త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఫ్యూచ‌ర్ సిటీపై ఉన్న ధ్యాస‌.. హెల్త్ సిటీపై లేదు.. సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి క‌మీష‌న్లు తెచ్చే రియ‌ల్ ఎస్టేట్‌ ఫ్యూచ‌ర్ సిటీ మీద ఉన్న ధ్యాస‌.. పేద‌ల‌కు ప్రాణం పోసే వ‌రంగ‌ల్ హెల్త్ సిటీ మీద లేదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On Feb 24, 2026, 2.36 pm IST

Harish Rao | ఫ్యూచ‌ర్ సిటీపై ఉన్న ధ్యాస‌.. హెల్త్ సిటీపై లేదు.. సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్
Advertisement

అక్క‌సుతోనే న‌త్త‌న‌డ‌క‌న వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రి ప‌నులు
సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు?
ఎంజీఎంలో ఎందుకు గుండె ఆప‌రేష‌న్లు ఆపారు..?
వ‌రంగ‌ల్‌లో ద‌య‌నీయంగా ఆరోగ్య శాఖ ప‌రిస్థితి
ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స‌మానంగా అమ‌లు చేయాలి
లేదంటే వ‌రంగ‌ల్ గ‌డ్డ‌పైనే నిరాహార దీక్ష‌కు దిగుతాం..
సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి క‌మీష‌న్లు తెచ్చే రియ‌ల్ ఎస్టేట్‌ ఫ్యూచ‌ర్ సిటీ మీద ఉన్న ధ్యాస‌.. పేద‌ల‌కు ప్రాణం పోసే వ‌రంగ‌ల్ హెల్త్ సిటీ మీద లేదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కేసీఆర్‌కు మంచిపేరు వ‌స్తుంద‌నే అక్క‌సుతోనే.. వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ప‌నుల‌ను కావాల‌నే న‌త్త‌న‌డ‌క‌న సాగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వెంట‌నే సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ప‌నులు పూర్తి చేసి ప్రారంభించ‌క‌పోతే బీఆర్ఎస్ ప‌క్షాన వ‌రంగ‌ల్ గ‌డ్డ‌పైనే నిరాహార దీక్ష‌కు దిగుతామ‌ని మాజీ మంత్రి హెచ్చ‌రించారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోంది. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ.. కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి. రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సగానికి సగం తగ్గించింది. రోడ్ నెట్‌వ‌ర్క్, ఎలివేషన్ వర్క్స్ అన్నీ తగ్గించేశారు. కేసీఆర్‌కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంతవరకు రిక్రూట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? పేపర్లలో చూస్తే 'ఓపీ సేవలు' ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు? బీఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టాం. దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండి. వెంటనే ఎక్విప్‌మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఎంజీఎంలో ఎందుకు గుండె ఆప‌రేష‌న్లు ఆపారు..?

ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్‌లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా? రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు.. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలో నీళ్లు కారుతున్నాయని థియేటర్లనే మూసేశారు. రోగులను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. మేము కేథల్యాబ్‌లు, మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మీ చేతిలో పెడితే, వాటిని నడిపించే సత్తా కూడా మీకు లేదు. ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స‌మానంగా అమ‌లు చేయాలి

పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చింది. ఉద్యోగులకు 1 శాతం కంట్రిబ్యూషన్‌తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోంది. కేసీఆర్ రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న వరంగల్‌లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్‌ను, ఆమన్‌గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. కక్షలు కట్టడం కాదు, ముందు ఆసుపత్రి కట్టు రేవంత్ రెడ్డి. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్‌తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement