త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాంగ్రెస్సే అస‌లైన క్రిమిన‌ల్ వేస్ట్

KTR | ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు... యువతను అడుగడుగునా, నిలువునా మోసం చేసిన కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Aug 2, 2026, 4.56 pm IST

KTR | కాంగ్రెస్సే అస‌లైన క్రిమిన‌ల్ వేస్ట్
Advertisement

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై రాహుల్ స్పందించాలి
లేదంటే సీఎం వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన‌ట్లేనా..?
ప్ర‌సంగాల‌తో నాయ‌క‌త్వం స్థాయి పెర‌గ‌దు
గ‌తంలోనూ బీర్ బిర్యానీ బ్యాచ్ అన్నారు
సీఎం అడ్డ‌మైన వ్యాఖ్య‌ల‌ను
తెలంగాణ యువ‌త గ‌మ‌నిస్తోంది

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు... యువతను అడుగడుగునా, నిలువునా మోసం చేసిన కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను "క్రిమినల్ వేస్ట్" అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

ఒకవైపు భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని "క్రిమినల్ వేస్ట్" అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉన్నది. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే. యువత రేపటి భారతదేశ నిర్మాతలు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి. గతంలో ఇదే కాంగ్రెస్ యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ గుర్తుచేసుకోవాలి. యువత తలుచుకుంటే ఆ పార్టీ మెడలు ఎలా వంచుతారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

రాహుల్ గాంధీ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా

తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్యపెట్టిన రాహుల్ గాంధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నాను. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత... యువతకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలపైన మాట్లాడే అర్హత కోల్పోయారు. యువత గురించి రాహుల్ గాంధీ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి విద్యార్థులను, ఇంజనీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం... ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే. కేవలం ప్రసంగాలతో మాత్రమే నాయకత్వం స్థాయి పెరగదని రాహుల్ గాంధీ గుర్తించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతోనే పెరుగుతుందని గుర్తించి రాహుల్ గాంధీ స్పందించాలి. త‌మ పార్టీ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు విద్యార్థులకు, గురువులకు, ఇంజనీర్లకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పలేరు. తెలంగాణ యువత మీ ముఖ్యమంత్రి చేస్తున్న అడ్డమైన వ్యాఖ్యలను గమనిస్తోంది, గుర్తుంచుకుంటుంది అని కేటీఆర్ అన్నారు.

ఎవరు ప్రశ్నిస్తే వారిని తిట్టడం రేవంత్‌కి అలవాటు అయింది..

రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులనే కాకుండా ఇంజనీరింగ్ టీచర్లను కూడా తప్పుగా మాట్లాడారు. యువతపైన, విద్యార్థులపైన అడ్డగోలుగా నోరు పారేసుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. తెలంగాణ యువత ఆత్మగౌరవం పైన, ఆత్మవిశ్వాసం పైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రగతి కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్న అధ్యాపక గురువులను కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గతంలో ఇలాగే యూనివర్సిటీ విద్యార్థులను "బీరు బిర్యానీ బ్యాచ్" అన్నారు. వారి రాజకీయ ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని తిట్టడం రేవంత్‌కి అలవాటు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెంటనే విద్యార్థులకు, గురువులకు క్షమాపణ చెప్పాలి. ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు... యువతను అడుగడుగునా, నిలువునా మోసం చేసిన కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్! ఇప్పటికే మీ హామీల పేరుతో మోసపోయిన యువత అన్ని గుర్తుంచుకుంటుంది.. సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

Advertisement
Advertisement