త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ ప‌రిస్థితులు.. కేంద్రం ఆదుకోవాల‌ని శాస‌న‌స‌భ‌లో ముసాయిదా తీర్మానం

TG Assembly | ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగినంత సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా కోరింది. వర్షపాతం లోటుతో వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, పశుసంపద, గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.

P

Telangana | Published On Sep 18, 2026, 9.40 pm IST

TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ ప‌రిస్థితులు.. కేంద్రం ఆదుకోవాల‌ని శాస‌న‌స‌భ‌లో ముసాయిదా తీర్మానం
Advertisement

TG Assembly | ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగినంత సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా కోరింది. వర్షపాతం లోటుతో వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, పశుసంపద, గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ముసాయిదా తీర్మానాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 2026 నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్రమైన వర్షపాతం లోటు ఏర్పడిందని భట్టి తెలిపారు. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మరింత బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు రాష్ట్రంలో సాధారణంగా 664.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 536.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని చెప్పారు. దీంతో 20 శాతం వర్షపాతం లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.

తగ్గిన పంటల సాగు విస్తీర్ణం

వర్షపాతం లోటుతో పాటు వర్షాల మధ్య వ్యవధి పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిందని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో వానాకాలంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 139.29 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది 88 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయని తెలిపారు. వరి సాగు విస్తీర్ణం దాదాపు 18 శాతం తగ్గిందన్నారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పంటలు మొలకెత్తక పలుమార్లు విత్తనాలు వేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా పెరిగిందన్నారు. వర్షాభావ పరిస్థితులు రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి, పశుసంపద, పశుగ్రాసం లభ్యతపైనా ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

241 టీఎంసీలకే నీటి నిల్వలు

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయని భట్టి తెలిపారు. సెప్టెంబర్‌ 15 నాటికి ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 585 టీఎంసీలు కాగా.. కేవలం 241 టీఎంసీల లైవ్‌ స్టోరేజీ మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజున 497 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న నీటి నిల్వలు యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు సరిపోవని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గడం, చెరువులు, కుంటల్లో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించిందని భట్టి చెప్పారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఉపశమన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అయితే పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రానికి 8 ప్రధాన డిమాండ్లు

వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్రానికి ఉపశమనం కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శాసనసభ ఏకగ్రీవంగా కోరింది.

కేంద్ర బృందాన్ని పంపాలని.. : ఎల్‌నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా తెలంగాణకు పంపించాలని కోరింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి తగిన సాయం మంజూరు చేయడంతో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)లో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.

పంట నష్టానికి, తాగునీటికి సాయం : పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, పశుసంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరింది. అవసరమైతే ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేసింది.

ఉపాధి హామీ కింద అదనంగా 50 రోజులు : వీబీ–జీ రామ్‌ జీ పథకంలో ప్రస్తుతం ఉన్న 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కోరింది. ఈ అదనపు ఉపాధిపై అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్‌ సస్పెన్షన్‌ కాలాన్ని సడలించాలని, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించేందుకు లేబర్‌ బడ్జెట్‌ను తగినంతగా పెంచాలని కోరింది.

ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వాలి : రాష్ట్రానికి అవసరమైన ఎరువులను తగినంతగా, సకాలంలో కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్‌ల ద్వారా ఎరువులను సరఫరా చేయాలని కోరింది. పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌ (పీడీఎంసీ) కింద కేటాయింపులను పెంచి డ్రిప్‌ ఇరిగేషన్‌ను వేగంగా విస్తరించాలని సూచించింది. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎంఐడీహెచ్‌) కింద కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆర్థిక సహాయం అందించాలని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని కోరింది.

1,500 మెగావాట్ల అదనపు విద్యుత్ : తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని కోరింది. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి ఈ విద్యుత్‌ను అందించాలని విజ్ఞప్తి చేసింది. విండో–1 కింద 5 మిలియన్‌ టన్నుల బొగ్గు లింకేజీని నిర్ధారించి రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు రేక్‌ల లభ్యతను పెంచాలని కోరింది. విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలను సడలించి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.

రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ : తాగు, సాగునీటి అవసరాలు, కరువు నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలని శాసనసభ కోరింది. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవనంతో పాటు పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరింది. తద్వారా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

కేంద్ర పథకాల కింద అదనపు సాయం : రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఇందుకు అవసరమైన మేరకు నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేసింది.

ఏకగ్రీవంగా తీర్మానం

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడంతో పాటు భవిష్యత్‌ అవసరాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగినంత ఆర్థిక, సాంకేతిక, వనరుల సహాయం అందించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా కోరింది.

Advertisement
Advertisement