త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | సీఎం రేవంత్ చెప్పిన‌ బ‌ర్బ‌రీకుడు ఎవ‌రో తెలుసా..?

Revanth Reddy | రాష్ట్రంలోని మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉద్యోగులు శిల్పాక‌ళా వేదిక‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తూ.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లుకు మ‌హాభార‌తంలోని ఓ రెండు పాత్ర‌ల‌ను ముడిపెట్టారు. మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బర్బ‌రీకుడు పాత్ర‌ల‌ను ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లులో ఆయ‌న పాత్ర ఏంటో.. అనుసంధానం చేస్తూ.. ఆ క‌థ‌ను సంక్షిప్తంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్ రెడ్డి.

S

Telangana | Published On Mar 6, 2026, 5.53 pm IST

Revanth Reddy | సీఎం రేవంత్ చెప్పిన‌ బ‌ర్బ‌రీకుడు ఎవ‌రో తెలుసా..?
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉద్యోగులు శిల్పాక‌ళా వేదిక‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తూ.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లుకు మ‌హాభార‌తంలోని ఓ రెండు పాత్ర‌ల‌ను ముడిపెట్టారు. మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బర్బ‌రీకుడు పాత్ర‌ల‌ను ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లులో ఆయ‌న పాత్ర ఏంటో.. అనుసంధానం చేస్తూ.. ఆ క‌థ‌ను సంక్షిప్తంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్ రెడ్డి.

నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం. కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు. నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించాను.. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డాను. ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బ‌ల‌హీనుల ప‌ట్ల నిల‌బ‌డి కొట్లాడ‌టం అనే గొప్ప ల‌క్ష‌ణం ఉన్న‌వాడు.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ లో న్యాయం ఉంది.. మీరు బ‌ల‌హీనులు కాబ‌ట్టే నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను అని పేర్కొంటూ మ‌హాభార‌తంలోని క‌ర్ణుడు, బ‌ర్బ‌రీకుడి పాత్ర‌ల‌ను రేవంత్ రెడ్డి త‌న‌కు అన్వ‌యించుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన క‌థ ఏంటంటే..?

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం శాస‌న‌స‌భ‌లో వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఆనాటి పాల‌కులు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, సంప‌త్ కుమార్‌తో పాటు త‌న‌ను స‌భ నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. సంప‌త్‌కుమార్‌, సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు పేగు బంధం ఉండొచ్చు లేదా ఎస్సీ కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం ఉండొచ్చు. మ‌రి మీరు ఎందుకు మాకు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని ఆలోచ‌న చేయొచ్చు. ఈ సంద‌ర్భంగా ఒక్క మాట చెప్ప‌ద‌చ‌లుకున్నా.. మ‌హాభార‌తంలో ఒక్కొక్క‌రిది గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు న‌చ్చొచ్చు. మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బ‌ర్బ‌రీకుడు అనే పాత్ర ఉంది.. క‌ర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు అండ‌గా నిల‌బ‌డ్డ మిత్రుడి కోసం స‌ర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివ‌రి ఊపిరి వ‌ర‌కు అండ‌గా నిల‌బ‌డ్డ‌డు. క‌ర్ణుడు మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌హించిండు. నేను కూడా మిత్రుల కోసం అండ‌గా నిల‌బ‌డ్డాను. మాదిగ‌ల‌ను మిత్రులుగా భావించి అండ‌గా నిల‌బ‌డ్డాను. రెండో పాత్ర‌.. బ‌ర్బ‌రీకుడు.. చాలా మందికి ఈ పాత్ర తెలియ‌దు. భీమ‌సేనుడు కుమారుడు ఘ‌టోత్క‌చుడు.. ఈయ‌న కొడుకు పేరు బ‌ర్బ‌రీకుడు.. ఈయ‌న ప్ర‌త్యేక‌త ఏంటంటే బ‌ల‌హీనుల ప‌క్షాన నిల‌బ‌డి కొట్లాడ‌డ‌మే గొప్ప ల‌క్షణం. యుద్ధంలో దిగిన‌ప్పుడు న్యాయం బ‌ల‌హీనుల వైపు ఉంటే.. న్యాయ‌బ‌ద్ధ‌మైన బ‌ల‌హీనుల కోసం నిల‌బడే గొప్ప ల‌క్షణం ఉన్న‌వాడు బ‌ర్బ‌రీకుడు. న్యాయం మీ వైపు ఉంద‌ని చెప్పి బ‌ల‌హీనుల ప‌క్షాన‌ ఉండి కొట్లాడాల‌ని పోరాడాను. మీ ప‌క్క‌న నేను ఉండ‌క‌పోతే న్యాయం జ‌ర‌గ‌ద‌ని చెప్పి రాజ‌కీయ ఒత్తిళ్లు వ‌చ్చినా ఒక ప్ర‌య‌త్నం చేశాను. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించి.. మాదిగ, మాదిగ ఉప‌కులాల‌కు వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ‌. సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ తర్వాత‌.. ఈ దేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేసిన‌ తొలి రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మ‌హాభార‌తంలో బ‌ర్బ‌రీకుడి పాత్ర ఇదే..

