‌వ‌ర్న‌మెంట్‌లో ప‌ని చేస్తేనే డ‌బ్బులు ఇచ్చాం. ఇవాళ మొబిలైజేష‌న్ అడ్వాన్స్‌లు పెట్టి టెండ‌ర్ కాగానే 10 శాతం ఇచ్చుడు.. క‌మీష‌న్లు కొట్టుడు. అట్ల ఇవాళ సింగ‌రేణిలో 300 మెగావాట్ల సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ కుంభ‌కోణం జ‌రిగింది. జైపూర్ ప‌వ‌ర్ ప్లాంట్ వెనుక సింగ‌రేణిలో పెద్ద కుంభ‌కోణం జ‌రుగుతుందన్నారు హ‌రీశ్‌రావు.

ఒక వైపేమో రూ. 4 వేల కోట్ల ఓడీ.. మ‌రోవైపు సీఎం సోకుల‌కు సింగ‌రేణి పైస‌లు

ఒక వైపేమో రూ. 4 వేల కోట్ల ఓడీ.. ఇంకో వైపు ముఖ్య‌మంత్రి ఫుట్ బాల్ సోకుల కోసం సింగ‌రేణి పైస‌లిస్త‌రు. బంగారు బాతుగా ఉండే సింగ‌రేణిని ఆగం చేసే ప‌రిస్థితి జ‌రుగుతుంది. తెలంగాణ‌కు ఏ రాష్ట్రానికి లేని విధంగా గొప్ప ఆస్తి సింగ‌రేణి ఉంది. దాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. సింగ‌రేణి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంగా చేశార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement