త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ఎల్‌నినో క‌రువు ప‌రిస్థితుల‌పై త్వ‌ర‌లో అఖిల ప‌క్షం 

Bhatti Vikramarka | ఎల్‌నినో (El Nino) నేప‌థ్యంలో క‌రువు ప‌రిస్థితుల‌పై త్వ‌ర‌లో అఖిలప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని ఉప ముఖ్య‌మంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) తెలిపారు.

S

Telangana | Published On Oct 23, 2026, 7.50 pm IST

Bhatti Vikramarka | ఎల్‌నినో క‌రువు ప‌రిస్థితుల‌పై త్వ‌ర‌లో అఖిల ప‌క్షం 
Advertisement
  • ఈనెల 31 లోపు క‌రువు మండ‌లాల ప్ర‌క‌ట‌న‌
  • శాఖ‌ల వారీగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి
  • ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారిద్దాం
  • కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్: ఎల్‌నినో (El Nino) నేప‌థ్యంలో క‌రువు ప‌రిస్థితుల‌పై త్వ‌ర‌లో అఖిలప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని ఉప ముఖ్య‌మంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈనెల 31లోపు క‌రువు మండ‌లాలను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. తాగునీరు, సాగునీటి లభ్యతను కాపాడటంతో పాటు విద్యుత్‌ సరఫరా, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి వంటి కీలక రంగాలకు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల వారీగా సమగ్రంగా కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించిన‌ట్లు పేర్కొన్నారు. సచివాలయంలో భట్టి అధ్యక్షతన శుక్ర‌వారం నిర్వ‌హించిన‌ కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం (Cabinet Subcommittee First Meeting)లో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్ నినో, కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చించామ‌న్నారు.

కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా గుర్తించి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలి. కరువు ప్రభావాన్ని తగ్గించి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు సమయానికి అందించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి. కరువు పరిస్థితులను శాస్త్రీయంగా విశ్లేషించి, అర్హత కలిగిన మండలాలను గుర్తించాలి. ఇప్పటికే కరువు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు, 20 శాతానికి మించి కరువు ప్రభావం ఉన్న మండలాల పరిస్థితులను కూడా పరిశీలించాలి.

నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశంపై సిఫార‌సులు సిద్ధం చేయాలి. కరువు ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందో ముందుగానే అంచనా వేస్తే, ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించేందుకు వీలవుతుంది. అందుకే ప్రతి శాఖ తన పరిధిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి. తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలి అని భ‌ట్టి ఆదేశించారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందించేందుకు అన్ని శాఖలు తమ అవసరాలను ముందుగానే అంచనా వేయాలని, అత్యవసర ఖర్చుల కోసం ఆర్థిక శాఖ తగిన విధంగా సహకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు రానున్న పంటల సీజన్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.

నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. కరువు, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నారు.

అనంత‌రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రతి వారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి చేపట్టిన చర్యలు, కరువు నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్లు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుత నీటి ఎద్దడి నేపథ్యంలో వరి వేయవద్దని, దీనికి ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలని వ్యవసాయ, నీటిపారుదల శాఖలను ఆదేశించారు. గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సాగు ప్రణాళికలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకొని, కరువు పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్ర‌సంగిస్తూ.. వాస్తవ పరిస్థితులపై రైతులు, సాధారణ ప్రజానీకాన్ని చైతన్య పర్చాలన్నారు. మండలాల్లో భూ గర్భ జలాల మట్టం, వేసవి తీవ్రత తదితర అంశాలపై గణాంకాలను ప్రతీ వారం నివేదికలను జిల్లాల్లో విడుదల చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రజలకు అవసరమైన సమాచారం చేరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నీటి సంరక్షణ చర్యలు, వ్యవసాయ సలహాలు, అందుబాటులో ఉండే సహాయ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ల కు అత్యవసర ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుత ఎల్-నినో, కరువు పరిస్థితులతో రాష్ట్రంలో దాదాపు రూ. 7,000 కోట్లతో కరువు పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీరు, రైతులకు అవసరమైన సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణను సిద్ధం చేసి, దాని అమలుపై నిరంతరం దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్ర‌సంగిస్తూ.. జిల్లాల్లో రోజు రోజుకు చెరువుల్లో నీరు గణనీయంగా తగ్గిపోతుందని తద్వారా చేపల మనుగడకు కష్టంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద రిజర్వాయర్లలో చేపలను వదిలేందుకు ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. పశువులకు తాగునీటి తొట్టెలను ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రతి జిల్లా కలెక్టర్ కు అత్యవసర నిధుల కింద ఒక కోటి రూపాయలను విడుదల చేసిన‌ట్లు తెలిపారు. వర్షపాతం తక్కువగా నమోదు, పంట విస్తీర్ణం 50 శాతం కంటే తక్కువగా ఉండడం తదితర ప్రమాణాలను పరిగణనలో తీసుకొని 358 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. నియమిత గడువైన, ఈనెల 31 తేదీ లోగా కేంద్ర ప్రభుత్వానికి కరువు మండలాల జాబితా ను సమర్పిస్తామని చెప్పారు. మొత్తం 33 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదుకాగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని తెలిపారు. 324 మండలాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకర స్థాయిలో ఉందని వివరించారు. రాష్ట్రం లోని రిజర్వాయర్లలో మొత్తం 470 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీల‌ జలాలు మాత్రమే ఉన్నాయన్నారు. సింగూరు జలాశయాన్ని తానూ స్వయంగా పరిశీలించాన‌ని, ఈ జలాశయంలో నీటి లేమితో ఏర్పడ్డ పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించామన్నారు.

ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

Advertisement
Advertisement