KTR | త్రినేత్ర.న్యూస్ : పోతే మా ఒక్క సీటు పోతది.. కానీ సీఎంగా కేసీఆర్ ఉంటడు అని అనుకున్నారు.. అలా రాష్ట్రంలోని పలు నియోజకవర్గంలో జరిగింది.. దాంతోనే మనం అధికారం కోల్పోవాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీంతో కొంతమంది గులాబీ శ్రేణులు సిటీలు కొట్టారు. వెంటనే కేటీఆర్ జోక్యం చేసుకుని.. ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు.. సిగ్గుపడే ముచ్చట అని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడారు. రాష్ట్రంలోని అనేక గ్రామపంచాతయీల్లో గులాబీ సైనికులు వీరోచితంగా పోరాడి, అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఒక్క ఓటుతో, పది ఓట్లతో ఓడిపోయిన వారందరికీ కూడా అభినందలు. గెలిపించిన మీ అందరికీ కూడా అభినందనలు అని గులాబీ సైన్యాన్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో భిన్నంగా పరిస్థితి సర్పంచ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు అధికారంలోకి ఉన్న వారికి అనుకూలంగా జరుగుతాయి. కానీ తెలంగాణలో భిన్నంగా పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది గెలిచారు. 1500 గ్రామాల్లో అరాచకం సృష్టించి గెలిచారు. అయినా కూడా 45 శాతం స్థానాలను బీఆర్ఎస్ గెలిచిందంటేనే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది. రెండేండ్లలోనే తిరుగుబాటు ప్రారంభమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో ఓటు విలువ ఇప్పుడైనా తెలుసుకోవాలి.. రైతుబంధు 11 సార్లు 70 లక్షల మంది ఖాతాల్లో 73 వేల కోట్లు వేశారు కేసీఆర్. ఇప్పుడేమో ప్రతి సీజన్‌కు రైతులు రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండేండ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, గోదావరి నీళ్లు, 24 గంటల కరెంట్ వచ్చేది. కానీ రేవంత్ గెలిచాడు.. అన్ని ఆగిపోయాయి. ఒక్కో ఓటు విలువ ఇప్పుడైనా తెలుసుకోవాలి. దొంగ మాటలు చెప్పి.. ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి.. అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కారు. రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. ఏమన్న అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చామని చెబుతున్నారు. మహిళలకు ఫ్రీ.. మగాళ్లకు డబుల్ టికెట్ చేసిండ్రు. రాష్ట్రాన్ని ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ధనమంతా ఢిల్లీకి పోతున్నది అని కేటీఆర్ మండిపడ్డారు. మీ నిధులకు ఏగొట్టం గాడు కూడా అడ్డం పెట్టే శక్తి లేదు.. కొంతమంది నాయకులు భయపడి పార్టీలు మారారు. కడియం శ్రీహరి కూడా పార్టీ మారారు. కానీ గ్రామస్థాయిలో ఉండే నాయకులు కథా నాయకులై కేసీఆర్ లాగా అద్భుతంగా కొట్లాడారు. మహబూబాబాద్‌లో చేపట్టిన ధర్నాకు భయపడి లగచర్ల నోటిఫికేషన్ రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా సర్పంచ్ సోదరులను కోరుతున్నా.. ఒత్తిడి ఉంటది.. ఇబ్బంది పెడుతరు. పైసలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిధులు ఎవరబ్బ సొత్తో, ఎవరి అత్త సొమ్మో కాదు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్రానికి సీఎం ఎట్లనే పంచాయతీకి సర్పంచ్ అంతే. ఎమ్మెల్యే, ఎంపీలు మీ నిధులకు అడ్డం వచ్చే ప్రయత్నం చేసినా చెల్లదు. రాజ్యాంగంలో నిధులు, విధులు స్పష్టంగా రాశారు. మీ నిధులకు ఏగొట్టం గాడు కూడా అడ్డం పెట్టే శక్తి లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ తిరిగి మళ్లీ సీఎం కావాలన్నది ప్రజల కోరిక.. కేసీఆర్ హయాంలో రూపాయి వస్తే మరో రూపాయి కలిపి నెల నెల పల్లె ప్రగతి నిధులు మంజూరు చేశాం. డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికీ తాగునీరు అందించాం. ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు పడావు పడ్డాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. పారిశుద్ధ్యం ఆగమైపోయింది. కాంగ్రెస్ నేతలకు బుద్ధి వచ్చేలా పని చేయండి. సీఎంకు సిగ్గు వచ్చేట్టు పని చేయాలి. బీఆర్ఎస్ గ్రామాలు అద్భుతంగా ఉన్నాయి.. కాంగ్రెస్ గ్రామాలు వెలవెలబోతున్నాయి అన్నట్టు అద్భుతంగా పని చేయాలి. పంచాయతీ ఎన్నికలతో క్వార్టర్ సెమీ ఫైనల్ అయిపోయింది. ఇక సెమీ ఫైనల్ ఉంది.. మున్సిపాలిటీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు. ఫైనల్స్ 2028 ఎన్నికలు. కేసీఆర్ తిరిగి మళ్లీ సీఎం కావాలన్నది ప్రజల కోరిక అని కేటీఆర్ తెలిపారు.