త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

CS Sanjay Jaju | రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. భారత్‌ ఔద్యోగిక వికాస్‌ యోజన (భవ్య) పథకం కింద నాలుగు భారీ ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

P

Telangana | Published On Jul 29, 2026, 7.15 pm IST

CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు
Advertisement

CS Sanjay Jaju | రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. భారత్‌ ఔద్యోగిక వికాస్‌ యోజన (భవ్య) పథకం కింద నాలుగు భారీ ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు నివేదికలను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. భవ్య పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌ పార్కుల పురోగతిపై బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ, మౌలిక వసతులు, ఇతర అంశాలపై చర్చించారు.

మొదటి దశలో ప్రతిపాదిస్తున్న నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు ఒక్కొక్కటి 500 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయని సంజయ్‌ జాజు వెల్లడించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ, ప్రాథమిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత పార్కుల్లో కందుకూరు మండలం తిమ్మాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, ఘట్‌కేసర్‌ మండలం మాదారం, చౌటుప్పల్‌ మండలం దండు మైలారం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని సీఎస్‌ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మరో 16 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, పరిశ్రమలు–వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, సిక్తా పట్నాయక్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement