త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | స‌చివాలయం నిర‌స‌న‌ల‌కు అడ్డాగా మార‌డం సిగ్గుచేటు: హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర న్యూస్: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం.. కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 28, 2026, 6.10 pm IST

Harish Rao | స‌చివాలయం నిర‌స‌న‌ల‌కు అడ్డాగా మార‌డం సిగ్గుచేటు: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం.. కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమ‌ర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయమ‌న్నారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న మాట్లాడారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి.. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోకుండా ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారని ప్ర‌శ్నించారు.

క‌మీషన్లు ఇవ్వ‌లేద‌నే బిల్లులు ఆపుతున్నారా?

బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20 -30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా? రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలేనా? మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి.

రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆవేదన వినే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేదా? 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? 2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం.

సమస్యలు వినడానికే సిద్ధంగా లేని ప్రభుత్వం.. పరిష్కారం ఎలా చూపుతుంది? ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులతో అడ్డుకునే దుస్థితి ఉంది. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”? ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మభ్య పెట్టడం.. అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం.. ఇది ప్రజా పాలనా? లేక కాంగ్రెస్ మార్క్ వంచనా? అని హ‌రీశ్ రావు నిల‌దీశారు.

Advertisement
Advertisement