త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BTech | స‌ర్.. మా స‌ర్టిఫికెట్లు మీ వ‌ద్దే ఉంచుకోండి.. బీటెక్ విద్యార్థుల వేడుకోలు

BTech | ఇంజినీరింగ్ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై, ఫీజుల బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌పై రెడ్కో మాజీ చైర్మ‌న్ వై స‌తీష్ రెడ్డి స్పందించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై రేవంత్ సర్కారు చేతులెత్తేసి.. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆయ‌న నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Apr 18, 2026, 5.44 pm IST

BTech | స‌ర్.. మా స‌ర్టిఫికెట్లు మీ వ‌ద్దే ఉంచుకోండి.. బీటెక్ విద్యార్థుల వేడుకోలు

సంక్షిప్త సారాంశం

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యార్థుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. ఆయా కాలేజీలు బ‌ల‌వంతంగా ఫీజుల‌ను వ‌సూళ్లు చేస్తున్నాయి. ఫీజులు క‌ట్ట‌లేని విద్యార్థులు.. మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌ని ఆలోపు ఫీజులు చెల్లిస్తామ‌ని వేడుకుంటూ కాలేజీల య‌జ‌మాన్యాల‌కు లేఖ‌లు రాస్తున్నారు. ఆ మూడు నెల‌ల్లోగా కూడా ఫీజు చెల్లించకుంటే మా స‌ర్టిఫికెట్లు మీ వ‌ద్దే ఉంచుకోండి అంటూ ప్రాధేయ‌ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితి రాష్ట్రంలోని ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లో నెల‌కొంది.

Advertisement

23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు లేఖ

BTech | త్రినేత్ర‌.న్యూస్ : ఇంజినీరింగ్ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై, ఫీజుల బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌పై రెడ్కో మాజీ చైర్మ‌న్ వై స‌తీష్ రెడ్డి స్పందించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై రేవంత్ సర్కారు చేతులెత్తేసి.. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆయ‌న నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కాలేజీలన్నీ విద్యార్థుల నుండి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అలాగే.. విద్యార్థులతో బలవంతంగా సంతకాలు చేయించి అండర్ టేకింగ్ లెటర్లు రాయించుకొని తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలో బీటెక్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించలేదన్నారు. దీంతో పరీక్ష ఫీజు కట్టాలంటే... ముందుగా విద్యార్థులతో మూడు నెలల్లో ఫీజు చెల్లిస్తామని లెటర్లు రాయించుకుంటున్నాయన్నారు. ఒక వేల జులై నెలలోపు ఫీజు చెల్లించకపోతే క్లాసులకు హాజరు కాకుండా అడ్డుకోవచ్చని.. పరీక్ష ఫలితాలు కూడా ఆపేయవచ్చని.. దీనికి అంగీకరిస్తున్నట్టు.. విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటున్నారని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి చెప్పారు.

సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికే చదువు పూర్తైన 13 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులే ఫీజు చెల్లించుకోవాలని కోర్టు చెప్పడంతో.. ఇప్పుడు చదువుకుంటున్న మరో 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలు కూడా అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే బీటెక్‌లో అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని.. మంచి పథకమని అని కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తామని పాత విద్యార్థులను.. ఫీజు పూర్తిగా కడితేనే బీటెక్‌లో అడ్మిషన్ ఇస్తామని కొత్త విద్యార్థులను.. కాలేజీలు వేధిస్తున్నాయని సతీష్ రెడ్డి తెలిపారు. కేవలం రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే ఇదంతా జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దురుద్దేశంతోనే కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని.. అందుకే విద్యార్ధులే ఫీజు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని.. పేద విద్యార్థుల బతుకులు ఆగం కాకుండా కాపాడాలని సతీష్ రెడ్డి కోరారు. లేకుంటే.. విద్యార్థుల పక్షాన తాము రోడ్డెక్కి.. సర్కారు దుష్ట బుద్ధిని ఎండగడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement