Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
Vaddiraju Ravichandra | పరీక్ష అనేది కేవలం ఒక ప్రశ్నాపత్రం మాత్రమే కాదని.. అది ఒక విద్యార్థి జీవిత లక్ష్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పడిన కష్టం, ఓ తల్లి కన్నీరు, ఓ తండ్రి చెమట, ఒక యువకుడి భవిష్యత్తు అని పేర్కొన్నారు. ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
- తల్లి కన్నీళ్లు, తండ్రి చెమట, ఒక యువకుడి భవిష్యత్తు అది
- లీకేజీ అంటే దేశ యువత నమ్మకాన్ని వమ్ము చేయడం
- రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన
Vaddiraju Ravichandra | త్రినేత్ర.న్యూస్: పరీక్ష అనేది కేవలం ఒక ప్రశ్నాపత్రం మాత్రమే కాదని.. అది ఒక విద్యార్థి జీవిత లక్ష్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పడిన కష్టం, ఓ తల్లి కన్నీరు, ఓ తండ్రి చెమట, ఒక యువకుడి భవిష్యత్తు అని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, అక్రమాలు జరగడం అంటే కేవలం చట్టాన్ని ఉల్లంఘించడమే కాదన్నారు. అది దేశ యువత నమ్మకాన్ని వమ్ము చేయడమేనని వ్యాఖ్యానించారు. నీట్ లీకేజీ తర్వాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ -2026 బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా రవిచంద్ర మాట్లాడారు. ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి..
ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల శోకం అందరి హృదయాలను కలచి వేసిందన్నారు. అమరులైన విద్యార్థులకు తమ పార్టీ బీఆర్ఎస్ ఘనంగా నివాళులర్పిస్తోందని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తగిన నష్ట పరిహారంతో పాటు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత ఆకాంక్షల కనుగుణంగా స్పందించే పార్టీ బీఆర్ఎస్ అని, నీట్ లీకేజికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు తన పుట్టిన రోజు వేడుకలను కూడా రద్దు చేసుకుని ఈనెల 24న హైదరాబాద్‌లో విద్యార్థులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారన్నారు తెలిపారు.
ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన బలప్రయోగానికి వ్యతిరేకంగా కేటీఆర్ విద్యార్థులతో కలిసి గళమెత్తారని చెప్పారు.
పోలీసుల లాఠీచార్జీ భాష్పవాయు ప్రయోగం ఘటనల్లో గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, విద్యార్థులపై పెల్లెట్స్‌తో కాల్పులు జరిపిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలు విరమించేందుకు విద్యార్థులు, యువత పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందో వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని, లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసినా, కొద్దిమంది అక్రమాలకు పాల్పడిన కారణంగా మళ్లీ రాయాల్సిన పరిస్థితి రావడం శోచనీయమన్నారు. వారు సమయంతో పాటు మానసిక స్థైర్యం దెబ్బతినడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం పెరిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సవరణ బిల్లును తీసుకురావడం స్వాగతించదగినదన్నారు. ఈ బిల్లులో శిక్షలను పెంచడం, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించడం, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఉన్నాయన్నారు. ఈ బిల్లులో వ్యక్తులకు విధించే జైలు శిక్షను పెంచారని, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారని ఎంపీ వద్దిరాజు వివరించారు. పరీక్షల నిర్వహణలో భాగమైన సర్వీస్ ప్రొవైడర్లపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చేశారని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన సంస్థలను 8 ఏళ్ల వరకు డిబార్ చేసే నిబంధన తీసుకొచ్చారన్నారు. సంఘటిత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారని, ఇవన్నీ కఠిన చర్యలేనని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
రాధాకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేసుంటే బాగుండేది..
బీఆర్‌ఎస్ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందని, శిక్షలు పెంచితేనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, నీట్ లీకేజీ నేపథ్యంలో 2024లో ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తే, 101 ప్రతిపాదనలతో నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనల అమలుపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే లీకేజి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి తలెత్తేది కాదన్నారు. రెండేళ్ల కిందట పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల లీకేజీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినా తిరిగి చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. వరుస పేపర్ లీకేజీల ఘటనలతో విసిగి వేసారిన విద్యార్థులు ,యువత విధి లేని పరిస్థితుల్లోనే వీధుల్లోకి రావలసి వచ్చిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఓపిక, సహనం నశించడం వల్లే ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు జెన్ జీ తరం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించిందన్నారు.
ఈ బిల్లు మొత్తం “పేపర్ లీక్ జరిగిన తర్వాత ఏం చేయాలి?” అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు.
నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటును స్వాగతిస్తున్నం..
“పేపర్ లీక్ జరగకుండా ఎలా అడ్డుకోవాలి?” అనే అంశంపై కూడా సమానమైన దృష్టి ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ట్రాన్స్‌మిషన్, బయోమెట్రిక్ యాక్సెస్, జియో-ట్యాగింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రతి పరీక్షకు ముందు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలన్నారు. ఈ చట్టంలో పరిపాలనా బాధ్యత కూడా స్పష్టంగా ఉండాలన్నారు. ఆధార్‌ను విజయవంతంగా నిర్వహించిన టెక్ దిగ్గజం నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని మా పార్టీ స్వాగతిస్తున్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
ఈ బిల్లులోని రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత మంది దర్యాప్తు అధికారులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మంచిదని వద్దిరాజు సలహా ఇచ్చారు. ఈ బిల్లులో హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు అప్పీల్ చేసే అవకాశం కల్పించడం కూడా మంచి అంశమేనన్నారు. దీని వల్ల న్యాయపరమైన పర్యవేక్షణ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కొన్ని సూచనలు చేస్తుందన్నారు. దేశానికి ఇప్పుడు అవసరమైంది కేవలం కొత్త శిక్షలు కాదు.. “జాతీయ పరీక్షల సమగ్రత విధానం” అని అన్నారు. సైబర్ భద్రతా ప్రమాణాలు, ప్రశ్నాపత్రాల ఎన్‌క్రిప్టెడ్ నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ, స్వతంత్ర భద్రతా ఆడిట్లు, అన్ని పరీక్షా సంస్థలకు ఒకే విధమైన భద్రతా ప్రమాణాలు తప్పనిసరి"అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యకు, ఇంజినీరింగ్‌కు, ఫార్మసీకి, మెడికల్ విద్యకు, పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని చెప్పారు. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి లక్షలాది మంది యువత యుపీఎస్సీ,ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, ఎన్టీఏ పోటీ పరీక్షలు రాస్తున్నారన్నారు. వారందరికీ నిజాయితీగా చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పించడమనేది ప్రభుత్వ బాధ్యత అని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
పరీక్షల సంస్కరణలు కేవలం శిక్షలతో ముగియకూడదని, ప్రభుత్వోద్యోగాల భర్తీ కూడా సమయానికి జరగాలని సలహా నిచ్చారు. పరీక్షలు పూర్తయిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి ఫలితాలు ఆలస్యం కాకూడదని వ్యాఖ్యానించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. “మా కష్టాన్ని దోచుకోవద్దు, మా భవిష్యత్తుతో ఆటలాడొద్దు.”అని ఈ దేశ యువత కోరుతోందని స్పష్టం చేశారు. చట్టాన్ని బలపరచడం మంచి విషయమని, కానీ పరీక్షా వ్యవస్థను మరింత బలపరచడం ఇంకా గొప్పదన్నారు. నిజాయితీగా చదివే ఒక్క విద్యార్థి కూడా వ్యవస్థ వైఫల్యానికి బలి కాకూడదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
జులై 30, 2026

KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 30, 2026

BJP MPs | రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిలను పూర్తి చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ ప్రేమలో పడిందా? - బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు వైరల్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



