త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మేం పాల‌కులం కాదు.. మీ సేవ‌కులం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది అని సీఎం

S

Telangana | Published On Jun 2, 2026, 10.21 am IST

CM Revanth Reddy | మేం పాల‌కులం కాదు.. మీ సేవ‌కులం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మమ్మల్ని మేం పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. వారి త్యాగాలకు, తెగువకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కోటి రతనాల వీణ.. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపటి భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2. మనం కలలు కన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని సీఎం తెలిపారు.

అభివృద్దితో పాటు సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత

“పుట్టుక నీది... చావు నీది, బతుకంతా దేశానిది” అన్న ప్రజా కవి కాళోజీ మాటలే మాకు స్ఫూర్తి. రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరువలేనిది. ఎవరెన్ని విమర్శలు, కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలవడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం రెండున్నరేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్దితో పాటు సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో మనం అమలు చేస్తున్నామని ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు అని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు...

తెలంగాణ ఆవిర్భావం ఒక ప్రత్యేక ఘట్టం. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీ తనానికి వ్యతిరేకంగానే పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుంచి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఆ చరిత్రకు మనం సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈ రోజు ప్రజల మనోభావాలకు మేం ప్రతినిధులం.. సమాజ ఆకాంక్షలకు మేం వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేం అధికారం.. అని సంభోదించడం లేదు. మమ్మల్ని మేం పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు... నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి..అని మేం భావిస్తున్నాం... బాధ్యతగా పని చేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు... ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement