త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు

CM Revanth Reddy | మీరు, నేను వేరు కాదు.. క‌ష్టాలు నాకు కొత్త కాదు.. అడ‌వి జీవితం తెలుసు.. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు తెలుసు.. అభివృద్ధి జ‌ర‌గాలంటే క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి.. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం మాది.. మీ కోసం ఎంతైనా కష్టపడుతా.. మీ సమస్యలను ప‌రిష్క‌రిస్తా.. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు.. సోష‌ల్ మీడియాలో అబద్దాలు పెడితే ఒరిగేదేమీ లేదు.. క‌రిగేది లేదు. కానీ మీ వీపులు విమానం మోత మోగుత‌ద‌ని తెలియ‌జేస్తున్నా.. శాస‌న‌స‌భ‌లో తేల్చ‌కుందాం అని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Aug 16, 2026, 6.59 pm IST

CM Revanth Reddy | వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు
Advertisement

32 నెల‌ల్లో 3 గంటలైనా సెల‌వు తీసుకున్నానా..?
సోష‌ల్ మీడియాలో అబ‌ద్దాల‌తో ఒరిగేదేమీ లేదు
మాయ‌గాళ్ల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్దు
ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది..
పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది
బోల్తా ప‌డిన బండిని ప‌ట్టాలెక్కించినం..
ఇక ప‌రుగెత్తించాల్సి ఉంది..
సెప్టెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు
కేసీఆర్ స‌భ‌కు రావాలి
అభివృద్ధిపై చ‌ర్చ చేయాలి
ప‌ర‌కాల స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మీరు, నేను వేరు కాదు.. క‌ష్టాలు నాకు కొత్త కాదు.. అడ‌వి జీవితం తెలుసు.. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు తెలుసు.. అభివృద్ధి జ‌ర‌గాలంటే క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి.. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం మాది.. మీ కోసం ఎంతైనా కష్టపడుతా.. మీ సమస్యలను ప‌రిష్క‌రిస్తా.. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు.. సోష‌ల్ మీడియాలో అబద్దాలు పెడితే ఒరిగేదేమీ లేదు.. క‌రిగేది లేదు. కానీ మీ వీపులు విమానం మోత మోగుత‌ద‌ని తెలియ‌జేస్తున్నా.. శాస‌న‌స‌భ‌లో తేల్చ‌కుందాం అని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 450 కోట్ల‌తో వివిధ‌ అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌లు చేశారు. చెక్ డ్యాంలు, మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియంను కూడా మంజూరు చేస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, సీత‌క్క‌, ఎమ్మెల్యేలు రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, య‌శ‌స్విని రెడ్డి, రాజేంద‌ర్ రెడ్డి, ఎంపీ క‌డియం కావ్య‌, రాజ్య‌స‌భ స‌భ్యులు వేం న‌రేంద‌ర్ రెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

సీఎం ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే..

వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర, చైతన్యం ఉంది. పాలకుల అణచివేతకు గురైన ప్రతీ సందర్భంలో వరంగల్ జిల్లా చైతన్యాన్ని ప్రదర్శించింది కదా. తమకు ఎదురు లేదన్నవాళ్లని మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది. పాలకుర్తిలో మా యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టింది. ఇచ్చిన మాట తప్పకూడదని రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. 32 నెల‌ల్లో 3 గంటలైనా సెల‌వు తీసుకున్నానా..? కాళేశ్వరం కూలేశ్వరమైనా ప్రాజెక్టులను నింపి రైతులు అత్యధిక పంటలు పండించేలా చర్యలు తీసుకున్నాం. ఈ 32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం. రైతులు పండించిన సన్న ధాన్యానికి బోనస్ అందించిన మాట వాస్తవం కాదా? అని సీఎం ప్ర‌శ్నించారు.

సున్నా వ‌డ్డీ రుణాలు అందించాం..

మా ప్రభుత్వంలో ఇద్దరు ఆడబిడ్డలను మంత్రులుగా చేశాం. సున్నా వడ్డీ రుణాలకు గత ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది. కానీ మా ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందించింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ ధృత‌రాష్ట్రుడిలా మారిపోయారు..

రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్‌ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు. కానీ మీ సోదరుడు ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరను సారెగా పెట్టి గౌరవించుకుంటున్నాడని పేర్కొన్నారు.

ప్ర‌తీ ఆరు నెల‌ల‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్లు..

పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం. నిరుద్యోగులు మాయ మాటలకు మోసపోవద్దు. ప్ర‌తీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది. ఆనాడు అధికారం అనుభవించారు.. ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు. రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే మన ప్రభుత్వం పనిచేస్తుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

చ‌ర్చ‌కు సిద్ధంగా ఉండాలి..

శాస‌న‌స‌భ ఏర్పాటు చేయ్ చ‌ర్చిద్దామ‌ని బావ‌బామ్మ‌ర్దులు అంటున్నారు. సెప్టెంబ‌ర్ నెల‌లో అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేస్తా.. మీతో పాటు మీ మామ‌ను కూడా స‌భ‌కు తీసుకురావాలి. మాజీ సీఎంగా, మాజీ కేంద్ర మంత్రిగా అనుభ‌వం ఉన్న కేసీఆర్ స‌భ‌కు రావాలి. వారు తీసుకున్న సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి గురించి చ‌ర్చించాల‌ని అడుగుతున్న‌. రెండున్న‌రేండ్ల‌లో తీసుకున్న అభివృద్ధి ప‌థ‌కాల‌తో పాటు వారు అందించిన అప్పుపై చ‌ర్చించాల‌ని కోరుతున్నాన‌ని సీఎం పేర్కొన్నారు.

కేసీఆర్‌ది ఫ్యామిలీ జ‌స్టిస్.. నాది సోష‌ల్ జ‌స్టిస్

ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావును మంత్రులను చేసుకుండు. కానీ నేను ముఖ్యమంత్రి కాగానే మా సీతక్క, కొండా సురేఖను మంత్రులను చేశా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయ్యాక మా అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి ఇచ్చా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీని చేసుకుండు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు. నేను మా కావ్యను ఎంపీగా, యశస్వినిని ఎమ్మెల్యేగా చేశాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ రావుని ఎంపీని చేసుకుండు. నేను మిత్ర ధర్మంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా చేసుకుండు. నేను ఉద్యమకారుడు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. నేను మహేష్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేశా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం. ప్రజా పాలనతో ప్రజలకు లాభం. కేసీఆర్ చేసింది ఫ్యామిలీ జ‌స్టిస్ అయితే.. నేను చేసింది సోష‌ల్ జ‌స్టిస్. ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోతున్నాం. బోల్తా కొట్టిన బండిని ప‌ట్టాలెక్కించినం.. ఇక ప‌రుగెత్తించ‌డం ఉన్న‌ది.. మీ అంద‌రి ఆశీర్వాదం ఉండాల‌ని కోరుకుంటూ సీఎం త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement