Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : నేను మాట్లాడితే కేసీఆర్ ఉరేసుకుంటడు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్లు కంపౌండ్ మాటలు మాట్లాడొద్దని కేసీఆర్, కేటీఆర్‌ను సీఎం హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య తెలంగాణ ఉంది. నదీ జలాల విషయాల్లో ఉమ్మడి ఏపీలో మనకు తీవ్ర అన్యాయం జరిగింది. వందలాది మంది పిల్లలు ఆత్మబలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పదేండ్లలో కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం కల్పించారు. అయినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. నేను కొట్లాడి సాధించిన మక్తల్ - నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల కావొచ్చు. పదేండ్లు అన్యాయం చేసి పాలమూరును ఎండబెట్టిండ్రు అని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు 2009లో వలసొచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంట్లో నోరు తెరవనోడిని.. మనందరం కలిసి ఎంపీగా గెలిపించాం. రాష్ట్రం వచ్చింది.. ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్‌కు నీళ్లు రాలేదు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. లక్షా 83 వేల కోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు.. కమిషన్లు పొందింది ఆ కుటుంబం. చెప్పులు, బట్టలేక రోడ్ల మీద తిరిగే వాళ్లకు బెంజ్ కార్లు వచ్చాయి. ఒకాయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌజ్, ఇంకో ఆయనకు జన్వాడలో 100 ఎకరాలు, అల్లుడికి మొయినాబాద్‌లో ఫామ్ హజ్ వచ్చింది. వేల కోట్ల వ్యాపారాలు వచ్చాయి. కానీ మనకు నీళ్లు రాలేదు. కృష్ణాలో వరదలు వస్తే అలంపూర్ మునిగిపోతే.. బంజారాహిల్స్‌లో నా ఇల్లు అమ్మి ఇండ్లు కట్టిస్తా ఆ ప్రజలకు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు. కానీ వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. మా బతుకులు బాగుపడాలంటే.. ఇంటోన్ని గెలిపించాలని మా బిడ్డ తెలంగాణకు సీఎం ఉండాలని చెప్పి.. పాలమూరు ఏకమై తెలంగాణకు స్ఫూర్తిగా నిలబడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 8 లక్షల కోట్ల అప్పులు నా నెత్తి మీద పెట్టిండు.. పడావు బడ్డ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకుంటున్నాం.. ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తున్నాం. అన్ని ఉన్న అల్లుని నోట్లు శని ఉన్నట్టు.. ఎన్ని అనుమతులు తెచ్చినా 8 లక్షల కోట్ల అప్పులు నా నెత్తి మీద పెట్టిండు. రెండేండ్లలో సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేసి తెలంగాణను గౌరవ ప్రథమైన స్థానానికి తీసుకొచ్చాను. రెండేండ్ల తర్వాత బయటకు వచ్చిండు.. అనుభవంతో ఏదైనా మంచి చెప్తాడు అనుకున్నా. 180 కేసులు పెట్టి చంచల్‌గూడ, చర్లపల్లి జైల్లో బంధించాడు. నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. అధికారంలోకి వచ్చాక నా కోపాన్ని, బాధను దిగమింగుకున్నాను. పగ సాధించే పని మొదలుపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతదని భావించి తూ వాని పాపాన వాడు పోతాడని అనుకున్నాను. దేవుడు శిక్షించాడు.. ప్రమాణస్వీకారం చేసిన నాడే కూలబడ్డడు, నడుం విరగ్గొట్టుకున్నడు. ఇంత కంటే పెద్ద శిక్ష నేను జైల్లో వేసిన అయ్యేది లేదు. ఆయనకు ఆయనే ఫామ్ హౌస్‌లో బందీఖానాగా మార్చుకున్నాడు. చర్లపల్లి, చంచల్‌గూడ పంపించిన జరిగేది అది. తిండి ఖర్చు ఎక్కువైతది అని పంపలేదు.. ఆయన చేసిన పాపాలకు ఆయన్నే పోతడు అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడుతారు.. రెండేండ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తా అన్నాడు.. మా సర్పంచ్‌లు వచ్చారు రా.. ఏ తోలు తీస్తావో రా. తోలు తీసుడు కాదు.. చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడుతారు. కొడంగల్‌కు రా.. లేదంటే చింతమడకకు తోలుతా.. సోయిలేని మాటలు, స్థాయిలేని విమర్శలు మాట్లాడకు. అక్కరకు వచ్చే మాటలు మాట్లాడు. పాలమూరు - రంగారెడ్డి పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పదేండ్లు పగబట్టి నారాయణపేట్ - మక్తల్ ప్రాజెక్టును పక్కన పెట్టారు. పార్టీలకతీతంగా 69 జీవో కోసం కొట్లాడారు. మాకు నీళ్లు ఇవ్వాలంటే ఎందుకంత కడుపు నొప్పి..? షేక్‌పేట్‌లో మటన్ కొట్టే మస్తన్ ఉంటడు.. కేసీఆర్ తోలు తీస్తడు అంట నౌకరి ఇయ్యండి అని చెప్పినా. రెండేండ్లు ప్రాక్టీస్ చేసిండంట.. సాయంత్రం పోయేటప్పుడు కాళ్లు, తలకాయ ఉచితంగా ఇయ్య్ అని చెప్పిన అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఎద్దెవా చేశారు. పాస్ పోర్టు బ్రోకర్ దందాలు చేయలేదు.. ఫ్యూచర్ సిటీ అంటే తొక్క తోలు అని మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా..? మర్యాద ఉండాలని మాట్లాడుతలేను. నేను మాట్లాడితే ఉరేసుకుని చనిపోతావు. నడుముకు రాయి కట్టుకుని మల్లన్నసాగర్లో దూకి చనిపోతవు. నీలాగా దుబాయ్ పాస్ పోర్టు బ్రోకర్ దందాలు చేయలేదు.. రియల్ ఎస్టేట్‌ను బ్రోకర్ దందా అంటవా..? రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది.. అభివృద్ధిని తీసుకువస్తుంది. నేను దుబాయ్ పంపుతా అని మోసం చేయలేదు.. మేం కక్ష రాజకీయాలు చేయం.. కష్టాన్ని నమ్ముకున్నోళ్లం. మేం ఎవరి సొమ్ము ఆశించాం. మా పని మేం చేసుకుంటాం.. కాళ్లళ్ల కట్టె పెడితే మా సంగతేంటో చూపిస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వం.. ఇదే నా శపథం 2029లో 80 సీట్లకు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి 150 సీట్లకు పెరిగితే 100కు పైగా సీట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు దయాకర్ రావు, వినోద్ రావు అందరికీ ఇదే మా సవాల్. 2029లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్.. నీ రాజకీయం ఏందో చూస్తా. రాజకీయం చేసినంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వం ఇదే నా శపథం. కేసీఆర్ కుటుంబానికి అధికారం ఇక కల. మీకు, మీ పార్టీకి భవిష్యత్ లేదు. కల్లు కంపౌండ్ మాటలు మాట్లాడొద్దు తండ్రీకొడుకులు. 2029లో తేల్చుకుందాం. ఇప్పటికైనా కేసీఆర్ వయసుకు, అనుభవానికి గౌరవం ఇస్తాం. 29 నుంచి సమావేశాలు ఉన్నాయి.. నువ్వు అడిగినన్ని రోజులు సభ నడిపిస్తాం. ముఖాముఖి చర్చ జరుపుదాం. నీళ్లు, నిధులు, నియామకాల మీద మాట్లాడుదాం. ఏ అంశంపై అయినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. చర్చిద్దాం.. దేశానికి ఆదర్శంగా నిలబడుదాం అని రేవంత్ రెడ్డి అన్నారు.