త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కూల్చిన చోటే క‌ట్టిస్తం.. వెలుగుమ‌ట్ల బాధితుల‌కు కేటీఆర్ భ‌రోసా

KTR | కాంగ్రెస్ స‌ర్కార్ ఇండ్ల‌ను కూల్చిన చోటే మేం అధికారంలోకి రాగానే క‌ట్టించి, గృహ ప్ర‌వేశం చేయించే బాధ్య‌త మాది అని ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల బాధితుల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

S

Telangana | Published On Feb 26, 2026, 5.15 pm IST

KTR | కూల్చిన చోటే క‌ట్టిస్తం.. వెలుగుమ‌ట్ల బాధితుల‌కు కేటీఆర్ భ‌రోసా
Advertisement

ఇళ్ల కూల్చివేతల పాపం ఆ ముగ్గురు మంత్రుల‌దే
అక్ర‌మ సంపాద‌న కోస‌మే భూదాన్ భూముల‌పై క‌న్ను
మీ కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం..
ఇదే స్థ‌లంలో ఇండ్లు క‌ట్టించి గృహ ప్ర‌వేశం చేయిస్తం..
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ స‌ర్కార్ ఇండ్ల‌ను కూల్చిన చోటే మేం అధికారంలోకి రాగానే క‌ట్టించి, గృహ ప్ర‌వేశం చేయించే బాధ్య‌త మాది అని ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల బాధితుల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్పమన్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల బాధితుల‌ను పరామ‌ర్శించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా..? శత్రుదేశం మీద దండ యాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో మీ మీద దాడి చేశారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులను ఇక్కడికి రమ్మనండి. ఏ తప్పు జరగక పోతే ఆర్డీవోని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకడిని బలి పశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అని కేటీఆర్ మండిప‌డ్డారు.

ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం

బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన "ఇందిరమ్మ రాజ్యం"లో, ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని ఆయన విమర్శించారు. ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్ నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

బాధితులకు పునరావాస హామీ

కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అండగా నిలిచారు. "మీరు ఎవరూ అధైర్యపడకండి, ఏడవకండి.. మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది" అని ఆయన హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్, చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు.

న్యాయ పోరాటంపై స్పష్టత

ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. కలెక్టర్ తమతో అబద్ధాలు చెప్పారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా, అధికారులు, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వారికి ధైర్యాన్ని నూరిపోశారు.

హృద‌య విదార‌క దృశ్యాలు

ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను కేటీఆర్ పరామర్శించిన సమయంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. బాధితులు తమ కన్నీళ్లను ఆపుకుంటూ, తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను రశీదులు, ఇంటి పన్ను కాగితాలు, విద్యుత్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్‌కి చూపించారు.

"అన్నా, ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చిన కాగితాలు కదా, మరి మా ఇళ్లను ఎలా కూలుస్తారు?" అంటూ వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న తమను, ప్రస్తుత ప్రభుత్వం అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.

Advertisement
Advertisement