త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | వ‌చ్చే నెల మొద‌టి వారంలో అసెంబ్లీ స‌మావేశాలు.. ఒక‌ రోజుకే ప‌రిమితం?

Assembly Session | అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Session) వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టులో నెల‌లోనే (Assembly Monsoon Session) జరుగుతుంటాయి.

G

Telangana | Published On Jul 30, 2026, 8.14 am IST

Assembly Session | వ‌చ్చే నెల మొద‌టి వారంలో అసెంబ్లీ స‌మావేశాలు.. ఒక‌ రోజుకే ప‌రిమితం?
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Session) వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టులో నెల‌లోనే (Assembly Monsoon Session) జరుగుతుంటాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి సమావేశాలకు ఆరు నెలల గడువు ముగియరాదన్న నియమం ఉంది. ఆ గడువు సెప్టెంబర్ నెలలో ముగియనున్నది. ఈ ఏడాది కూడా గడువులోగా స‌మావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టులో ఉభ‌య స‌భ‌లు స‌మావేశం కానున్నాయి. అయితే ఈ స‌మావేశాలు ఒక రోజుకు మాత్ర‌మే ప‌రిమితం కానున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

చట్ట సభలకు పోటీ చేసేవారి వయోపరిమితిని 25 నుంచి 21 ఏండ్ల‌కు తగ్గించే అంశంపై ప్ర‌భుత్వం బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించ‌నుంది. ఆ త‌ర్వాత అసెంబ్లీ వాయిదా ప‌డనుంద‌ని ప్ర‌భుత్వంలోని ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 21 ఏండ్ల‌కే యువ‌త‌ చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టేలా అవ‌కాశం కాల్పించాల‌ని ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నెక్లెస్ రోడ్డులో విద్యార్థులనుద్ధేశించి ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీని స‌మావేశ‌ప‌రిచి బిల్లును ఆమోదించాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఒక రోజుతోనే సమావేశాన్ని ముగించి, మ‌ళ్లీ సమావేశాల‌ను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో స‌మావేశాల‌కు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చట్టసభల్లో పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గింపు?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ వ్య‌వ‌హారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థుల‌కు సంఘీభావంగా ఈ నెల 25న హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గిస్తే, పీవీ నరసింహారావు 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. సివిల్ సర్వీసెస్ (Civil Services) కు 21 ఏళ్లు అర్హత ఉన్నప్పుడు, చట్టసభలకు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. 21 ఏళ్లకే త్రివేండ్రంలో ఒక యువతి మేయర్ అయ్యారని, 21-22 ఏళ్ల వయసులోనే తెలుగమ్మాయిలు ఐఏఎస్ (IAS) సాధిస్తున్నారని ఉదాహరణలు ఇచ్చారు. బ్రిటన్, జర్మనీ, సింగపూర్ తరహాలో మన దేశంలో కూడా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్నారు.

అసెంబ్లీ తీర్మానం

దీనిపై కార్యాచరణను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయసును 21 ఏళ్లుగా మారుస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. దేశ జనాభాలో 30 శాతం ఉన్న జెన్-జీ యువతకు పార్లమెంటులో కనీసం ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. కేంద్రంలో కూడా విద్యాశాఖ, ఐటీ శాఖలను యువతకు అప్పగిస్తేనే దేశం వేగంగా ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆకాంక్షించారు.

Advertisement
Advertisement