త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మ‌ల్లారెడ్డి

CM Revanth Reddy | మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సమస్యపై అవగాహనతో, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ

P

Telangana | Published On Sep 7, 2026, 1.29 pm IST

CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మ‌ల్లారెడ్డి
Advertisement
  • రైతాంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
  • ర‌వీంద్ర‌భార‌తిలో కామ్రేడ్ మ‌ల్లారెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌

CM Revanth Reddy | మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సమస్యపై అవగాహనతో, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం సారంపల్లి ఎంతో పోరాడారని తెలిపారు. భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్‌సైక్లోపీడియా సారంపల్లి అని అన్నారు. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. సారంపల్లి మల్లారెడ్డి అంటే వ్యక్తిగతంగా తనకు ఎంతో అభిమానం అని సీఎం తెలిపారు.

కమ్యూనిస్టుల పోరాటానికి కాంగ్రెస్‌ పరిష్కారం

భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడారని, కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దున్నేవాడికి భూమి కోసం కమ్యూనిస్టులు పోరాడారని తెలిపారు. అసైన్డ్‌ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచిందని, 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని చెప్పారు. ఇది కమ్యూనిస్టుల పోరాటానికి.. కాంగ్రెస్‌ పరిష్కారమని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అని, ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ తీసుకొచ్చిందని అన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతి సమస్యను కాంగ్రెస్‌ పరిష్కరించిందని తెలిపారు. ఎన్నికల్లో కలిసినా.. కలవకపోయినా కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగపడిందని సీఎం వ్యాఖ్యానించారు.

మోదీకి వ్యతిరేకంగా పోరాడాలి

మనమంతా కలిసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్త కొత్త విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. SIR పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బెంగాల్‌లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో బూత్‌ల వారీగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు.

స‌ర్‌పై ప్ర‌తిప‌క్షం మాట్లాడ‌డం లేదు

స‌ర్‌పై ప్రధాన ప్రతిపక్షం ఏ ఒక్క మాట మాట్లాడటం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దీని వెనక వారికున్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు వేరు.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరని అన్నారు. ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారని తెలిపారు. ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా అని పేర్కొన్నారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపని అన్నారు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలని పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కేబినెట్‌ సహచరులతో చర్చించి ఇందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement
Advertisement