త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మ‌హిళా సంఘాలే రైస్‌మిల్లులు, సూప‌ర్ బ‌జార్లు ఏర్పాటు చేయాలి .. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు..

CM Revanth Reddy | రాష్ట్రంలో మహిళా శక్తిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ, రవాణా, రైస్ మిల్లులు, దళారుల సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On May 25, 2026, 5.49 pm IST

CM Revanth Reddy | మ‌హిళా సంఘాలే రైస్‌మిల్లులు, సూప‌ర్ బ‌జార్లు ఏర్పాటు చేయాలి .. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు..
Advertisement

CM Revanth Reddy | రాష్ట్రంలో మహిళా శక్తిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ, రవాణా, రైస్ మిల్లులు, దళారుల సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను మహిళా సంఘాలే బాధ్యతగా కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్‌లో రైస్ మిల్లులు, గోదాములు కూడా మహిళా సంఘాలే నిర్వహించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. “మీరు స్వయంగా రైస్ మిల్లులు పెట్టుకోండి. అమెజాన్ వంటి పెద్ద సంస్థలు గోదాములు కడుతున్నాయి కదా… మీరు ఎందుకు చేయకూడదు?” అని ఆయన ప్రశ్నించారు. మండలాల్లో అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.

జ‌వాబుదారీగా ఉంటారు..

ప్రస్తుతం దళారులు, మిల్లర్లు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. అదే పని మహిళా సంఘాలకు అప్పగిస్తే ప్రతి గింజకు జవాబుదారీగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రతి మండలంలో లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు ఏర్పాటు చేసి ధాన్యాన్ని భద్రపరిచే వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. ఈ మేరకు మహిళా సంఘాలు, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి మండలంలో రెండు నుంచి నాలుగు స్థలాలను గుర్తించి భూసేకరణ, ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేయాలని సూచించారు. మహిళా సంఘాలతో కలిసి ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపితే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ రుణాలు, జీరో వడ్డీ అంశాలపై ఆర్థిక మంత్రి ఎస్ఎల్‌బీసీ సమావేశం నిర్వహించి అవసరమైన నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.

మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు..

ఇక నగరాల్లో పెరుగుతున్న పెద్ద సూపర్ మార్కెట్ చైన్‌లను ప్రస్తావిస్తూ.. మహిళా సంఘాలు కూడా కార్పొరేట్ స్థాయిలో “మహిళా శక్తి సూపర్ బజార్”లను ఏర్పాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. 67 లక్షల మహిళా కుటుంబాలు ఈ వ్యవస్థలో భాగస్వాములైతే పెద్ద వ్యాపార శక్తిగా మారుతారని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ అందించి, షేర్ల ఆధారంగా మహిళల పెట్టుబడిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతి మహిళ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టి భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో దశలవారీగా సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ బజార్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

నామమాత్ర‌పు అద్దెకు ప్ర‌భుత్వ భూముల లీజు..

ఈ సూపర్ బజార్లకు ప్రభుత్వ భూములను నామమాత్రపు అద్దెకు 30 ఏళ్ల దీర్ఘకాల లీజుపై కేటాయిస్తామని సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పండించే పంటలు, ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యం, ఆర్గానిక్ ఉత్పత్తులు అన్నీ ఈ మార్కెట్లలో విక్రయించేలా వ్యవస్థ రూపొందిస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువులన్నీ ఒకేచోట లభించేలా బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సూపర్ బజార్లు డీమార్ట్, బిగ్‌బజార్ వంటి పెద్ద సంస్థలకు ధీటుగా ఎదగాలని సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. 67 లక్షల కుటుంబాలు ఈ వ్యవస్థలో కొనుగోలు చేస్తే దేశంలోనే అత్యుత్తమ రిటైల్ నెట్‌వర్క్‌గా నిలుస్తుందని అన్నారు.

ఈ సారి చిల‌క‌ప‌చ్చ రంగులో చీరెలు..

మహిళలకు కోటి చీరలు పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వచ్చే విడతలో చిలుకపచ్చ రంగు చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయాలపై కూడా వ్యాఖ్యలు చేసిన సీఎం, కుటుంబ వ్యవస్థ, మహిళల గౌరవం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. “కొందరు అన్నదమ్ములు సొంత చెల్లెల్లను ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నారు. ఈ మధ్యనే రాజకీయాల్లో మీరు చూశారు. సొంత చెల్లెలిని ఇంట్లో నుంచి వెళ్తే… ఆ చెల్లి ఆ అన్నపై ఏ విధంగా శాపనార్థాలు పెడుతుందో చూస్తున్నారు. సొంత చెల్లి భారమైందని ఇంట్లో నుంచి పంపించారు. ఆస్తిలో వాటా అడుగుతారనే కారణంతో పంపించే పరిస్థితి ఉంది” అని సీఎం అన్నారు. మహిళా శక్తి ఆశీర్వాదం ఉన్నంత వరకు ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ఆయన అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా పనిచేస్తున్న అధికారులను ఆయన అభినందించారు.

Advertisement
Advertisement