మహాభారతంలో పాత్రల గురించి చెప్పుకుంటే ఒకటా రెండా వందల పాత్రలు..ప్రతి క్యారెక్టర్ కి ఓ ప్రత్యేకత. ఇలాంటి వందల పాత్రల్లో ఒకడు బర్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడే బర్బరీకుడు. తల్లి పేరు మౌర్వి. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభ కనబర్చేవాడు. అస్త్రశస్త్రాల మీదున్న పట్టుచూసి దేవతలు ముచ్చటపడి మూడు బాణాలు అందించారు. ఆ మూడు బాణాలతో ముల్లోకాల్లోనూ తిరుగులేదనే వరాన్నిచ్చారు.

ఓ పక్క బర్బరీకుడు పెరుగుతుండగా..కురుక్షేత్రం సంగ్రామం ఆరంభమైంది. భరతఖండంలో ఉన్న వీరులంతా ఎవరో ఒకరివైపు నిల్చోవాల్సిన తరుణం వచ్చింది. అలాంటి సమయంలో బర్బరీకుడు కూడా సంగ్రామానికి బయలుదేరాడు. తనయుడి బలం తెలిసిన తల్లి మౌర్వి.. ఏ పక్షం బలహీనంగా ఉందో వారికి నీ సహాయాన్ని అందించమని చెబుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కానీ యుద్ధం మొదలయ్యాక లెక్కలు మారిపోతాయ్. అప్పుడు బర్బరీకుడు కౌరవుల పక్షాన నిలవాల్సి రావొచ్చు. అంతటి యోధుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీ కృష్ణుడు. అందుకే బర్బరీకుడిని వారించేందుకు సిద్ధమవుతాడు.

బ్రాహ్మణుడి రూపంలో బర్బరీకుడికి ఎదురుపడి...మూడు బాణాలు తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావ్ అని ఎగతాళిగా అడుగుతాడు శ్రీ కృష్ణుడు. యుద్ధాన్ని ముగించడానికి ఈ మూడు బాణాలే చాలంటాడు.

మొదటి బాణం ఎవర్ని శిక్షించాలో గుర్తిస్తుంది..
రెండో బాణం ఎవర్ని రక్షించాలో గుర్తిస్తుంది..
మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది

యుద్ధాన్ని నిమిషంలో ముగించేందుకు ఈ మూడు బాణాలు చాలని బదులిస్తాడు బర్బరీకుడు. నీ మాటలు నమ్మేలా లేవన్న కృష్ణుడు.. ఈ చెట్టుపై ఉన్న రావి ఆకులు గుర్తిస్తూ తొలిబాణం ప్రయోగించు అంటాడు..

ఆ బాణం చెట్టుమీద ఆకులపై తన గుర్తు వేసి.. ఆ తర్వాత కృష్ణుడి కాలిచుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. మీ కాలి కింద ఓ ఆకు ఉన్నట్టుంది మీ పాదాన్ని పక్కకు తీయండి అని చెప్పాడు బర్బరీకుడు. శ్రీ కృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఆకు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. ఇంత ప్రతిభ ఉన్న బర్బరీకుడు యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అని ఆలోచిస్తాడు. పొరపాటున పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే..పాండవులు తప్పించుకోలేరని గ్రహిస్తాడు. బర్బరీకా! నువ్వు బలహీనుల పక్షాన పోరాడితే నువ్వు సహాయం చేసిన పక్షం వెంటనే బలమైనది అయిపోతుంది. అప్పుడు యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు అంటాడు.

వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు శ్రీ కృష్ణుడు అని గ్రహించిన బర్బరీకుడు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. మహా భారత యుద్ధం ప్రారంభానికి ముందు ఓ వీరుడి తల కావాలని చెబుతాడు. తనను బలి ఇచ్చుకునేందుకు సిద్ధపడతాడు బర్బరీకుడు. అయితే తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనే కోరిక ఉందని ఆ భాగ్యం కల్పించాలని కోరుతాడు. అలా మహావీరుడైన బర్బరీకుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.

ఇలా చేయడం అన్యాయం కదా అని అనిపించవచ్చు.. కానీ శ్రీ కృష్ణుడు ఆ కోరిక కోరడం వెనుక మరో కథనం ప్రచారంలో ఉంది.

బర్బరీకుడు గడిచిన జన్మలో శాపగ్రస్తుడైన యక్షుడు..శాప విమోచనం కలిగించేందుకే తన తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. కలియుగంలో బర్బరీకుడిని పూజిస్తారని..తన పేరు తల్చుకుంటేనే భక్తుల కష్టాలు చిటికెలో తొలగిపోతాయని వరమిస్తాడు కృష్ణుడు.

మరో కథనం ప్రకారం..

బర్బరీకుడి బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల...మిగిలిన శరీర భాగాల కన్నా పాదం బలహీనపడిందని... ద్వాపరయుగాంతం సమయంలో అందుకే ఆ కాలికే బాణం గుచ్చుకుందని చెబుతారు. దక్షిణాదిన బర్బరీకుడి గురించి పెద్దగా తెలియదు..ఉత్తరాదిన ఖాటు శ్యాం పేరుతో ఆరాధిస్తారు. బర్బరీకుడిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Advertisement
Advertisement