త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్ర‌మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్‌

Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే అందజేశామని తెలిపారు.

P

Telangana | Published On Sep 29, 2026, 8.37 pm IST

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్ర‌మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్‌
Advertisement

Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే అందజేశామని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ–మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని సీఎం కోరారు. ఈ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని, తద్వారా విద్యుత్‌ వినియోగం, వ్యయం తగ్గుతుందని వివరించారు.

పీఆర్‌ఎల్‌ఐఎస్‌, సీతారామకు పర్యావరణ అనుమతులు

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్‌), సీతారామ సాగర్‌ బహుళార్థక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరుగుతోందని తెలిపారు.

సమ్మక్కసాగర్‌కు అనుమతులపై విజ్ఞప్తి

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు. డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని.. నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ పొందేందుకు చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ వ్యవస్థను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తొలి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని గుర్తుచేశారు. మొదటి దశ పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు రెండో, మూడో దశల టెలీమెట్రీ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర‌మంత్రిని క‌లిసిన వారిలో మంత్రి జీ వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ ఉన్నారు.

Advertisement
Advertisement