త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్‌..!

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పేర్లు కోల్పోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు కల్పించింది.

P

Telangana | Published On Nov 6, 2026, 8.40 pm IST

SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్‌..!
Advertisement

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పేర్లు కోల్పోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు కల్పించింది. గైర్హాజరు, నివాసం మార్పు, మరణం, డూప్లికేట్‌ ఓటర్లుగా గుర్తించినవారితోపాటు.. ఎన్యూమరేషన్‌ ఫారాలు అందినా తిరిగి సమర్పించని కారణంగా జాబితాలో పేరు కోల్పోయినవారికీ ఈ అవకాశం వర్తించనుంది. అర్హులైన ఒక్క ఓటరు కూడా తుది జాబితాలో చోటు కోల్పోకూడదని, అదే సమయంలో నకిలీ ఓట్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగానికి ఈసీ స్పష్టం చేసింది. గతంలో ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ, అవి తిరిగి అందకపోవడంతో పలువురి పేర్లు ముసాయిదా జాబితాలో గల్లంతయ్యాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

బూత్‌ల వారీగా జాబితాల ప్రదర్శన

జాబితా నుంచి తప్పిపోయిన ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఈసీ సూచించింది. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో తొలగింపునకు గురైన ఓటర్ల వివరాలను, అందుకు ప్రాథమికంగా గుర్తించిన కారణాలతో సహా ప్రదర్శించాలి. ఈ వివరాలను రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈవో) వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచాలి. సంబంధిత ఓటర్లకు కొత్తగా ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి, వీలైనన్ని మార్గాల్లో వారిని సంప్రదించాలని ఆదేశించింది. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను కలవడంతోపాటు వాట్సాప్‌, ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం చేరవేయాలి. అర్హులైన వారెవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది.

చిరునామా మారితే ఫారం-8 అవసరం లేదు

గత చిరునామాలోనే నివసిస్తున్నప్పటికీ ఎన్యూమరేషన్‌ ఫారం అందకపోవడం, తిరిగి సమర్పించలేకపోవడం వల్ల పేరు తొలగిపోయినవారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం నింపిన ఎన్యూమరేషన్‌ ఫారంతోపాటు గతంలో ఫారం ఎందుకు సమర్పించలేకపోయారో వివరిస్తూ ఒక ప్రకటన ఇస్తే సరిపోతుంది. ఇక అదే రాష్ట్రంలో మరో ప్రాంతానికి నివాసం మార్చినవారు చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. కొత్త ఎన్యూమరేషన్‌ ఫారంతోపాటు ప్రస్తుత చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి.

వారికి బీఎల్‌ఓ నివేదికే ఆధారం

చిరునామా ధ్రువీకరణ పత్రాలు లేని నిరాశ్రయ ఓటర్ల విషయంలోనూ ఈసీ వెసులుబాటు కల్పించింది. అలాంటి వారి నివాస వివరాలను బీఎల్‌ఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చే నివేదికనే ధ్రువీకరణగా పరిగణిస్తారు. ఈ విధంగా అందిన దరఖాస్తులన్నింటినీ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్‌ఓలు) క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తూనే, జాబితాలో పారదర్శకత, ప్రామాణికతను కాపాడటమే తాజా మార్గదర్శకాల లక్ష్యమని ఈసీ పేర్కొంది.

Advertisement
Advertisement