త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం : కేటీఆర్

KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రాహుల్ బంధు' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని, సంవత్సరానికి రూ. 1,000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

S

Telangana | Published On Mar 9, 2026, 5.42 pm IST

KTR | తెలంగాణ రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం : కేటీఆర్
Advertisement

రైతుబంధు నిధులు రాహుల్ బంధు ప‌థ‌కానికి మ‌ళ్లింపు
అందుకే నాలుగు సార్లు రైతుబంధును ఎగ్గొట్టారు
సీటును కాపాడుకునేందుకే ఢిల్లీకి క‌ప్పం
రేవంత్ మాట‌కు జీరో వాల్యూ
ఆరు గ్యారెంటీల అమ‌లుకు ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రాహుల్ బంధు' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని, సంవత్సరానికి రూ. 1,000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా వేల కోట్ల రూపాయలు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే రాహుల్ గాంధీ కోసం బ్రహ్మాండమైన ఈ కొత్త పథకాన్ని తెలంగాణలో తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ విమర్శలు చేశారు. సిరిసిల్ల కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతుబంధు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెంచి ఇస్తామన్న నిధులను ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటే.. రేవంత్ రెడ్డి రైతుబంధును ఎగ్గొడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, ఈసారి కూడా రైతుబంధును ఎగ్గొట్టాడని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును పక్కన పెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

పేదల ఇళ్లను కూలగొట్టి మరి వ్యాపారం

ముఖ్యమంత్రి తన సీఎం పీఠం కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి ఆయన కుటుంబానికి అడ్డగోలుగా డబ్బులు పంపుతున్నారని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సామంతు రాజు లెక్క రాహుల్ గాంధీ ఢిల్లీ గద్దెకు కప్పం కడుతూ ఉన్నారని, అందుకే రాహుల్ కి చెల్లించాల్సిన కప్పం గురించి పేదల భూములు గుంజుకొని, పేదల ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల పేదల ఇళ్లను కూలగొట్టి మరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారన్నారు.

అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి ప్రతి ఒక్కరూ తెలంగాణకు వచ్చి 100 రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించి, అమలు చేస్తామని రాహుల్ గాంధీతో సహా అందరూ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు బాకీ పడిన ఆరు గ్యారంటీల చట్టంను ఈ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు.

ఆరు గ్యారెంటీల అమ‌లుకు ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లు

అందుకే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి, బిల్లు పెట్టి ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు హామీలు అమలు చేసేలా ప్రయత్నం చేస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఓటు వేయాల్సి వస్తుందని, ఎందుకంటే తమ సొంత నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే తాము అసెంబ్లీలో చెప్తామన్నారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీతో సహా తమ పార్టీ నేతలు అంతా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు.

రేవంత్ మాట‌కు జీరో వాల్యూ

మ‌ధు రిడ్జ్ పార్కులో ఉన్న బిల్డింగ్‌ల‌ను బ్లాక్ చేశాను.. రిజిస్ట్రేష‌న్లు బంద్ చేయించాను. వాటికి జీరో వాల్యూ ఉంద‌ని సీఎం అన్న‌డు. జీరో వాల్యూ అయింది ఆ అపార్ట్‌మెంట్ల‌కు, బిల్డింగ్‌కు కాదు.. జీరో వాల్యూ అయింది ముఖ్య‌మంత్రి మాట‌కు. నీ ముఖానికి ఈ రాష్ట్రంలో జీరో వాల్యూ ఉన్న‌ది. నిన్ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. రైతుబంధు పడ్డదో లేదో తెల్వదు అంటడు.. రుణమాఫీ అయ్యిందో లేదో తెల్వదు అంటడు. మున్సిపల్ మంత్రి అయ్యుండి దోమలు పెరిగిపోయాయి.. ఆటోల్లో చెత్త తీస్తలేరు అని అంటడు. ఇగ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నట్లు? పీకనీకా? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement