త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro | వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే.. మెట్రోపై రేవంత్ రాజ‌కీయ డ్రామాకు తెర లేపారా..?

Hyderabad Metro | అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది, సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార శైలి! మెట్రో ప్రాజెక్టు కోసం రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం చేతిదాకా వచ్చి చేజారిపోయింది. ఇందుకు ముఖ్యమంత్రి వివాదాస్పద వైఖరే కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రుణం పొందడానికి అవసరమయ్యే అన్ని అనుమతులు పూర్తయ్యాయన్నది ప్రభుత్వ వాదన.

a

Telangana | Published On Jun 16, 2026, 7.39 pm IST

Hyderabad Metro | వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే.. మెట్రోపై రేవంత్ రాజ‌కీయ డ్రామాకు తెర లేపారా..?
Advertisement

Hyderabad Metro | అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది, సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార శైలి! మెట్రో ప్రాజెక్టు కోసం రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం చేతిదాకా వచ్చి చేజారిపోయింది. ఇందుకు ముఖ్యమంత్రి వివాదాస్పద వైఖరే కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రుణం పొందడానికి అవసరమయ్యే అన్ని అనుమతులు పూర్తయ్యాయన్నది ప్రభుత్వ వాదన. కాగా, కొన్ని ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదన్నది ఐఆర్ఎఫ్‌సీ వర్గాల ఉవాచ. అందుకే, నిధుల విడుదల నిలిచిపోయిందని సమాచారం. ఇదిలా ఉంటే, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లనే ఐఆర్ఎఫ్‌సీ నుంచి అందాల్సిన రుణం ఆగిపోయిందన్నది తాజా వెర్షన్! సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఒక విజ్ఞప్తి చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. కేవలం తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకారం రాజకీయ డ్రామాకు తెర లేపారు అన్నది అపవాదు.

ఆర్థిక సాయం అందించడం ఐఆర్ఎఫ్‌సీ ప్రధాన విధి

భారతదేశంలోని నవరత్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అగ్రశ్రేణిలో నిలుస్తుంది. ఢిల్లీ కేంద్రంగా 1986లో ప్రారంభమైన ఈ సంస్థ అనతికాలంలోనే ఇండియన్ రైల్వేస్‌కు ఒక బలమైన ఆర్థిక భుజంగా అవతరించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడం ఐఆర్ఎఫ్‌సీ ప్రధాన విధి. ఇందుకోసం, ఆ సంస్థ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మార్కెట్ల నుంచి నిధులు సమీకరించడం పరిపాటి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం మేరకు ఐఆర్ఎఫ్‌సీ ఆపరేషన్స్ కొనసాగుతుంటాయి. కానీ, ప్రభుత్వరంగ సంస్థలన్నీ తప్పనిసరిగా ఏదో ఒక మంత్రిత్వశాఖ పరిధిలో ఉండి, ఆయా శాఖల పరోక్ష పర్యవేక్షణలో కార్యకలాపాలు నెరుపుతుంటాయి అన్నది వాస్తవం.

ఆ వడ్డీ భారాన్ని ఐఆర్ఎఫ్‌సీ భరించాల్సి ఉంటుంది..

ఇదిలా ఉంటే, తమకు అందిన విజ్ఞప్తుల ఆధారంగా ఐఆర్ఎఫ్‌సీ తరఫున ఇవ్వాల్సిన రుణాలను ముందుగా సంస్థ యాజమాన్యం ప్రతిపాదిస్తుంది. ఆ తరువాత వీటిని అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు దాన్ని పరిశీలిస్తాయి. చివరగా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదంతో రుణాన్ని ఆశిస్తున్న వినియోగదారుకు నిధులు మంజూరు చేయడం సాధారణంగా చోటు చేసుకునే ప్రక్రియ. కానీ, భారీ రుణాలను మంజూరు చేసే క్రమంలో ఐఆర్ఎఫ్‌సీ లాంటి సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధిగా సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ మెట్రో రైలు వ్యవహారంలో సరిగ్గా ఇదే జరిగింది. 20 ఏళ్ల కాల పరిమితితో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ [జైకా] నుంచి 4 శాతం [తక్కువ] వడ్డీకి రూ. 13,600 కోట్ల ఆర్థికసాయం పొందేందుకు ఐఆర్ఎఫ్‌సీతో 2026 మే 25 వ తేదీన తెలంగాణ‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు జూన్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆ మొత్తాన్ని తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంది. కానీ, డెడ్ లైన్ ముగిసిన తరువాత సైతం రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు విడుదల చేయలేదు. అయితే, తెలంగాణా అడిగిన సొమ్ము మొత్తాన్ని జైకా సంస్థ ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో జమ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు అధికారులు కూడా రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ సొమ్ము ఇంకా విడుదల కాలేదు కనుక, జపాన్ సంస్థకు కట్టాల్సిన ఆ వడ్డీ భారాన్ని ఐఆర్ఎఫ్‌సీ భరించాల్సి ఉంటుంది అన్నది హెచ్ఎంఆర్ఎల్ వర్గాల ఉవాచ.

సామెతకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి తీరు..

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారానికి రాజకీయ రంగు పులిమారు. నిందను ఇతర పార్టీ నాయకులపై మోపే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జత కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుట్రపూరితంగా నిధులను ఆపారని ఆరోపించారు. కానీ, మెలకువలు తెలియని, నైపుణ్యం లేని పనివాడు తన వైఫల్యానికి పనిముట్లను నిందిస్తాడన్న సామెతకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందన్నది అపవాదు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి ఆర్థిక సాయం పొందాలనుకున్నప్పుడు, సంబంధిత మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను తప్పకుండా సంప్రదించాల్సి ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఆ ప్రయత్నం చేసి ఆయనను పలకరించిన పాపాన పోలేదని ఢిల్లీలోని ఐఆర్ఎఫ్‌సీ వర్గాలు అంటున్నాయి. దీంతో చిర్రెత్తిన కేంద్రమంత్రి తెలంగాణాకు జైకా నిధుల విడుదలకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. లాబీయింగులో తన ఫెయిల్యూర్‌ను మరిపించడానికే రేవంత్ రెడ్డి నెపాన్ని విపక్షాలపై నెడుతున్నారు అన్నది అపప్రద.

Advertisement
Advertisement