త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

కేంద్రం ఒక్క కాలేజీ ఇచ్చిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.

J

Telangana | Published On Sep 21, 2026, 5.42 pm IST

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో మోదీ సర్కార్ ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదా ఒక్క సీటు ఇచ్చిందని నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పడిందని, ఆ క్రెడిట్‌ను కిషన్ రెడ్డి తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
  • కిషన్ రెడ్డి ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర ధ్వజం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల పెంపు వ్యవహారంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కిషన్ రెడ్డి ట్వీట్‌పై ఫైర్..

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన మొబైల్ ఫోన్‌లో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌ను చూపిస్తూ నిలదీశారు. "తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను మోదీ ప్రభుత్వం భారీగా పెంచిందని, 36 ప్రభుత్వ కాలేజీల్లో 4,400 సీట్లు, 30 ప్రైవేట్ కాలేజీల్లో 6,000 సీట్లు ఉన్నాయని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు" అని డాక్టర్ సంజయ్ ధ్వజమెత్తారు.

ఆ ఒక్కటీ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసినప్పటికీ, తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కాలేజీని కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. "కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ గానీ, ఒక్క సీటు గానీ మోదీ ప్రభుత్వం ఇచ్చిందని నిరూపిస్తే.. నేను ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఎప్పటికీ రాజకీయాల వైపు చూడకుండా సాధారణ డాక్టర్‌గా నా వృత్తిలోకి వెళ్లిపోతా" అంటూ డాక్టర్ సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధికి డబ్బా కొట్టుకుంటారా?

తెలంగాణ ప్రజల కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో సొంత నిధులతో కళాశాలలను నిర్మించిందని ఆయన వివరించారు. "ఒక డాక్టర్‌గా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూసి తీవ్ర వేదన చెందుతున్నా. మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకున్నట్లుగా ఉంది బీజేపీ వైఖరి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాజీనామా చేయకుండా తప్పించుకున్న కిషన్ రెడ్డి, నేడు తెలంగాణ ద్రోహిలా వ్యవహరిస్తున్నారు" అని మండిపడ్డారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని మీడియా ప్రతినిధులు సైతం ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement