త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YS Jagan | పాలమూరు – రంగారెడ్డి ముందు పోతిరెడ్డి పాడు తీసికట్టు

YS Jagan | శ్రీశైలం రిజర్వాయర్( Srisailam Reservoir ) లో అత్యంత దిగువ మట్టం 800 అడుగుల వద్ద నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి( Palamauru Rangareddy Lift ), ఇతర లిఫ్ట్ ప్రాజెక్టులకు రోజుకు 3 టీఎంసీలను సామర్థ్యం ఉందని .. కానీ 854 అడుగులకు పడిపోయినా పోతిరెడ్డిపాడు( Pothireddypadu ) నుంచి నీళ్లు పంపలేమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan ) వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్( Rayalaseema Lift ) ప్రాజెక్టుపై తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధంపై జగన్ స్పందించారు.

S

Telangana | Published On Nov 26, 2026, 4.37 pm IST

YS Jagan | పాలమూరు – రంగారెడ్డి ముందు పోతిరెడ్డి పాడు తీసికట్టు
Advertisement

800 అడుగుల దిగువ నుంచే
పాలమూరుకు పుష్కలంగా నీళ్లు
రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకునే అవకాశం
854 అడుగులకు తగ్గితే
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పంపలేం
పై నుంచి నీళ్లు రావడం లేదు
రాయలసీమ లిఫ్ట్ కొత్తదేం కాదు
అవే నీళ్లు.. అవే కేటాయింపులు
సమర్థవంతంగా వాడుకునేందుకే సీమ లిఫ్ట్
కాంగ్రెస్ తో చంద్రబాబు హాట్ లైన్ రాజకీయాలు
ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు

YS Jagan | త్రినేత్ర న్యూస్ : శ్రీశైలం రిజర్వాయర్( Srisailam Reservoir ) లో అత్యంత దిగువ మట్టం 800 అడుగుల వద్ద నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి( Palamauru Rangareddy Lift ), ఇతర లిఫ్ట్ ప్రాజెక్టులకు రోజుకు 3 టీఎంసీలను సామర్థ్యం ఉందని .. కానీ 854 అడుగులకు పడిపోయినా పోతిరెడ్డిపాడు( Pothireddypadu ) నుంచి నీళ్లు పంపలేమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan ) వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్( Rayalaseema Lift ) ప్రాజెక్టుపై తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధంపై జగన్ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అవే నీళ్లు..కానీ స్కీం కొత్తది

రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తున్నదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతన హాట్‌లైన్‌ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడంటూ ఆరోపించారు. "మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు. కొత్త కాల్వలు లేవు. అదనపు రిజర్వాయర్లు లేవు. అదనపు ఆయకట్టూ లేదు.అదే కృష్ణానది. అవే నీళ్లు.అవే కేటాయింపులు అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం.కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య" అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

పాలమూరు రంగారెడ్డి ముందు.. పోతిరెడ్డిపాడు తీసికట్టు

పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 44వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉన్నా.. రిజర్వాయర్ మట్టం 854 అడుగులకు పడిపోతే.. అసలు నీళ్లే పంపలేమని జగన్ వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ సామర్థ్యం ముందు పోతిరెడ్డిపాడు తీసికట్టేనని చెప్పుకొచ్చారు. "పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా?" అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమకు ఉరివేసిన చంద్రబాబు

తనకు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ పనులను పక్కన పెట్టాని జగన్ ఆరోపించారు. "దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్‌ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు" అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement