త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే.. స‌చివాల‌యం ముట్ట‌డిస్తాం : హ‌రీశ్‌రావు

Harish Rao | నిరుద్యోగ య‌వ‌త తిర‌గ‌బ‌డ‌క‌ముందే త‌క్ష‌ణ‌మే సీఎం రేవంత్ రెడ్డి మేల్కోవాలి.. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగుల‌తో క‌లిసి స‌చివాల‌యం ముట్ట‌డించే ప‌రిస్థితులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

S

Telangana | Published On May 2, 2026, 5.46 pm IST

Harish Rao | 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే.. స‌చివాల‌యం ముట్ట‌డిస్తాం : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగ య‌వ‌త తిర‌గ‌బ‌డ‌క‌ముందే త‌క్ష‌ణ‌మే సీఎం రేవంత్ రెడ్డి మేల్కోవాలి.. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగుల‌తో క‌లిసి స‌చివాల‌యం ముట్ట‌డించే ప‌రిస్థితులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. జాబ్ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాం అని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ధ‌ర్నా చేస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు హ‌రీశ్‌రావు సంఘీభావం ప్ర‌క‌టించి ప్ర‌సంగించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని నిరుద్యోగులు ధ‌ర్నాలు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి రేవంత్ నిరుద్యోగులు నోటిఫికేష‌న్లు వ‌ద్దంటున్నార‌ని బుకాయిస్తున్నారు. గ‌త రెండున్న‌రేండ్ల నుంచి ఈ నిరుద్యోగ యువ‌త నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్నారు.. మేం జీవితంలో ఎప్పుడు స్థిర‌ప‌డుతామా అని ఓపిక‌గా ఎదురుచూస్తున్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద కూర్చోబెట్టి.. మొద‌టి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు నింపుతామ‌ని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి న‌మ్మ‌బ‌లికారు. నిరుద్యోగుల చేత బస్సు యాత్ర‌లు చేయించారు. మా పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని త‌ల్లిదండ్రుల చేత ప్ర‌చారం చేయించుకున్నారు. నాడు న‌మ్మించారు.. నేడు వంచించారు. ఇది కాంగ్రెస్ నైజం. ఇవాళ ముఖం చాటేశారు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

పోలీసుల నిల‌యంగా సెంట్ర‌ల్ లైబ్ర‌రీ..

సినిమా థియేట‌ర్ ప్రారంభానికి పోతున్నారు.. కానీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు సీఎం రేవంత్. అక్క‌డికి పోయే ప‌రిస్థితి లేదు. అదే అశోక్ న‌గ‌ర్ లైబ్ర‌రీలో పోలీసుల చేత పిల్ల‌ల వీపులు ప‌గుల‌గొట్టిస్తున్నాడు. ర‌క్తాలు కారించేలా కొట్టిస్తున్నాడు. సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి తాళాలు వేసి పోలీసుల నిల‌యంగా మార్చిండు అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

ల‌క్షా 84 వేల ఉద్యోగాలు ఎప్ప‌టిలోగా ఇస్తారు..

కోదండ‌రాం, బ‌ల్మూరి వెంక‌ట్, భ‌ట్టి విక్ర‌మార్క గొంతులు ఎందుకు మూగ‌బోయాయి. 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చారు కేసీఆర్. ల‌క్షా 60 వేలు నింపాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం 16 వేల ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చింద‌ని అసెంబ్లీలో సీఎం ప్ర‌క‌టించారు. ల‌క్షా 84 వేల ఉద్యోగాలు ఎప్ప‌టిలోగా ఇస్తారు. రెండున్న‌రేండ్లు అయిపోయింది. ప‌రీక్ష ఎప్పుడు.. ఫ‌లితం ఎప్పుడు.. ఉద్యోగం ఎప్పుడిస్తారు అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

పోలీసు శాఖ‌లో 19 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల్సిందే..

పోలీసు శాఖ‌లో 19 వేల ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెబుతున్నాడు. మ‌రి ఎందుకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం లేదు. ఐదు వేల‌కే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ట‌. నువ్వే హోం మంత్రి.. నువ్వే ముఖ్య‌మంత్రి. పోలీసు ఖాళీలు నింపాల‌ని, జీవో 46పై రెచ్చ‌గొట్టి మాట్లాడ‌వు. బీఆర్ఎస్ 40 వేల పోలీసు ఉద్యోగాలు నింపింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈరోజు వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేదు. వెంట‌నే ఖాళీగా ఉన్న 19 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఖాళీగా 30 వేల ఉపాధ్యాయ పోస్టులు.. 

30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఎప్పుడు నింపుతావు. మెగా డీఎస్సీ అని ఊరించిన‌ నువ్వు ఎందుకు ఇస్త‌లేవు. మెగా డీఎస్సీ ద‌గా డీఎస్సీ అయిపోయింది. త‌క్ష‌ణ‌మే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, ఎస్ఏ పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి. త‌క్ష‌ణ‌మే నోటిఫికేష‌న్ ఇవ్వాలి. గ్రూప్-1, 2, 3, 4లో కూడా ఖాళీలు ఉన్నాయి.. వాట‌న్నింటిని నోటిఫై చేసి నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని మాజీ మంత్రి పేర్కొన్నారు.

నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీకి మ‌ర‌ణ‌శాస‌నం రాస్తారు.. జాగ్ర‌త్త

నిరుద్యోగులు నోటిఫికేష‌న్లు వద్దంటున్నార‌న్న డ్రామాలు బంద్ చేయ్.. చిల్ల‌ర మాట‌లు కాదు.. జాబ్ నోటిఫికేష‌న్లు కావాలి. అసెంబ్లీలో విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్ చిత్తు కాగితం అయింది. దాని ప్ర‌కారం ఒక్క నోటిఫికేష‌న్ రాలేదు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేదు. హోట‌ల్స్‌లో ప‌ని చేయాల‌ని చెబుతుండు. మా పిల్ల‌లు పీజీలు చేసింది, డాక్ట‌రేట్లు పొందింది హోట‌ల్స్‌లో ప‌ని చేయ‌డానికా.. నిరుద్యోగ యువ‌త‌ను అవ‌మాన‌ప‌రిచే విధంగా సీఎం మాట్లాడుతున్నాడు. ఏ యువ‌త అయితే నీ కోసం ప‌ని చేసిందో.. అదే యువ‌త తిర‌గ‌బ‌డే రోజు వ‌స్త‌ది.. జాగ్ర‌త్త అని హెచ్చ‌రిస్తున్నాం. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ప‌ని చేశారు.. వారే మ‌ర‌ణ‌శాస‌నం రాస్తారు జాగ్ర‌త్త అని హెచ్చ‌రిస్తున్నాన‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఎందుకు 34 ఏళ్ల‌కే ప‌రిమితం చేస్తున్న‌వ్..

భ‌ట్టి నువ్వే ఇచ్చావు జాబ్ క్యాలెండ‌ర్.. అసెంబ్లీలో ఇచ్చిన మాట‌కు విలువ ఉన్న‌దా..? ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్, అశోక్‌న‌గ‌ర్‌లో ల‌క్ష‌ల మంది పిల్ల‌లు జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని లైబ్ర‌రీలో పిల్ల‌లు క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నారు. బీఆర్ఎస్ ప‌దేండ్లు వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు చేసింది. ఎందుకు 34కే ప‌రిమితం చేస్తున్న‌వ్.. ఫీజులు కూడా ఉండ‌వు అన్నావ్.. ఇప్పుడు ఫీజులు ఎందుకు పెడుతున్నారు అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

నిరుద్యోగ యువ‌త‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు

ఈ ఉద్య‌మం మ‌రింత ఉధృతం కాకముందే.. నిరుద్యోగ య‌వ‌త తిర‌గ‌బ‌డ‌క‌ముందే త‌క్ష‌ణ‌మే రేవంత్ రెడ్డి మేల్కోవాలి. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగుల‌తో క‌లిసి స‌చివాల‌యం ముట్ట‌డించే ప‌రిస్థితులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు. నిరుద్యోగ యువ‌త‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement