త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మైక్ క‌ట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు.. రేవంత్‌కు హ‌రీశ్‌రావు ష‌ర‌తు

Harish Rao | సాగునీటి ప్రాజెక్టుల‌పై అసెంబ్లీలో మాట్లాడుతాను.. చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? అని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Feb 24, 2026, 3.06 pm IST

Harish Rao | మైక్ క‌ట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు.. రేవంత్‌కు హ‌రీశ్‌రావు ష‌ర‌తు
Advertisement

అసెంబ్లీలో గోదావ‌రి జ‌లాల‌పై చ‌ర్చిద్దామ‌న్న సీఎం..
రేవంత్ స‌వాల్‌ను స్వీక‌రించిన హ‌రీశ్‌రావు
గోదావ‌రి జ‌లాల‌పై చీక‌టి ఒప్పందాలు బ‌య‌ట‌పెడుతాం..
ఎవ‌రు ఏం చేశారో అసెంబ్లీ వేదిక‌గా తేల్చ‌కుందాం..

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : సాగునీటి ప్రాజెక్టుల‌పై అసెంబ్లీలో మాట్లాడుతాను.. చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? అని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు.. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం అని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

మా దెబ్బకే సీఎంకు సోయి వచ్చింది. మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపాం. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచాం. ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారు. ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదు..

డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదు. మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు, కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?

భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నాడు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచింది. తొమ్మిదేళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

నీ చీక‌టి ఒప్పందాలు అసెంబ్లీలో బ‌య‌ట‌పెడుతాం..

మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో మాట్లాడుతుంటే, ఆయనను ఆపి కడియం శ్రీహరికి దేవాదులపై మంచి నాలెడ్జ్ ఉంది, త‌రువాతి రివ్యూలో ఆయన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్ మంత్రిని అవమానించడమే. నీ సొంత క్యాబినెట్ మంత్రికే ఏమీ తెలియదని నువ్వే చెప్తుంటే, ఇక నువ్వు వేరే వాళ్లతో ఎలా పనులు చేయిస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు చంద్రబాబుకు ఎట్లా దాసోహం అయ్యావో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకి నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ మీద నీ చీకటి ఒప్పందాలు అన్ని అసెంబ్లీలో బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నా. న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్‌కు ఎలా స‌హ‌క‌రిస్తున్నావో తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement