త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిల‌దీసిన హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్ర విద్యాశాఖ‌లో ఎలాంటి అవినీతి జ‌ర‌గ‌లేదంటున్న మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాల‌పై నెపం తోసేస్తున్నార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jul 2, 2026, 5.33 pm IST

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిల‌దీసిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర విద్యాశాఖ‌లో ఎలాంటి అవినీతి జ‌ర‌గ‌లేదంటున్న మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాల‌పై నెపం తోసేస్తున్నార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు గురువారం మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం ఖర్చు రూ. 84 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారు. మేము రూ.2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే... అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ముందుగా రూ.687 కోట్లు, తర్వాత రూ.1,142 కోట్లు అన్నారు. గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. గురుకుల కిరాణా టెండ‌ర్ల‌లో రూ. 200 కోట్ల గోల్‌మాల్ జరిగింద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. మ‌రి రూ.1,142 కోట్లు, రూ. 800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? అని మంత్రి అడ్లూరిని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. ఈ టెండర్ విధానంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. మొదటి నుంచే పిల్లలు తినే ఆహారం, గుడ్ల కొనుగోళ్లలో కూడా స్కాం జరిగిందని చెబుతున్నాం. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, గరం మసాలా వంటి వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేశారని హ‌రీశ్‌రావు తెలిపారు.

టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేది

బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జీవో తీసుకొచ్చింది. పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫాంల ఆర్డర్లు టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని న్యాయమూర్తి నందా ఆదేశించారు. అయినా అమలు చేయకపోవడంతో వీరాంజనేయ హ్యాండ్‌లూమ్ సొసైటీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కూడా హైకోర్టు చేనేత కార్మికుల జీవనోపాధిపై దెబ్బ కొట్టొద్దని స్పష్టం చేసింది. కమిషన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకుంది. ఆర్డర్లను రద్దు చేసిన చర్య తప్పని హైకోర్టు వ్యాఖ్యానించింది అని హ‌రీశ్‌రావు అన్నారు.

మఫత్‌లాల్ ముద్దు... చేనేత వద్దు

కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వేలాది చేనేత కార్మికులు రోడ్డున పడతారని లేఖలో పేర్కొన్నారు. దయాపూర్వక పరిశీలన కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ.. చేనేత కార్మికులపై లేదు. మఫత్‌లాల్ ముద్దు... చేనేత వద్దు అన్నదే ప్రభుత్వ వైఖరి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో నెం.110 తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం బట్టలు, బూట్ల కొనుగోళ్లు లిడ్‌క్యాప్ ద్వారా జరగాలి. ఒక శాఖ మరో శాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదే స్కాంకు నిదర్శనం. లిడ్‌క్యాప్ నుంచి ఆర్డర్లు లాక్కొని దళిత బిడ్డలను మోసం చేశారు. కేసీఆర్ హయాంలో మాకే ఆర్డర్లు ఇచ్చేవారని లిడ్‌క్యాప్ లేఖ రాసింది. అలాంటప్పుడు స్కాం జరగలేదని అడ్లూరి లక్ష్మణ్ ఎలా చెబుతారు? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

గుజరాత్ దళారులకు ఆర్డర్లు కట్టబెట్టారు

శ్రీధర్ బాబుకు కూడా లిడ్‌క్యాప్ లేఖ రాసింది. పీఎంయూ చైర్మన్‌కూ లేఖ రాసి దళిత బిడ్డల నోరు కొట్టొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను తుంగలో తొక్కింది. దళిత మంత్రి, శ్రీధర్ బాబు, పీఎంయూ చైర్మన్ పట్టించుకోలేదు. గుజరాత్ దళారులకు ఆర్డర్లు కట్టబెట్టారు. చివరకు దళిత బిడ్డలు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు చెప్పిన తర్వాతే 10 శాతం ఆర్డర్లు ఇచ్చారు. చెప్పుడేమో ఘనం.. చేతలేమో శూన్యం. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మీ ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ కాకి ఎత్తుకుపోయిందా? కేసీఆర్ వైన్ షాపులు, ఇరిగేషన్, ఆసుపత్రుల టెండర్లలో రిజర్వేషన్లు కల్పించారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇప్పటికీ పాఠశాలలకు నోట్‌బుక్స్ అందలేదు

నోట్‌బుక్స్ కొనుగోళ్లలో రూ.150 కోట్ల కమిషన్ కోసం వాటర్‌మార్క్ నిబంధన పెట్టారు. మేము బయటపెట్టడంతో టెండర్లు రద్దు చేశారు. ఇప్పటికీ పాఠశాలలకు నోట్‌బుక్స్ అందలేదు. సీఎం, ఐఏఎస్ అధికారుల పిల్లలు కూడా నోట్‌బుక్స్ లేకుండా పాఠశాలలకు వెళ్తారా? మీ వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. ఈ ప్రశ్న అడగడం తప్పా? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

లక్ష్మీభాయిని బదిలీ చేశారు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయిని బదిలీ చేశారు. శ్రీధర్ బాబు సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు.. మేము ఇలా చేశామా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించారు. రిటైర్ అయ్యే ఏడాది ముందు ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు. బీఆర్ఎస్ పోరాటం గురుకులాల్లో చదివే 6 లక్షల మంది పిల్లల కోసం.. ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవిష్యత్తు కోసం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement