త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

హైదరాబాద్ పోలీసుల పరిధిలో సీజ్ చేసిన, రోడ్లపై వదిలేసిన 2,193 వాహనాలను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. మీ వాహనం ఉంటే వెంటనే ఈ విధంగా క్లెయిమ్ చేసుకోండి.

J

Hyderabad | Published On Aug 13, 2026, 7.44 pm IST

Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ నగర పోలీస్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన, వదిలేసిన 2,193 వాహనాలను పోలీసులు బహిరంగ వేలం వేయనున్నారు. ఈ వాహనాలపై హక్కులు ఉన్న యజమానులు, ఫైనాన్షియర్లు ఆరు నెలల్లోగా వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. సరైన ఆధారాలతో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ (ICCC) భవనంలో ఉన్న సీపీకి దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. వాహనాల పూర్తి జాబితా అంబర్‌పేట్ సీపీఎల్ గ్రౌండ్స్ లేదా హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Advertisement

Hyderabad Police Vehicle Auction | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మహానగరంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన.. అలాగే రోడ్లపై అనాథగా వదిలేసిన (Abandoned) వేలాది వాహనాలను బహిరంగ వేలం (Public Auction) వేసేందుకు సిటీ పోలీసులు సిద్ధమయ్యారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మొత్తం 2,193 వాహనాలను వేలం వేయనున్నట్లు ప్రకటించిన పోలీస్ శాఖ.. ఆయా వాహనాల యజమానులు తమ వాహనాలను క్లెయిమ్ (Claim) చేసుకోవడానికి ఆరు నెలల గడువు విధించింది.

ఆరు నెలల గడువు.. లేదంటే వేలమే

పోలీసుల స్వాధీనంలో ఉన్న ఈ వాహనాలకు సంబంధించి యజమానులు, లేదా ఫైనాన్స్ సంస్థలు ఎవరైనా తమ హక్కులను నిరూపించుకుంటే వాటిని తిరిగి అప్పగిస్తారు. ఇందుకోసం వాహనానికి సంబంధించిన సరైన ఆధారాలతో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) భవనంలో ఉన్న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ప్రకటన వెలువడిన నాటి నుంచి కచ్చితంగా ఆరు నెలల్లోపు ఈ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఆ తర్వాత ఆ వాహనాలను నేరుగా వేలం వేస్తామని సీపీ స్పష్టం చేశారు.

వాహనాల లిస్ట్ ఎక్కడ చూడొచ్చు?

'హైదరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004' సెక్షన్ 7, 'హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్' సెక్షన్ 40 నిబంధనల ప్రకారం లభించిన అధికారాలతో పోలీసులు ఈ వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.

వేలానికి సిద్ధంగా ఉన్న 2,193 వాహనాల పూర్తి వివరాలను అంబర్‌పేట్ పోలీస్ హాస్పిటల్ వెనుక ఉన్న SAR CPL పోలీస్ గ్రౌండ్స్‌లోని 'ఆక్షన్ టీమ్' (Auction Team) వద్ద తెలుసుకోవచ్చు. ఒకవేళ నేరుగా వెళ్లలేని వారు హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ (www.hyderabadpolice.gov.in) లో లాగిన్ అయి వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల వివరాలను ఆన్‌లైన్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. మీ వాహనం ఏదైనా పోలీసుల వద్ద ఉంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్లెయిమ్ చేసుకోండి.

Advertisement
Advertisement