Manmohan Singh | భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ : సీఎం రేవంత్‌రెడ్డి
Manmohan Singh | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సేవలను సీఎం కొనియాడారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Manmohan Singh | మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌ను, ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను సీఎం గుర్తుచేశారు.
ఆర్థిక సంస్కరణలకు నాంది
దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ కీలక సంస్కరణలు చేపట్టారని రేవంత్‌రెడ్డి తెలిపారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించారని పేర్కొన్నారు. ఆర్థిక సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో బాధ్యతలు నిర్వహించారని సీఎం గుర్తుచేశారు. దేశ విదేశీ మారక నిల్వలు తీవ్రంగా క్షీణించిన సమయంలో ఆయన అనుభవంతో తీసుకొచ్చిన ఆర్థిక సరళీకృత విధానాలు దేశానికి కీలక మలుపుగా నిలిచాయని అన్నారు.
పేదల కోసం కీలక చట్టాలు
మన్మోహన్ సింగ్ హయాంలో పలు కీలక చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత హక్కు చట్టం, ఆదివాసీ హక్కుల చట్టం, భూసేకరణ–పునరావాస చట్టం వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ శ్రేయస్సు కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. పేదల సంక్షేమం, దేశ ఆర్థిక ప్రగతి కోసం ఆయన చేసిన ఆలోచనలు, సంస్కరణలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లుపై సంతకం
తెలంగాణ చరిత్రను రెండు కీలక ఘట్టాలుగా చూడొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించిన ఘట్టంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాత్రను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. అదేవిధంగా ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై మన్మోహన్ సింగ్ చేసిన సంతకాన్ని స్మారక పార్క్‌లో పదిలపరిచామని తెలిపారు. పార్క్‌ను సందర్శించే ప్రతి ఒక్కరికీ ఆయన స్వదస్తూరి సంతకం కనిపించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు వ్యక్తిగతంగా గౌరవంగా భావిస్తున్నానని సీఎం తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థలకు కేంద్రంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐఎస్‌బీ, అమెరికన్ కాన్సులేట్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న ప్రాంతంలో మన్మోహన్ సింగ్ విగ్రహం, స్మారక పార్క్ ఏర్పాటు చేయడం సముచితమని పేర్కొన్నారు.
భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు?
మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ జాతిరత్నాన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి, పరిపాలనా సంస్కరణలకు విశేష కృషి చేసిన మన్మోహన్ సింగ్ స్మారకం ఢిల్లీలో ఉండాలని సీఎం అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశాలను తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, మాజీ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ
- ●No UPI Day October 2 | అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' : ఆన్లైన్ పేమెంట్స్ బంద్.. షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే!
- ●Night Traffic | ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట వాహనాలకు నో ఎంట్రీ..!
- ●Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో
- ●Gadala Srinivasa Rao | జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడల శ్రీనివాసరావు
- ●Borabanda Belt Shop PD Act | ఆడవాళ్లైతే ఏంది?... తప్పుడు పనులు చేస్తే.. బయటికి రాకుండా జైలు

Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ

No UPI Day October 2 | అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' : ఆన్లైన్ పేమెంట్స్ బంద్.. షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే!

Night Traffic | ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట వాహనాలకు నో ఎంట్రీ..!

Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో



