త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీజేపీది రాజ‌కీయ డ్రామా.. పెట్రోల్ ధ‌ర‌లు పెంచుకుంట మోస‌పు యాత్ర‌లు చేస్తోంది: మంత్రి పొన్నం

Ponnam Prabhakar | ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On May 25, 2026, 3.31 pm IST

Ponnam Prabhakar | బీజేపీది రాజ‌కీయ డ్రామా.. పెట్రోల్ ధ‌ర‌లు పెంచుకుంట మోస‌పు యాత్ర‌లు చేస్తోంది: మంత్రి పొన్నం
Advertisement
  • తెలంగాణ రైతుల‌పై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించండి
  • కేంద్రం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన‌డానికే అనుమ‌తిచ్చింది
  • అద‌నంగా పండిన ధాన్యం కొన‌డానికి కేంద్రం ఒప్పుకోలే
  • క‌ల్లాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కొంటున్నాం
  • రైత‌న్న‌లు బీజేపీ నేత‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • వారిని ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీయండి
  • రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర‌మే కొనాలి
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. ప్రతి గింజను కేంద్రమే కొనాలని..పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ, ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు “రైతు ఘోస- బీజేపీ భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగింది. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని పొన్నం విమ‌ర్శించారు.

75 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొంటాం..

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ సాంక్షన్ చేయడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకే అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు అని మంత్రి ఆరోపించారు.

8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొంటున్నాం..

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించింది అని పొన్నం ప్ర‌భాక‌ర్ వివ‌రించారు.

బీజేపీ ఇచ్చిన‌ హామీలు నెర‌వేర్చ‌లేదు..

ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురిచేసి, 700 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యం కాదు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతులకు మాత్రం నయా పైస రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని మంత్రి పొన్నం మండిప‌డ్డారు.

రైతుల‌కు కేంద్రం క్ష‌మాప‌ణ చెప్పాలి..

మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం రూ.10 మాత్రమే MSP పెంచడం సిగ్గుచేటు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతన్నలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు దేశం చూసింది. రైతుల బాధలను పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకం. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రైతులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement