త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!

Jogulamba Gadwal | ఒక చేతిలో ఇంటి బాధ్యతలు.. మరో చేతిలో కుటుంబ భవిష్యత్తు. ఇన్నాళ్లూ చదువుకు దూరంగా ఉన్న ఆ చేతులకు ఇప్పుడు అక్షరమాల అందుతోంది. ఒక్క అక్షరం నేర్చుకోవడంతో మొదలై.. కుటుంబానికి, సమాజానికి కొత్త దారులు చూపించేలా సాగుతోంది ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం.

P

Telangana | Published On Sep 28, 2026, 5.30 pm IST

Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
Advertisement
  • మహిళా సంఘాల సభ్యుల్లో అక్షరాస్యత పెంపే లక్ష్యం
  • చదువుకున్న సభ్యులతో నిరక్షరాస్యులకు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు
  • ఉల్లాస్‌ పరీక్షలకు 27న జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన
  • జోగులాంబ గ‌ద్వాల క‌లెక్ట‌ర్ రిజ్వాన్‌ బాషా షేక్‌

Jogulamba Gadwal | ఒక చేతిలో ఇంటి బాధ్యతలు.. మరో చేతిలో కుటుంబ భవిష్యత్తు. ఇన్నాళ్లూ చదువుకు దూరంగా ఉన్న ఆ చేతులకు ఇప్పుడు అక్షరమాల అందుతోంది. ఒక్క అక్షరం నేర్చుకోవడంతో మొదలై.. కుటుంబానికి, సమాజానికి కొత్త దారులు చూపించేలా సాగుతోంది ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జోగులాంబ గద్వాల జిల్లాలో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చదువుకున్న మహిళా సంఘ సభ్యుల సహకారంతో నిరక్షరాస్యులకు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ అక్షర జ్ఞానాన్ని అందిస్తున్నారు.

అమ్మ చదివితే.. ఇల్లు వెలుగుతుంది

‘ఒక మహిళ అక్షరాస్యురాలు కావడం అంటే ఒక కుటుంబంలో కొత్త వెలుగు తీసుకురావడమే’ అన్న ఆలోచనతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంటి ఇల్లాలు చదువుకుంటే తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మరింత శ్రద్ధ చూపుతుందని అధికారులు చెబుతున్నారు. చదువుతో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీలు, సామాజిక అంశాలపై అవగాహన పెరగడంతో కుటుంబ నిర్ణయాల్లోనూ మహిళల భాగస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొంటున్నారు. అక్షరాస్యతను కేవలం చదవడం, రాయడం వరకే పరిమితం చేయకుండా.. మరింత ముందుకు తీసుకెళ్లేలా అవకాశాలు కల్పిస్తున్నారు. వయోజన విద్యార్థులు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా దూర విద్యలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీతోపాటు ఇతర స్థాయిల్లోనూ విద్యను కొనసాగించేందుకు అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

చదువు.. ఆగని ప్రయాణం

చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు, ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కని నిరక్షరాస్యులు ప్రత్యేక వయోజన విద్యా కేంద్రాలను వినియోగించుకుని విద్యను కొనసాగించాలని జిల్లా యంత్రాంగం పిలుపునిస్తోంది. అక్షరాస్యత పెరిగితే కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లోనూ సానుకూల మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ పేర్కొన్నారు. అక్షరమాల కార్యక్రమంలో భాగంగా చదువుకున్న మహిళలకు ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్‌ పరీక్షలను నిర్వహించారు. అన్ని మండలాల్లో మొత్తం 33,783 మంది అభ్యర్థులకు గాను 24,832 మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 3,077 మంది అభ్యర్థులకు గాను 2,564 మంది పరీక్ష రాశారు. అక్షరం నేర్చుకోవాలన్న ఆసక్తికి.. అవకాశం కల్పించే చేయూత తోడైంది. మహిళా సంఘాల వేదికగా మొదలైన ఈ ప్రయత్నం.. ఒక్కో ఇంట్లో అక్షర వెలుగులు నింపుతూ ముందుకు సాగుతోంది. ‘అమ్మకు అక్షరమాల’తో చదువు నేర్చుకుంటున్న ప్రతి మహిళ వెనుక.. విద్య వైపు అడుగులు వేస్తున్న ఓ కుటుంబం ఉంది.

Advertisement
Advertisement