త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case Hyderabad | బొమ్మల షాపులో బాలుడిపై అకృత్యం.. 56 ఏళ్ల కీచకుడికి మూడేళ్ల జైలు శిక్ష

రాజేంద్రనగర్ పరిధిలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బొమ్మల దుకాణంలో ఈ దారుణం జరిగింది.

J

Hyderabad | Published On Jul 1, 2026, 6.03 pm IST

POCSO Case Hyderabad | బొమ్మల షాపులో బాలుడిపై అకృత్యం.. 56 ఏళ్ల కీచకుడికి మూడేళ్ల జైలు శిక్ష
Advertisement
  • హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన 56 ఏళ్ల నిందితుడికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
  • రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (POCSO) తీర్పు
  • బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని, నిందితుడికి రూ. 1,000 జరిమానా
  • పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితుడికి తగిన శిక్ష పడేలా చేసిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు

POCSO Case Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌ (Hyderabad) లోని బండ్లగూడ జాగీర్‌లో ఓ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జైలు శిక్ష విధించింది. పోక్సో (POCSO) కేసును సమగ్రంగా విచారించిన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ 'ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్'.. నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష (Rigorous Imprisonment) విధిస్తూ జూన్ 30, 2026న తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని గండిపేట మండలం, ఆనంద్ నగర్ కాలనీకి చెందిన పల్లాటి వేణుగోపాల్ (56) గాజుల వ్యాపారం చేస్తుంటాడు. మార్చి 1, 2022న బండ్లగూడలోని 'మారుతి ఫ్యాన్సీ గిఫ్ట్ ఎంపోరియం' అనే బొమ్మల దుకాణానికి ఓ 11 ఏళ్ల బాలుడు వెళ్లాడు. అక్కడ ఆ బాలుడిని గమనించిన నిందితుడు వేణుగోపాల్.. ఒంటరిగా ఉన్నాడనే అలుసుతో లైంగికంగా వేధించాడు.

ఈ దారుణంతో తీవ్రమైన నొప్పితో బాధపడిన ఆ బాలుడు ఇంటికి వెళ్లి.. జరిగిన ఘోరాన్ని తన తండ్రికి ధైర్యంగా వివరించాడు. వెంటనే అప్రమత్తమైన తండ్రి పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ (Complaint) ఇచ్చారు.

పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్

బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. మార్చి 15, 2022న నిందితుడు వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైంటిఫిక్ ఆధారాలు (Evidences) సేకరించి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే, అంటే మార్చి 20న కోర్టులో పక్కాగా చార్జ్‌షీట్ (Charge sheet) దాఖలు చేశారు.

కోర్టు తీర్పు.. పోలీసుల సక్సెస్

ఈ కేసును విచారించిన గౌరవ న్యాయస్థానం.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354-A(1) తో పాటు పోక్సో యాక్ట్ (POCSO Act) కింద నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది. నిందితుడికి 3 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 1,000 ఫైన్ వేసింది. అలాగే బాధిత బాలుడికి రూ. 50,000 పరిహారం కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌వో (SHO) ఎం. ముత్తు యాదవ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (SI) జి. రాములు, ప్రాసిక్యూషన్ తరఫున బలమైన వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ బి. వెంకటేశ్వర్ రెడ్డిల కృషిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. అలాగే కోర్టు డ్యూటీ ఆఫీసర్ వి. కృష్ణయ్య, ఇతర పోలీసు సిబ్బంది సేవలను అభినందించారు. పిల్లల పట్ల ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement