త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Farmers Commission | 2.3 లక్షల మంది గిరిజన రైతులకు రేవంత్ సర్కార్ వరం: ఆ భూములన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే

పోడు భూములున్నా రుణాల్లేక ఇబ్బంది పడుతున్న 2.3 లక్షల మంది గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూభారతి పోర్టల్‌లో వారి వివరాలు చేర్చింది.

J

Telangana | Published On Jul 1, 2026, 10.00 pm IST

Telangana Farmers Commission | 2.3 లక్షల మంది గిరిజన రైతులకు రేవంత్ సర్కార్ వరం: ఆ భూములన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే
Advertisement
  • ఆర్‌వోఎఫ్ఆర్ (ROFR) పట్టాలున్నా పంట రుణాలు దక్కని 2.3 లక్షల మంది గిరిజన రైతులకు భారీ ఊరట
  • రైతు కమిషన్ నివేదికతో 'భూభారతి' పోర్టల్‌లో పోడు భూముల వివరాలు చేర్చిన సీఎం రేవంత్ రెడ్డి
  • కొత్త మాడ్యూల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6.7 లక్షల ఎకరాలకు కరెంట్, బోర్లు, పంట రుణాలు
  • గతంలో మొక్కజొన్న గిరిజన రైతులకు మల్టీనేషనల్ కంపెనీల నుంచి రూ.4 కోట్ల పరిహారం ఇప్పించిన రైతు కమిషన్

Telangana Farmers Commission | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు చెప్పింది. ఏళ్ల తరబడి అటవీ హక్కుల (ROFR) పట్టాలున్నా, రెవెన్యూ రికార్డుల్లో ఎక్కక ప్రభుత్వ పథకాలకు దూరమైన లక్షలాది మంది రైతులకు శాశ్వత విముక్తి కల్పించింది. రైతు కమిషన్ (Farmers Commission) చొరవతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌లో పోడు భూములను చేర్చేలా కొత్త మాడ్యూల్ (Module) తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

దశాబ్దాల సమస్యకు చెక్

రాష్ట్రంలో సుమారు 2 లక్షల 30 వేల మంది గిరిజన రైతులకు 6 లక్షల 70 వేల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ (ROFR) భూములున్నాయి. అయితే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి (Dharani Portal)లో కానీ, భూభారతిలో కానీ ఈ భూముల వివరాలు నమోదు కాలేదు. దీంతో పట్టాలున్నా పంట రుణాలు (Crop loans), కరెంట్ కనెక్షన్లు, బోర్లు వేసుకునే పర్మిషన్లు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక, కరువు వస్తే నష్టపరిహారం అందక అరిగోస పడ్డారు.

రంగంలోకి దిగిన రైతు కమిషన్

ఈ సమస్యలపై గతేడాది చివర్లో గిరిజన రైతులు తెలంగాణ రైతు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలెర్ట్ అయిన కమిషన్.. తమ కార్యాలయంలో SLBC, రెవెన్యూ, ఫారెస్ట్, ఐటీడీఏ (ITDA), వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక జాయింట్ మీటింగ్ నిర్వహించింది. గిరిజన రైతుల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక సమగ్ర రిపోర్ట్ అందించింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తక్షణమే భూభారతి పోర్టల్‌లో ఆ రికార్డులు కనిపించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గిరిజనులకు పంట రుణాలు, పరిహారం, విద్యుత్ కనెక్షన్లతో పాటు సులభంగా పంట అమ్ముకునే స్వేచ్ఛ దక్కింది.

రైతుల కష్టాలు తీర్చిన సీఎం రేవంత్‌కు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల ఆత్మవిశ్వాసం పెరిగింది: నర్సింహా మూర్తి (మాజీ సర్పంచ్, ములుగు జిల్లా)

"సీఎం రేవంత్ రెడ్డి రైతు కమిషన్ వేయడంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గతంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి వల్ల నష్టపోతే, ఆ మల్టీనేషనల్ కంపెనీల నుంచి కమిషన్ చొరవతోనే రూ.4 కోట్ల పరిహారం వచ్చింది. పాలేం వాగు ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు నీరు అందించేలా రూ.52 లక్షలు మంజూరు చేయించారు. ఒంటిమామిడిలో గిరిజనేతరుల కబ్జాలో ఉన్న 60 ఎకరాలను విడిపించి మాకు ఇచ్చారు. ఇప్పుడు ఆన్‌లైన్ రికార్డులతో మాకు పంట రుణాలు, కరెంట్ వస్తున్నాయి. రైతు కమిషన్ ఆదివాసీలకు ఎంతో మేలు చేస్తోంది."

Advertisement
Advertisement