త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Rajesh | హీరోయిన్ రోల్స్ బోర్ కొట్టాయి – విల‌న్‌గా న‌టించాల‌నుంది – ఐశ్వ‌ర్య రాజేష్ కామెంట్స్‌

కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డం రిస్క్ అనే ఆలోచ‌న ఎప్పుడూ లేద‌ని ఐశ్వ‌ర్య రాజేష్ అన్న‌ది. అవ‌కాశం వ‌స్తే విల‌న్ న‌టించాల‌నుంద‌ని చెప్పింది. ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఓ సుకుమారి మూవీ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Jul 16, 2026, 7.26 pm IST

Aishwarya Rajesh | హీరోయిన్ రోల్స్ బోర్ కొట్టాయి – విల‌న్‌గా న‌టించాల‌నుంది – ఐశ్వ‌ర్య రాజేష్ కామెంట్స్‌
Advertisement

Aishwarya Rajesh | ఓ సుకుమారి సినిమాలో హీరోయిన్ రోల్ కోసం తెలంగాణ యాస‌లో డ‌బ్బింగ్ చెప్పాన‌ని అన్న‌ది ఐశ్వ‌ర్య రాజేష్‌. స్వ‌త‌హాగా తెలుగు అమ్మాయినే కావ‌డంతో తెలంగాణ యాస నేర్చుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాలేద‌ని చెప్పింది. ఓ సుకుమారి మూవీ ఈ శుక్ర‌వారం (జూలై 17న ) థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తిరువీర్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు భ‌ర‌త్ ద‌ర్శ‌న్ డైరెక్ట‌ర్‌. ఓ సుకుమారి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఐశ్వ‌ర్య రాజేష్ పాత్రికేయుల‌తో ముచ్చ‌టించింది. ఈ సినిమాతో పాటు త‌న కెరీర్ గురించి ఐశ్వ‌ర్య రాజేష్ ఏం చెప్పిందంటే?

దామినిగా....

ఓ సుకుమారిలో దామిని అనే అమ్మాయిగా క‌నిపిస్తా. ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌తో స‌ర‌దాగా నా పాత్ర సాగుతుంది. . న‌న్ను ముట్టుకుంటే ఎదుటివారికి షాక్ త‌గులుతుంది. (నవ్వుతూ) . ఆ పాయింట్ చుట్టే ఈ క‌థ సాగుతుంది. ఇందులో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా క‌నిపిస్తాడు. అత‌డికి ఓ అన్న‌య్య ఉంటాడు. ఇద్ద‌రిలో ఎవరికీ ముందు కొడుకు పుడితే అతనికే ఆస్తి రాస్తానని తండ్రి నిర్ణయిస్తాడు. అదే సమయంలో హీరో లైఫ్‌లోకి దామిని వ‌స్తుంది. ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అత‌డికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? తండ్రి ఆస్తి అత‌డికి ద‌క్కిందా? లేదా? అన్న‌దే మిగిలిన క‌థ‌. టక్ జగదీష్' తర్వాత మ‌రోసారి తీరువీర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా అనిపించింది.

రిస్క్ అనుకోను...

కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం ఎప్పుడూ రిస్క్‌గా భావించ‌ను. ఒక‌ప్పుడు నేను కూడా కొత్త‌దానినే. ఓ దర్శకుడు కథ చెప్పే విధానం, సినిమా బాగా తీయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కం క‌నిపిస్తే కొత్త‌, పాత అని ఆలోచించ‌కుండా సినిమాను అంగీక‌రిస్తా.

వ‌రుస‌గా ఐదు హిట్లు...

కొన్నేళ్ల క్రితం త‌మిళంలో ఓ ఏడాది వరుసగా ఐదు హిట్లు అందుకున్నా. ఆ సంవత్సరం మా ఇంటికి చాలా బొకేలు వచ్చాయి. తర్వాత ఏడాది రెండు హిట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఇంటికి వచ్చే బొకేల సంఖ్య కూడా తగ్గింది. బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా నాలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే నాకు తెలుసు.
మీకు తెలంగాణ యాస కష్టంగా ఉంటుందా?
ఓ సుకుమారి కోసం తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్పా. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఏ యాస కూడా నాకు కష్టంగా అనిపించదు. అన్ని ప్రాంతాల యాసల్లో మాట్లాడగలను. తెలుగు, తమిళ భాషల్లోని వివిధ యాసల్లో నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

34 భాష‌ల్లో రిలీజ్‌...

సినిమాలు, ఓటీటీ ఏ ప్లాట్‌ఫామ్‌ను వదలకూడదని అనుకుంటున్నా. వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ ఉంటుంది. నేను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సుడ‌ల్‌ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఆ సిరీస్ గురించి చాలామంది మాట్లాడేవారు. అది 34 భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్, హాట్‌స్టార్ కోసం రెండు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాను.

యాభై సినిమాలు చేశా...

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్లు రెండు, మూడేళ్ల‌కు మించి ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మ‌నే మాట‌ల‌ను విన్నా. నేనూ అదే నిజం అనుకున్నా. త‌క్కువ టైమ్‌లోనే ఎక్కువ సినిమాలు చేయాలని వ‌చ్చిన‌వ‌న్నీ అంగీక‌రించా. అన్నీ కలుపుకొని ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలు చేశా. నేను చేసిన దాదాపు ప్రతి పాత్ర ఇష్టంతోనే చేశాను.

బోర్ కొట్టాయి...

హీరోయిన్ పాత్ర‌లు బోర్ కొట్టాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌లేదు. విల‌న్‌గా అవ‌కాశం వ‌స్తే న‌టిస్తా. నీలాంబరి తరహా పాత్రలు చేయాలని ఉంది. అలాగే 'అబ్సెషన్‌' లాంటి సినిమాల్లో న‌టించాల‌నుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement