త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆ మాయ‌మైన ఫైలు ఆచూకీ కోసం సిట్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్

KTR | ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన తొలి సంత‌కం ఫైలు ఎక్క‌డ మాయ‌మైంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిల‌దీశారు. ఆ మాయ‌మైన ఫైలు ఆచూకీ కోసం ప్ర‌త్యేకంగా సిట్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.

S

Telangana | Published On Mar 17, 2026, 12.09 pm IST

KTR | ఆ మాయ‌మైన ఫైలు ఆచూకీ కోసం సిట్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన తొలి సంత‌కం ఫైలు ఎక్క‌డ మాయ‌మైంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిల‌దీశారు. ఆ మాయ‌మైన ఫైలు ఆచూకీ కోసం ప్ర‌త్యేకంగా సిట్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ స‌భ‌లో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్.. భాగ‌వ‌తంలో బమ్మెర పోత‌న రాసిన ఓ ప‌ద్యంతో త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ బొందరే?
వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైన్
బేరైనం గలదే? శిబిప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై
ఈరే కోర్కులు? వారలన్ మఱచిరే ఇక్కాలమున్? భార్గవా!

బ‌మ్మెర పోత‌న భాగ‌వతంలో రాసిన ఈ ప‌ద్యం అర్థం ఏందంటే.. ఆడిన మాట త‌ప్పొచ్చు. అబ‌ద్ధాలు ఆడోచ్చు. అందులో ఏం త‌ప్పు లేదు రాజా అని చెప్పి బ‌లి చ‌క్ర‌వ‌ర్తికి శుక్రాచార్యుడు స‌ల‌హా ఇస్తాడు. అప్పుడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి ఇలా అంటాడు. చ‌రిత్ర నిండా చాలా మంది రాజులు త‌మ ద‌ర్పంతో, గ‌ర్వంతో ఉంటారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసిప‌డ్డ‌వారు సంప‌ద‌ను మూట‌క‌ట్టుకుపోలేరు, ప‌ద‌వుల‌ను వెంట‌బెట్టుకుపోలేరు. భూమిపైన మిగిలేది పేరు మాత్ర‌మే అని చెబుతారు. శిబి చ‌క్ర‌వ‌ర్తి లాంటి వారు అడిగిన వారి కోరిక‌లు తీర్చి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు అని కేటీఆర్ పేర్కొనే సంద‌ర్భంలో అధికార పార్టీ స‌భ్యులు ఆయ‌న ప్ర‌సంగానికి అడ్డు త‌గిలే ప్ర‌య‌త్నం చేశారు. నేను శిబి చ‌క్ర‌వ‌ర్తి గురించి చెప్తున్నాను. మీరెందుకు ఉలికి ప‌డుతున్నారు. విచిత్రంగా గుమ్మ‌డికాయ దొంగ‌లు ఎవ‌రంటే.. అన్న‌ట్టు ఉంద‌ని కేటీఆర్ అన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి విలువ, విశ్వ‌స‌నీయ‌త ఉండాలి

రాచ‌రికంలో అయినా, ప్ర‌జాస్వామ్యంలో అయినా ప‌రిపాల‌న‌లోకి వ‌చ్చిన త‌ర్వాత పాల‌కులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటేనే విశ్వ‌స‌నీయ‌త ఉంటుంది. పార్ల‌మెంట్‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం, శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి విలువ, విశ్వ‌స‌నీయ‌త ఉండాలి.. ఉంటుంది కూడా. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది.. 2023 డిసెంబ‌ర్ 15న నాటి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తొలి ప్ర‌సంగంలో మాట్లాడుతూ.. ప్ర‌జా సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించాం. బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ఇచ్చిన హామీలు చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే ఫైలుపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తొలి సంత‌కం చేయ‌డం ఈ ప్ర‌భుత్వం సంక‌ల్పానికి, చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం అని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

కాకి ఎత్తుకుపోయిందా..? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్ర‌మాదంలో కాలిపోయిందా..?

మ‌రి ఇవాళ ఈ ప్ర‌భుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఆరు గ్యారెంటీలకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ సీఎం సంత‌కం పెట్టార‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. మరి చిత్త‌శుద్ధి, సంక‌ల్పం ఎక్క‌డ‌..? 2024, 2025, 2026 గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాలు అయిపోయాయి.. సీఎం సంత‌కం చేసిన ఫైల్ ఎక్క‌డ పోయింది. 28 నెల‌లుగా ఎక్క‌డ మాయ‌మైంది ఆ ఫైలు. కాకి ఎత్తుకుపోయిందా..? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్ర‌మాదంలో కాలిపోయిందా..? గ‌వ‌ర్న‌ర్ చెప్పిన మాట‌నే కాదు. తొలి కేబినెట్‌లో ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పిస్తామ‌ని మీ బాస్ రాహుల్ గాంధీ కూడా చెప్పారు. కేబినెట్ స‌మావేశాలు 50కి పైగా జ‌రిగాయి. ఎక్క‌డ పోయింది ఆ మాట‌. సీఎం బ‌హిరంగ వేదిక మీద‌ తొలి సంత‌కం చేసిన ఫైలు ఎక్క‌డ పోయింది. ఆ మాయ‌మైన ఫైలు ఆచూకీ కోసం స్పెష‌ల్‌గా సిట్ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నా. ప‌విత్ర స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి విలువ లేకుండా చేశారని కేటీఆర్ ధ్వ‌జమెత్తారు.

Advertisement
Advertisement