త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRS vs BRS | టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంత‌రం.. కార‌ణం ఇదేనా..?

TRS vs BRS | టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ రాష్ట్ర సేన‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. చివ‌రి ప‌దాలు వేరు అయిన‌ప్ప‌టికీ.. టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Apr 26, 2026, 7.33 pm IST

TRS vs BRS | టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంత‌రం.. కార‌ణం ఇదేనా..?
Advertisement

ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం

TRS vs BRS |  త్రినేత్ర‌.న్యూస్ : టీఆర్ఎస్.. బీఆర్ఎస్.. టీఆర్ఎస్.. భ‌లే క‌న్ఫ్యూజ‌న్‌గా ఉంది క‌దా..! రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి(టీఆర్ఎస్) ని ఏర్పాటు చేసి.. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి చవిచూసిన బీఆర్ఎస్.. మ‌ళ్లీ తిరిగి ప్ర‌జల ఆకాంక్ష మేర‌కు టీఆర్ఎస్‌గా పార్టీ పేరును మార్చాల‌ని అగ్ర నాయ‌క‌త్వం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏప్రిల్ 27న పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఏక‌గ్రీవ తీర్మానం చేస్తార‌నే వార్త‌లు కూడా వినిపించాయి. ఇక ఏమైందో ఏమో కానీ.. కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావు ల‌క్ష్యంగా చేసుకున్న‌ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన‌) పేరుతో పార్టీని ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఎందుకంటే..?

క‌విత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన‌(టీఆర్ఎస్)పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. త‌మ పార్టీ పేరును పోలి ఉండ‌డంతో పాటు.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్‌(తెలంగాణ రాష్ట్ర స‌మితి)కు ఇంకా ఆరేళ్ల లాక్ పీరియ‌డ్ ఉంది. దీంతో గ‌డువు పూర్తి కాకుండానే టీఆర్ఎస్‌ను పోలిన పేరును పెట్ట‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని, ఈ క్ర‌మంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈసీ ఆమోదం ఉందా..?

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి ఈసీ ఆమోదం ఉందా..? లేదా..? అన్న విష‌యంపై బీఆర్ఎస్ ఆరా తీస్తున్న‌ట్లు కూడా తెలిసింది. ఒక వేళ‌ ఆమోదం లేకుంటే.. ప‌ర్మిష‌న్ ఇవ్వొద్ద‌ని ఎన్నిక‌ల సంఘాన్ని బీఆర్ఎస్ నాయ‌క‌త్వం కోరే అవ‌కాశం ఉంది.

గ‌తంలో ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన‌ రోడ్ రోల‌ర్, చ‌పాతీ మేక‌ర్..!

టీఆర్ఎస్ పార్టీ ఉన్న‌ప్పుడు కానీ, బీఆర్ఎస్‌గా మారిన త‌ర్వాత కానీ జ‌రిగిన ఆయా ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీని రోడ్ రోల‌ర్, చపాతీ మేక‌ర్ వెంటాడాయి. ఎందుకంటే ఇవి రెండు కూడా కొంత మేర కారు గుర్తును పోలి ఉంటాయి. గ్రామీణ ఓట‌ర్లు, నిర‌క్షరాస్యులు, వృద్ధులు ఈ గుర్తుల విష‌యంలో బాగా క‌న్ఫ్యూజ్ అయ్యేవారు. దీంతో బీఆర్ఎస్‌కు ప‌డాల్సిన ఓట్లు ఇత‌ర అభ్య‌ర్థుల‌కు పోల‌య్యేవి. ఇలా కొన్ని నియోజ‌కవ‌ర్గాల్లో మెజార్టీ త‌గ్గ‌డం, ఓడిపోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సేన‌తో అదే భ‌య‌మా..?

రోడ్ రోల‌ర్, చ‌పాతీ మేక‌ర్ ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకున్న బీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేన‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిసింది. బీఆర్ఎస్, టీఆర్ఎస్‌కు పెద్ద తేడా లేదు. ఒక వేళ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌(తెలంగాణ రాష్ట్ర స‌మితి)గా మార్చితే.. చివ‌రి ప‌దం మాత్ర‌మే వేర‌వుతుంది. స‌మితి, సేన.. ఈ రెండు మాత్ర‌మే వేర్వేరు. కాబ‌ట్టి ఓట‌ర్లు గంద‌ర‌గోళానికి గురయ్యే ప‌రిస్థితి ఉంద‌ని బీఆర్ఎస్ నాయ‌క‌త్వం చ‌ర్చించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే గ‌త అనుభ‌వాల‌ను, పొర‌పాట్ల‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర సేన‌పై ఈసీ వ‌ద్ద యుద్ధం చేసే అవ‌కాశం ఉంది బీఆర్ఎస్.

Advertisement
Advertisement