త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణా, అనధికారిక ఖనిజాల తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Sep 21, 2026, 3.57 pm IST

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
Advertisement
  • విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలి..
  • ఖనిజ వనరులతో ఆదాయం పెంచాలి
  • ఖాళీల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి
  • మైనింగ్‌పై సీఎస్ సంజయ్ జాజు ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణా, అనధికారిక ఖనిజాల తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, పరిపాలనా వ్యవహారాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఆదాయ వనరులపై దృష్టి

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సంజయ్ జాజు సూచించారు. శాఖ పనితీరు మరింత మెరుగుపడేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. గనులు, భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిర్యాదులపై తక్షణ స్పందన

అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సూచించారు. పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ జనరల్‌ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌) డీఎస్‌ చౌహాన్, ఐటీ అండ్‌ ఈసీ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్‌ మైన్స్‌ అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement