త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్‌! మీ పార్టీ ఎమ్మెల్యే ఆరోప‌ణ‌ల‌పై మౌనం వీడు

Dasoju Sravan | జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) తమ సొంత ప్ర‌భుత్వంపై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Sravan) స్పందించారు.

S

Telangana | Published On Nov 17, 2026, 5.28 pm IST

Dasoju Sravan | రేవంత్‌! మీ పార్టీ ఎమ్మెల్యే ఆరోప‌ణ‌ల‌పై మౌనం వీడు
Advertisement
  • మీ అవినీతి పాల‌న‌పై అనిరుధ్‌రెడ్డి ధైర్యంగా మాట్లాడిండు.. ఆయ‌న‌కు నా అభినంద‌న‌లు
  • స్పందించి ఏసీబీ విచార‌ణకు ఆదేశించు
  • ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్‌

Dasoju Sravan | త్రినేత్ర న్యూస్‌: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) తమ సొంత ప్ర‌భుత్వంపై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Sravan) స్పందించారు. ఇది బీఆర్ఎస్ వేసిన ఛార్జ్‌షీట్ కాద‌ని.. రేవంత్ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ధైర్యంగా మాట్లాడ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి వెంట‌నే ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం తెలంగాణ ప్రజలు, మీడియా ప్రతినిధులు, నెటిజన్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో డా. శ్రవణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో, అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయో అనిరుధ్‌రెడ్డి ఆవేదనతో బయటపెట్టారన్నారు.

"మిస్టర్ రేవంత్ రెడ్డి గారూ.. ఇది బీఆర్ఎస్ పార్టీనో, మరే ఇతర ప్రతిపక్ష పార్టీనో మీపై వేసిన ఛార్జ్‌షీట్ కాదు. మీ పార్టీ తరఫున గెలిచిన మీ సొంత ఎమ్మెల్యేనే మీ అవినీతి పాలనపై రిలీజ్ చేసిన ఛార్జ్‌షీట్ ఇది. రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లులో 20% కమీషన్లు పోగా, ప్రజలకు దక్కే పని విలువ కేవలం రూ.2.5 లక్షలేనా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 'గుడ్ గవర్నెన్స్' అంటే ఇదేనా? హోం శాఖ, ఏసీబీ (ACB) మీ చేతిలోనే ఉన్నా ఈ అవినీతి ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?

50 శాతం ప్రజాధనం వృథా!

ఒక సాధారణ రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లు క్లియర్ కావాలంటే ఎం-బుక్ (M-Book) రికార్డింగ్ దశలోనే అధికారులు 10% నుంచి 20% వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పిన అంశాన్ని డా.శ్రవణ్ విశ్లేషించారు.

20% కమీషనేమో అధికారులు, మధ్యవర్తుల వద్దకు వెళ్తున్న వాటా. 30% మార్జిన్ కాంట్రాక్టర్ మనుగడ, లాభం కోసం చూసుకునే వాటా. రూ.5 లక్షల ప్రజాధనంలో అసలైన నిర్మాణ పని కోసం ఖర్చయ్యేది కేవలం 50% (రూ.2.5 లక్షలు) మాత్రమేనని, మిగతా సొమ్మంతా కమీషన్ల రూపంలో పోతోంది.

మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయ్‌?

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగా పొందుపరిచిన 'సుపరిపాలన (Good Governance)', జాతీయ స్థాయి 'న్యాయపత్ర'లో ఇచ్చిన అవినీతి రహిత పాలన హామీలను డా. శ్రవణ్ గుర్తుచేశారు. గ‌తంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో 'ఆర్ఆర్ ట్యాక్స్' వసూలు చేస్తున్నారని ఆరోపిస్తే ఏమో అనుకున్నాం. ఇప్పుడు మీ సొంత ఎమ్మెల్యేనే 20% కమీషన్ దందా గురించి మాట్లాడారు. ఇది ప్రజాపాలన కాదు.. పర్సెంటేజీల పాలన" అని డా. శ్రవణ్ విమర్శించారు. ఈ విధంగా వసూలవుతున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందో, ఏ రాష్ట్ర ఎన్నికలకు తరలిస్తున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పారిశ్రామికవేత్తలు భయపడుతున్నరు

కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దోపిడీ వైఖరి వల్ల తెలంగాణకు రావాల్సిన కొత్త పెట్టుబడులు ఆగిపోతున్నాయని డా.శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. కంపెనీలు రాకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా దూరమవుతున్నాయి" అని ఆయన అన్నారు.

"ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు మానుకుని, ముఖ్యమంత్రిగా మీకు పరిపాలనాపరమైన బాధ్యత ఉంటే వెంటనే మీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి విచారణకు ఆదేశించాలి. ఈ కమీషన్ల పాలనకు ముగింపు పలకాలి" అని తెలంగాణ ప్రజల పక్షాన డా.దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement