CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..
CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమానికి అక్షరాలు, గళం ద్వారా ఊపిరి పోసిన కవి, గాయకుడు అందెశ్రీ తనకు ఆత్మబంధువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ తన పాటలతో గళమెత్తారని సీఎం పేర్కొన్నారు.
- ఆయన పాటలు తెలంగాణ చైతన్యానికి ప్రతీకలు
- అందెశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- సభలో భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి
CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమానికి అక్షరాలు, గళం ద్వారా ఊపిరి పోసిన కవి, గాయకుడు అందెశ్రీ తనకు ఆత్మబంధువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ తన పాటలతో గళమెత్తారని సీఎం పేర్కొన్నారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్న సందర్భాల్లో ఆయన పాటలు తనకు స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. “అందెశ్రీ రాసిన పాటలు కేవలం పాటలు కాదు.. అవి తూటాలు. ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొట్టిన మరఫిరంగులు” అని సీఎం అన్నారు.
ముఖ్యమంత్రి స్థాయికి రావడానికి ఆయన స్ఫూర్తి..
అందెశ్రీ పాటల్లోని చైతన్యమే తనలో పోరాట స్ఫూర్తిని నింపిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడిన సమయంలో కేసులు, ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడేందుకు అందెశ్రీ గానం ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. “ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి అందెశ్రీ ఇచ్చిన స్ఫూర్తి కూడా ఒక కారణం” అని సీఎం పేర్కొన్నారు. తాపీ మేస్త్రీగా ఇటుకపై ఇటుక పేర్చి ఇళ్లు నిర్మించిన అందెశ్రీ.. అదే నైపుణ్యంతో అక్షరంపై అక్షరం పేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్వాలను రగిలించారని కొనియాడారు. అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర గీతంగా మారి ప్రతి బడి, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మార్మోగుతుందని తెలంగాణ ప్రజలు అప్పుడే ఆకాంక్షించారని సీఎం అన్నారు. అయితే, గత పదేళ్లలో కుట్రపూరితంగా ఆ పాటను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. “పెన్నులపై మట్టి కప్పితే గనులై మొలకెత్తుతాయని ఓ కవి చెప్పినట్లు.. నిర్బంధించిన గళం మరింత బలంగా ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రతి బడిలో, ప్రతి గడపలో అందెశ్రీ పాట వినిపిస్తోంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆత్మగౌరవానికి ప్రతీక అందెశ్రీ
అందెశ్రీ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని వదులుకోలేదని సీఎం గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దొరల గడప తొక్కకుండా తన పాటను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశారని చెప్పారు. “తన పాట ప్రజల కోసం తప్ప గడీల్లో కూర్చున్న వారి కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారు” అని అన్నారు. అందెశ్రీ తనకు కుటుంబంలో పెద్దన్న లాంటి వారని పేర్కొన్న సీఎం, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో గడీల పాలనకు ముగింపు పలకాలని భావించిన సమయంలో అందెశ్రీని కలవాలని అనుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులతో మాట్లాడినట్లు బహిరంగంగా కలవడానికి ఆయన తొలుత ఆసక్తి చూపలేదని, కానీ ప్రజల కోసం కలిసి పనిచేయాలనే నమ్మకం కల్పించడంతో ఓ మిత్రుడి ఇంట్లో కలిశారని చెప్పారు. “పది నిమిషాలు మాత్రమే మాట్లాడదామని చెప్పినా.. ఆ సమయంలో తెలంగాణ భవిష్యత్తు గురించి ఎంతో లోతుగా చర్చించారు. ప్రజలంతా ఏకం కావాలని, విష సర్పాన్ని ఎదుర్కొనేందుకు దండు కట్టాలని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి” అని సీఎం తెలిపారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను అందెశ్రీ నిశితంగా గమనించారని, తన కుటుంబ సభ్యులతో తన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.
గద్దర్, అందెశ్రీలకు అవమానం ప్రజల ఆగ్రహానికి కారణం
ప్రజా కళాకారుడు గద్దర్‌ను, అందెశ్రీని గత పాలకులు అవమానించారని సీఎం ఆరోపించారు. ప్రజా భవన్ గేట్ల వద్ద గద్దర్‌ను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం తెలంగాణ ప్రజల మనసులను బాధించిందన్నారు. ప్రజా స్వరాలను అణచివేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడే ప్రజలు మార్పు కోసం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. “గద్దర్ అన్నను, అందెశ్రీని అవమానించిన రోజే ప్రజలు మార్పు కోసం సిద్ధమయ్యారు. ఆ తర్వాత లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి గడీల పాలనకు ముగింపు పలికారు” అని సీఎం అన్నారు. తెలంగాణ జాతికి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని అంకితం చేసిన సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారని సీఎం గుర్తు చేశారు. అందెశ్రీ, గద్దర్, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మంత్రులు, అధికారులు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని, తాను కూడా రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అందెశ్రీ స్మృతి వనం తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఒక గుర్తుగా నిలుస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!






